*ఉజ్వల భవిష్యత్తును ఆలోచించే సంక్షేమ పథకాలు : మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి*
*: విద్యతోనే ఉన్నతస్థాయికి*
*: హైలెవల్ కెనాల్ పూర్తితో ప్రతి ఎకరాకు సాగునీరు*
*: కృష్ణాపురం, బెడుసుపల్లిలో రచ్చబండ నిర్వహించిన మాజీ ఎంపీ మేకపాటి*
రాష్ట్రంలో ప్రజలందరికి సంక్షేమ పథకాలను రూపొందించి అందించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, ఆయన కుమారుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అలాంటి మరిన్ని పథకాలను తీసుకొచ్చారని, ప్రతి ఒక్కరి ఉజ్వల భవిష్యత్తును ఆలోచించే ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలను రూపొందించారని, రానున్న ఎన్నికల్లో ప్రజలంతా మళ్లీ ఆయనను ఆశీర్వదించాలని నెల్లూరు పార్లమెంట్ మాజీ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు.
శనివారం మర్రిపాడు మండలం కృష్ణాపురం, బెడుసుపల్లి గ్రామాలలో ప్రజాప్రతినిధులు, నాయకులతో కలసి రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజలను సంక్షేమ పథకాల అందుతున్న తీరును, ప్రజలకు అవసరమైన అభివృద్ది పనులను గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాజీ పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం పేరుతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారని, ప్రస్తుతం ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాటన్నింటిని పూర్తి చేసుకుంటూ వస్తున్నారని అన్నారు.
ఈ ప్రాజెక్టుల్లో భాగంగా మన ప్రాంతానికి ఎంతో ఉపయోగపడే వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిందని, రానున్న రోజుల్లో దీని ద్వారా మన జిల్లాకు సాగునీరు అందుతుందని, అదే విధంగా ఉదయగిరి, ఆత్మకూరు మెట్ట నియోజకవర్గాల కోసం హైలెవల్ కెనాల్ నిర్మాణం కూడా జగన్ మోహన్ రెడ్డి అతి త్వరగా పూర్తి చేస్తారని, దీని ద్వారా మెట్ట నియోజకవర్గాల్లో ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో విద్యాభివృద్ది కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చారని, నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్ స్థాయికి అప్ గ్రేడ్ చేసిన ఆయన విద్యార్థుల చదువులకు అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నారని అన్నారు. మెట్ట ప్రాంతంలో విద్యాభివృద్ది కోసం తమ కుటుంబం నవోదయ పాఠశాల, డిగ్రీ కళాశాలతో పాటు ఉదయగిరిలో మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయశాయ కళాశాల ఏర్పాటు చేయడం జరిగిందని, చదువుతోనే ఉన్నతస్థాయికి చేరుకోవచ్చునని అన్నారు. మన ప్రాంత విద్యార్థులు ప్రతి ఒక్కరూ బాగా చదువుకుని ఉన్నతస్థాయికి చేరాలని ఆకాంక్షిస్తున్నామని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలందరూ గుర్తుంచుకునే విధంగా ఎన్నో సంక్షేమాభివృద్ది కార్యక్రమాలను నిర్వహించారని, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తమ ప్రభుత్వంలో ప్రజలు గుర్తుంచుకోదగ్గ ఒక్క సంక్షేమ పథకమైనా గుర్తుందా అని ప్రశ్నించారు. అధికారం కోసమే పొత్తులు పెట్టుకుని వస్తున్నారని, ఇలాంటి పొత్తులను ప్రజలు నమ్మవద్దని అన్నారు.
వైఎస్సార్సీపీ తరపున నెల్లూరు పార్లమెంట్ సభ్యునిగా పోటి చేస్తున్న రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని, ఆయన మన ప్రాంతానికి పార్లమెంట్ అభ్యర్థిగా రావడం శుభ పరిణామమని, ఆయనతో పాటు ఆత్మకూరు ఎమ్మెల్యేగా మేకపాటి విక్రమ్ రెడ్డి పోటి చేస్తున్నారని, వీరికి మీ సహకారం అందిస్తే రానున్న రోజుల్లో మన జిల్లాకు, మన నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ది చేస్తారని పేర్కొన్నారు.
Comments are closed.