‘మన డాక్టర్ బాబే’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజ్ తరుణ్, అలీ సందడి!
నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు ‘మన డాక్టర్ బాబే’.. సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించిన రాజ్ తరుణ్, అలీ
శరణ్య, సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్‌పై కృతాక్షి నిర్మాణంలో తేరు చలపతి కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మన డాక్టర్ బాబే’. ఈ చిత్రంతో శ్రీ స్కంద హీరోగా పరిచయం అవుతున్నారు. మోహన సిద్ధి, శృతి శంకర్, అలీ, రాజీవ్ కనకాల, శాంతి, కోటేశ్వరరావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. నవంబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా ఆదివారం చిత్ర యూనిట్ ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ హీరో రాజ్ తరుణ్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
అలీ మాట్లాడుతూ.. చలపతిపై నమ్మకంతో శ్రీ స్కంద తన సొంత డబ్బులు పెట్టి ఈ చిత్రాన్ని నిర్మించారని, వారిద్దరి కష్టాన్ని తాను దగ్గరగా చూశానని అన్నారు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా ప్రేక్షకులు చూడరని, కథలో బలం, కంటెంట్ ఉంటే తప్పకుండా విజయాన్ని అందిస్తారని పేర్కొన్నారు. నవంబర్ 20న విడుదలవుతున్న ‘మన డాక్టర్ బాబే’ చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి విజయవంతం చేయాలని కోరారు.
రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. హీరోగా, నిర్మాతగా పరిచయం అవుతున్న శ్రీ స్కందకు అభినందనలు తెలిపారు. తెలుగు హీరోయిన్లకు అవకాశాలు రావడం ఆనందంగా ఉందన్నారు. అలీ గారితో కలిసి నటించే అవకాశం రాకపోయినా, ఆయనతో వేదిక పంచుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. దర్శకుడు చలపతికి ఈ సినిమాతో మంచి విజయం దక్కాలని ఆకాంక్షించారు. నవంబర్ 20న థియేటర్లలో విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు చూసి విజయవంతం చేయాలని కోరారు.
హీరో శ్రీ స్కంద మాట్లాడుతూ.. ఇప్పటికే సినిమాకు ప్రీమియర్లు ప్రదర్శించామని, చూసిన వారంతా అద్భుతంగా ఉందని ప్రశంసించారని తెలిపారు. దర్శకుడు చలపతి సినిమాను నవ్విస్తూ మంచి సందేశాన్ని అందించేలా తెరకెక్కించారని చెప్పారు. భావోద్వేగ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా సినిమా ఉంటుందని అన్నారు. అలీ గారితో కలిసి నటించడం తన అదృష్టమని పేర్కొంటూ, ఈ ప్రయాణంలో సహకరించిన కృతాక్షి, గౌతమ్, మురళి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.

దర్శకుడు తేరు చలపతి కుమార్ మాట్లాడుతూ.. శ్రీ స్కంద సహకారం వల్లే ‘మన డాక్టర్ బాబే’ సినిమా ఈ స్థాయికి చేరుకుందని తెలిపారు. శృతి శంకర్, మోహన సిద్ధి చక్కగా నటించారని, నిర్మాత కృతాక్షి నిర్మాణంలో ఎక్కడా రాజీ పడలేదని అన్నారు. అలీ కామెడీ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు. రాజీవ్ కనకాల, శాంతి తదితర నటీనటులు అద్భుతంగా నటించారని తెలిపారు. తమ కార్యక్రమానికి విచ్చేసిన రాజ్ తరుణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
శృతి శంకర్ మాట్లాడుతూ.. తమ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు విచ్చేసిన రాజ్ తరుణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు చలపతితో పనిచేయడం ఆనందంగా ఉందని, శ్రీ స్కంద సహకారంతో సినిమా ఈ స్థాయికి చేరుకుందని పేర్కొన్నారు. ప్రేక్షకులందరూ సినిమాను చూసి విజయవంతం చేయాలని కోరారు.
మోహన సిద్ధి మాట్లాడుతూ.. ‘మన డాక్టర్ బాబే’ టీజర్, ట్రైలర్ ప్రేక్షకులకు నచ్చాయని ఆశిస్తున్నానని తెలిపారు. దర్శకుడు చలపతి షూటింగ్ సమయంలో అందరినీ ఎంతో బాగా చూసుకున్నారని, సినిమాటోగ్రాఫర్ కిషోర్ తమ అందరినీ తెరపై అద్భుతంగా చూపించారని అన్నారు.
‘కూర్మావతారం’ దర్శకుడు హర్షవర్ధన్ మాట్లాడుతూ.. దర్శకుడు చలపతి మంచి వ్యక్తి అని, ‘మన డాక్టర్ బాబే’ ట్రైలర్ ఆకట్టుకుందని తెలిపారు. నవంబర్ 20న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు చూసి ఆదరించాలని కోరారు.

నటీనటులు: శ్రీ స్కంద, మోహన సిద్ధి, శృతి శంకర్, అలీ, రాజీవ్ కనకాల, శాంతి, కోటేశ్వరరావు తదితరులు.
సాంకేతిక బృందం:
బ్యానర్: స్కంద ఫిల్మ్స్
నిర్మాత: కృతాక్షి
దర్శకుడు: తేరు చలపతి కుమార్
రచయిత: రామకృష్ణ గరగ
సంగీతం: మనోజ్ కుమార్ బూసం
ఛాయాగ్రహణం: కిషోర్ బోయిదాపు
ఎడిటర్: సెల్వ కుమార్
గీత రచన: రాంబాబు గోసాల, శర్వాణి సిరి
పీఆర్వో: సాయి సతీష్
నవంబర్ 20న ‘మన డాక్టర్ బాబే’ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.


