స్థానిక పోరుకు వైఎస్సార్సీపీ సమాయత్తం.. క్షేత్రస్థాయిలో కార్యాచరణకు పిలుపు
ఆత్మకూరు : దసౌత్ 9:
స్థానిక సంస్థల ఎన్నికలను తొలి మెట్టుగా భావించి సమష్టిగా పనిచేయాలని వైఎస్సార్సీపీ నియోజకవర్గ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో కార్యాచరణ ప్రారంభించాలని సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆత్మకూరు పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో గురువారం ఆత్మకూరు పట్టణ, రూరల్, అనుమసముద్రంపేట మండలాల నాయకులు, కార్యకర్తలతో మేకపాటి విక్రమ్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ పార్టీ పరిశీలకులు పేర్పాటి కోటేశ్వరరెడ్డి, ఉదయగిరి నియోజకవర్గ పార్టీ పరిశీలకులు కూనం సుధాకర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మేకపాటి విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని అన్నారు. మహిళలకు ఆర్థిక సహాయం, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులు, చేనేత కార్మికులకు అమలు చేసిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు పింఛన్లపై ప్రకటనలు చేయడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు తీరుపై ప్రజలకు వాస్తవాలను వివరించాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. గ్రామస్థాయిలో ప్రజా సమస్యలను గుర్తించి వాటిపై నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలో స్థానిక నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని మేకపాటి విక్రమ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆత్మకూరు మున్సిపాలిటీతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ స్థానాలకు పార్టీ అభ్యర్థుల ఎంపికపై ముందుగానే కసరత్తు ప్రారంభించాలని సూచించారు. ప్రతి మండలంలో నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం పెంచుకుని ఎన్నికల కార్యాచరణ రూపొందించుకోవాలని అన్నారు.

అనంతరం పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న నాయకులు, కార్యకర్తలను గుర్తించి వారికి పార్టీ పదవుల గుర్తింపు కార్డులను మేకపాటి విక్రమ్‌రెడ్డి అందజేశారు. పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తను గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు.


