*బలమైన అభ్యర్థి కోసం ఎదురుచూస్తున్నాం : ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*
*: ప్రజలు పనిచేసేవారినే ఎన్నుకుంటారు*
*: తాతిరెడ్డిపల్లి, పుట్టువారిపల్లి, రాజవోలు గ్రామాలలో విజయీభవయాత్ర*
*: అభివృద్ది పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే మేకపాటి*
*: బాధిత కుటుంబానికి స్వంత నిధులు అందచేసిన ఎమ్మెల్యే*
రానున్న ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ తరపున తాను పోటి చేస్తున్నానని, నాకు ప్రత్యర్థిగా ఎవరైన బలమైన అభ్యర్థిగా రావాలని ఎదురుచూస్తున్నామని, సంవత్సరం రోజుల నుంచి చెబుతున్నారే కానీ ఎవరూ అభ్యర్థిగా మాత్రం కనిపించడం లేదంటూ ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నిర్వహిస్తున్న విజయీభవయాత్రను సోమవారం ఏఎస్ పేట మండలం తాతిరెడ్డిపల్లి, పుట్టువారిపల్లి, రాజవోలు గ్రామాలలో నిర్వహించారు. ఆయా గ్రామాలకు విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటికి స్థానిక మహిళలు కర్పూరహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దర్గాలు, దేవాలయాల్లో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రత్యేక పూజలునిర్వహించారు.
అనంతరం ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలందరికి సంక్షేమాన్ని అందించారని, అలాంటి సంక్షేమ పాలన కొనసాగేందుకు ప్రతి ఒక్కరూ వైఎస్సార్సీపీ గుర్తు ఫ్యాన్ కు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు.
రాజవోలు పంచాయతీ పరిధిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో రూ.9.14 కోట్లు సంక్షేమాభివృద్ది కోసం అందచేశారని వివరించారు. అంతేకాక గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా అభివృద్ది పనులకు రూ.14 లక్షలు అందచేయడం జరిగిందని అన్నారు. పేదవారి స్వంతింటిని కలను నిజం చేసేందుకు జగనన్న లే అవుట్ ల ద్వారా రూ.43.20 లక్షలను ఖర్చు చేసామని, స్వంత స్థలం కలిగిన వారికి రూ.3.60 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసినట్లు వివరించారు.
ముఖ్యంగా జగనన్న రెవెన్యూ వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా రాజవోలు పంచాయతీ పరిధిలో 99 మంది రైతుల సమస్యలు పరిష్కరించగలిగామని అన్నారు. ఇందులో చుక్కల భూముల సమస్యలు 62 ఎకరాలు ఉంటే నోషనల్ ఖాతాల సమస్యలు పరిష్కారం కావడంతో 225.75 ఎకరాల్లో భూ సమస్యలు పరిష్కారమైనట్లు వివరించారు. వైఎస్సార్ జలకళ పథకం ద్వారా 14 బోర్లు మంజూరు అయ్యాయని, అన్నారు.
ఇప్పటి వరకు గ్రామస్తులు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరించామని, రాబోయే రోజుల్లో ప్రజలు కోరిన మౌళిక సదుపాయాల కల్పనతో పాటు ఓవర్ హెడ్ నిర్మాణం, శ్మశానానికి దారి ఏర్పాటు అన్ని పనులు పూర్తి చేస్తామని అన్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ విజయీభవయాత్రలో భాగంగా గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందించిన సంక్షేమాన్ని వివరిస్తూ, రానున్న రోజుల్లో ప్రజలకు ఏం చేస్తామో తెలియచేస్తూ కొనసాగిస్తున్నామని అన్నారు.
ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా గత సంవత్సరం రోజులుగా మీడియా వారే చెబుతున్నారని, ఇంకా ఎవరూ వస్తారో ఆ పార్టీ వారే నిర్ణయించుకోలేదన్న విషయం తెలుస్తుందన్నారు. ఎవరు వచ్చినా భయపడేది లేదని, ప్రజలందరి ఆశీర్వాదంతో తప్పక విజయం సాధిస్తామని పేర్కొన్నారు.
ప్రజలకు అభివృద్ది, సంక్షేమ పథకాలను అందించే వారికే ఓటు వేస్తారే తప్పా చుట్టపుచూపుగా నియోజకవర్గాన్ని పలకరించే వారికి ఓట్లు వేయరని, తాను సైతం బలమైన అభ్యర్థి కోసం చూస్తున్నానని, ఎవరు ప్రత్యర్థిగా వచ్చి ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
అనంతరం రాజవోలులో నూతనంగా నిర్మించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లీనిక్ భవనాలను ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రారంభోత్సవం నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థలన్నింటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
బాధిత కుటుంబానికి రూ.50వేలు స్వంత నిధులు అందచేత
విజయీభవయాత్రలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే మేకపాటికి స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు ఇటివల భర్తను కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వల్లెపు రాధమ్మ కుటుంబ పరిస్థితిని వివరించారు. దీంతో స్వయంగా ఎమ్మెల్యే మేకపాటి వారి నివాసానికి చేరుకుని ఆమె భర్త రవీంద్ర మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలుసుకుని తన స్వంత నిధులు రూ.50వేలు అందచేసి పిల్లలను బాగా చదివించాలని, తామంతా తోడుగా నిలుస్తామని ఆ కుటుంబానికి భరోసా కల్పించారు.
Comments are closed.