20 ఏళ్ల పగ.. అదును చూసి వేటకొడవళ్లతో దారుణ హత్య
గుంటూరులో పాత కక్షలు మరోసారి భగ్గుమన్నాయి.. నడిరోడ్డుపై దాడి చేసి హతమార్చిన ప్రత్యర్థులు
గుంటూరు: రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న పాత కక్షలు మరోసారి భగ్గుమన్నాయి. 20 ఏళ్ల నాటి పగతో పెండ్ర చిన్నా అనే వ్యక్తిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేసిన ఘటన గుంటూరులో తీవ్ర కలకలం రేపింది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే వేటకొడవళ్లతో దాడి చేసి హతమార్చినట్లు సమాచారం.
2006లో మొదలైన వివాదం
చిన్నా భార్యతో బుల్లయ్య అనే వ్యక్తి చనువుగా ఉంటున్నాడనే అనుమానంతో అప్పట్లో ఇరువర్గాల మధ్య వివాదం మొదలైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఏర్పడిన పాత కక్షలు మరింత పెరిగాయి. 2006లో బుల్లయ్య హత్యకు గురయ్యాడు.
తనకు కూడా ప్రత్యర్థుల నుంచి ప్రాణహాని ఉందని భావించిన పెండ్ర చిన్నా గుంటూరు విడిచి వెళ్లిపోయాడు. తొలుత మంగళగిరిలో, అనంతరం సూర్యాపేటలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నట్లు సమాచారం.

మేనమామ అంత్యక్రియలకు వచ్చి..

ఇటీవల తన మేనమామ మరణించిన విషయం తెలియడంతో ఆఖరి చూపు కోసం చిన్నా గుంటూరులోని కొండ వెంకటప్పయ్య కాలనీకి వచ్చాడు. చిన్నా తిరిగి గుంటూరుకు వచ్చిన విషయాన్ని ప్రత్యర్థులు గమనించినట్లు తెలుస్తోంది.
అదును కోసం వేచి చూసిన ప్రత్యర్థులు.. చిన్నా టీ తాగేందుకు బయటకు వచ్చిన సమయంలో అతడిని వెంబడించారు. ముందుగా కర్రలతో దాడి చేసి కిందపడేసిన అనంతరం వేటకొడవళ్లతో విచక్షణారహితంగా నరికి చంపినట్లు సమాచారం.
కుటుంబ సభ్యులపై పోలీసుల అనుమానం
ఈ హత్యకు 2006లో హత్యకు గురైన బుల్లయ్య కుమారులు, వారి కుటుంబ సభ్యులే పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పాత కక్షలే హత్యకు కారణమా? మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నడిరోడ్డుపై జరిగిన ఈ దారుణ హత్యతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.


