వై.ఎస్. అంజిలి రెడ్డి వివాహం నిశ్చయం
హైదరాబాద్
: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల” కుమార్తె వై.ఎస్. అంజిలి రెడ్డి వివాహం డాక్టర్ సోమల రఘురామ్ రెడ్డితో నిశ్చయమైంది. ఈ విషయాన్ని వై.ఎస్. షర్మిల సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
తన భర్త అనిల్ కుమార్‌తో కలిసి దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, తమ కుమార్తె అంజిలి రెడ్డి వివాహం డాక్టర్ సోమల రఘురామ్ రెడ్డితో నిశ్చయమైన శుభవార్తను ఎంతో ఆనందంగా పంచుకుంటున్నట్లు షర్మిల తెలిపారు.


డాక్టర్ సోమల రఘురామ్ రెడ్డి.. శ్రీ సోమల సుబ్బారెడ్డి, శ్రీమతి సోమల పద్మారెడ్డి దంపతుల కుమారుడని ఆమె పేర్కొన్నారు. సోమల కుటుంబ సభ్యులంతా అమెరికా పౌరసత్వం కలిగి ఉన్నారని, వారి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా అని షర్మిల వెల్లడించారు.
అంజిలి రెడ్డి, డాక్టర్ రఘురామ్ రెడ్డిల వివాహం సంతోషంగా జరగాలని ఆకాంక్షిస్తూ, తమ కుమార్తెకు కాబోయే అల్లుడికి స్నేహితులు, శ్రేయోభిలాషులు తమ ప్రార్థనలు, ఆశీర్వాదాలు అందించాలని వై.ఎస్. షర్మిల కోరారు.

“హల్లెలూయా!” అంటూ ఈ శుభవార్తను షర్మిల సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.


