*తేది: 09-10-2023*
: ఇందిరా గాంధి స్టేడియం, విజయవాడ*
*2024 ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తూ 175/175 లక్ష్యంగా క్యాడర్ కు సీఎం జగన్ దిశానిర్దేశం*
*పార్టీ క్యాడర్లో నూతనోత్తేజం నింపుతూ ‘వై ఏపీ నీడ్స్ జగన్’ బస్సు యాత్ర వంటి 4 వరుస క్యాంపెయిన్లను ప్రకటించిన సీఎం జగన్*
*చంద్రబాబు ఆరెస్టుపై రాజకీయ కక్ష లేదు.. అయన జైల్లో ఉన్నా ఊళ్ళో ఉన్నా పెద్ద తేడా లేదు*
*రెండు సున్నాలు కలిస్తే వచ్చేది పెద్ద సున్నా.. చంద్రబాబు, దత్తపుత్రడు పొత్తు రిజల్ట్ అదే*
*వైఎస్సార్ సీపీ ప్రతినిధుల సదస్సుతో మునుపెన్నడూ లేనంత బలంగా అవతరిస్తున్నాం*
*ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ జనవరి 1 నుంచి పెన్షన్ రూ.3000 పెంచుతున్నాం.. వైఎస్సార్ సీపీ ప్రతినిధుల సభలో సీఎం జగన్*
“గ్రామస్థాయిలో మన సచివాలయ కన్వీనర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, గృహసారధులు, వాలంటీర్లు, మన కార్యకర్తలు, మనల్ని అభిమానించే అందరిని సమాయత్తం చేయండి. ప్రతి విషయాన్ని అందరికి చెప్పండి, ప్రతి ఇంటిని సందర్శిస్తూ, ప్రతి గ్రామంలో మన పార్టీ జెండాను రెపరెపలాడించాలి. ప్రతి ఒక్కరి ఆశీస్సులు తీసుకుంటూ అడుగులు ముందుకు వేయాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీ అందరికీ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరికీ కూడా ఈ సందేశాన్ని చేరవేయాలని మనసారా కోరుతున్నాను” అని వైఎస్సార్‌సీపీ ప్రతినిధుల సదస్సులో సీఎం జగన్ పేర్కొన్నారు.
ఎన్నికల సమరానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం సమాయత్తమైంది. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పార్టీ శ్రేణులను సమాయత్తపరిచారు. పార్టీ వ్యవస్థలో అత్యంత కీలకమైన మండలస్థాయి నాయకులు మొదలు ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులతో విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్సార్ సీపీ సోమవారం నాడు ప్రతినిధుల సదస్సులో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సదస్సులో 8,500 మందికి పైగా పార్టీ నేతలను ఉత్తేజపరస్తూ సీఎం జగన్ ప్రసంగించారు. రానున్న ఎన్నికల కోసం వైఎస్సార్‌సీపీ శ్రేణులంతా గ్రామస్థాయి నుంచి మమేకమవ్వాలని.. నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా అడుగులు వేయాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. ఇక్కడకు వచ్చిన అందరూ నా కుటుంబ సభ్యులు.. నా సేనానులు అంటూ వైసీపీ ప్రతినిధుల సభకు హాజరైన అందరికీ స్వాగతం సీఎం జగన్ పలికారు. ఈ సభకు రాలేకపోయిన గ్రామ స్థాయి నేతలు, కార్యకర్తలు అందరికీ అభినందనలు తెలిపారు.
*మనం చేసిన మంచే మన ధైర్యం.. కాబట్టే వై నాట్ 175*
ప్రతి ఇంటికీ సంక్షేమాన్ని అందించినప్పుడు వై నాట్ 175, ప్రజలకు ఇన్ని మంచి పనులు చేసినప్పుడు వై నాట్ 175 అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని, రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాలు నేరుగా అందించామన్నారు. నాలుగేళ్ల పాలనలో వ్యవస్థలో అనేక మార్పులు తీసుకువచ్చామని ఉద్ఘాటించారు. గ్రామస్థాయిలోనే సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చామని, ప్రతి 50 ఇళ్లకు ఒకరు ఉండేలా వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చామని, మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 99 శాతం హామీలను నెరవేర్చామని అన్నారు. వైయస్ జగన్ అంటే మాట నిలబెట్టుకుంటాడని నిరూపించుకున్నామని తెలిపారు. వ్యవస్థలోగానీ, పాలనలోగానీ ఇన్ని మార్పులు తెచ్చిన పార్టీ లేదని ఆనందాన్ని వ్యక్తం చేశారు.
“రాబోయేది కురుక్షేత్ర యుద్ధం. పేదవాడికి, పెత్తందార్లకు మధ్య యుద్ధం. పేదవాడి పార్టీ వైయఎస్సార్ సీపీ. రాబోయే రోజుల్లో జరిగేది క్లాస్ వార్. పేదవాడు ఒక వైపు.. పెత్తందారులు మరోవైపు. పేదవాళ్లు మొత్తం ఏకం కావాలి. అప్పుడే పెత్తందార్లను ఎదుర్కోగలము. ఫిబ్రవరిలో వైయస్ఆర్సీపీ మేనిఫెస్టోతో ప్రజల వద్దకు వెళదాం. మార్చిలో ఎన్నికలకు సన్నద్ధమవుదాం” అని పార్టీ ప్రతినిధులకు సీఎం జగన్ సూచించారు.
*ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక పార్టీ వైఎస్సార్ సీపీ*
ప్రజలకు తొలి సేవకుడినని, అధికారం బాధ్యత ఇచ్చిందని అని సీఎం పేర్కొన్నారు. మూడు రాజధానులను ప్రకటించామని, 13 జిల్లాలను 26 జిల్లాలు చేశామని, గతంలో ఎప్పుడూ లేని విధంగా లంచాలు, వివక్ష లేకుండా పథకాలు అందించామని, మ్యానిఫెస్టోలోని 99 శాతం హామీలు నెరవేర్చామని, జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అనే నమ్మకం తెచ్చుకొగలిగామని సీఎం జగన్ అన్నారు. 2019లో నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని, ఈ నాలుగేళ్ళల్లోనే అదనంగా 2 లక్షల 27 వేల ఉద్యోగాలు ఇచ్చామని, అంతేకాకుండా రూ.2 లక్షల 35 వేల కోట్లను డీబీటీ ద్వారా అందించామని సీఎం చెప్పుకొచ్చారు.
ఈ 52 నెలల్లో వ్యవస్థల్లో, పాలనలో తీసుకుని వచ్చిన పార్టీ దేశ చరిత్రలోనే లేదని సీఎం గర్వంగా చెప్పారు. ఎన్నికలు మార్చి, ఏప్రిల్ లో జరుగుతాయన్నారు. మన ఆలోచనలను గ్రామ స్థాయిలోకి తీసుకుని వెళ్లాలని, గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించి అందరికీ అర్థం అయ్యేటట్లు చెప్పాలని క్యాడర్ కు సీఎం సూచించారు.
*2024 ఎన్నికలే లక్ష్యంగా 4 క్యాంపెయిన్లను ప్రకటించిన సీఎం జగన్*
2024 ఎన్నికలే లక్ష్యంగా సీఎం జగన్ 4 క్యాంపెయిన్లను ప్రకటించారు. ప్రస్తుతం జగనన్న ఆరోగ్య సురక్షా క్యాంపైన్ జరుగుతోందని దానిని సెప్టెంబర్ 30న ప్రారంభించామని, నవంబర్ 10 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎవరూ వ్యాధుల బారిన పడకుండా ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు.. ఎవరైనా వ్యాధుల బారినపడిన ప్రభుత్వం చేయి పట్టుకుని రోగాల బారి నుంచి బయటకు తీసుకుని రావాలి.. 15,004 సచివాలయాల పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్షా క్యాంపైన్ జరుగుతోందని, కోటి 60 లక్షల ఇళ్ళను కవర్ చేస్తున్నామని వెల్లడించారు ఎవరికి ఆరోగ్య సమస్యలు రాకుండా జల్లెడ పడుతున్నామని, 5 దశల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు.
‘వై ఏపీ నీడ్స్ జగన్’ (ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలి) అనే కార్యక్రమం నవంబర్ ఒకటి నుంచి డిసెంబర్ 10 వరకు 40 రోజుల పాటు నిర్వహిస్తామని సీఎం జగన్ తెలిపారు. 3వ కార్యక్రమం ‘బస్సు యాత్రలు’ అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 31 వరకు దాదాపు 60 రోజుల పాటు మూడు ప్రాంతాల్లో బస్సు యాత్రలు ఉంటాయని సీఎం జగన్ పేర్కొన్నారు. ఒక్కో టీం లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సీనియర్ నాయకులు ఉంటారని, ఎమ్మెల్యేల నేతృత్వంలో సమావేశాలు జరగాలని సీఎం సూచించారు. ప్రతి రోజూ మూడు ప్రాంతాల్లో మూడు బహిరంగ సభలు ఉంటాయని అన్నారు. ఒక్కో నియోజకవర్గంలో పర్యటించి సామాజిక న్యాయం, చేసిన అభివృద్ధి, తీసుకుని వచ్చిన మార్పులను వివరిస్తారని తెలిపారు. 175 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు జరుగుతాయని సీఎం పేర్కొన్నారు. నాల్గవ కార్యక్రమం ‘ఆడుదాం ఆంధ్రా’ అని ఇది డిసెంబర్ 11 నుంచి జనవరి 15 వరకు ఉంటుందని సీఎం ప్రకటించారు. ప్రభుత్వం నిర్వహించే క్రీడా సంబరం ఇదని, వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం ముగియగానే ఆడుదాం ఆంధ్రా చేపట్టాలన్నారు సీఎం జగన్ సూచించారు. భారత క్రీడా టీంలో వై నాట్ ఆంధ్రప్రదేశ్ అనే విధంగా క్రీడా ప్రాతినిధ్యం ఉండాలని సీఎం అన్నారు. గ్రామ నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడా సంబరాలు జరగాలని మరుగున పడిన పిల్లల టాలెంట్ ను దేశానికి పరిచయం చేసే కార్యక్రమమే ఇది సీఎం జగన్ స్పష్టం చేశారు.
*రాబోయే రోజుల్లో జరిగేది క్లాస్ వార్.. పెత్తందార్లుపై గెలవాలంటే పేదలంతా ఏకం కావాలి*
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేదవాడి పార్టీ అని రేపు జరిగేది కులాలు, మతాల మధ్య యుద్ధం కాదని, పేద వాళ్ళంతా ఏకం కావాలని జెండా మోసేది, సభల్లో పాల్గొనేది పేదవాడే అని అప్పుడే పెత్తందార్లకు బుద్ధి చెప్పగలుగుతామని సీఎం జగన్ పిలుపునిచ్చారు.
అంతేకాకుండా ఎన్నికల సమయంవరకు మరింత ఉత్సాహాన్ని నింపేలా పార్టీ శ్రేణులకు జనవరి నుంచి ఫిబ్రవరి వరకు జరగబోయే కార్యక్రమాలు గురించి కూడా వివరించారు. జనవరి 1 నుంచి మరో మూడు కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని జనవరి 1 నుంచి వృధ్ధాప్య పెన్షన్ పెంపు ఉంటుందని మూడు వేల రూపాయలకు పెన్షన్ పెరుగుతుందని సీఎం తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పెన్షన్ పెంచుతున్నామని అన్నారు. ఇక, పది రోజుల పాటు పెన్షన్ పెంపు సంబరాలు ఉంటాయని తెలిపారు. గ్రామ స్థాయిలో జరిగే సంబరాల్లో అందరూ భాగస్వామ్యం కావాలని పార్టీ ప్రతినిధులకు సీఎం సూచించారు.
రెండో కార్యక్రమం వైఎస్సార్ చేయూత అది జనవరి 10 నుంచి జనవరి 20 వరకు జరుగుతుందని రూ.5000 కోట్లు మహిళల ఖాతాల్లో వేస్తామని, ఈ ఒక్క పథకం ద్వారా ఇప్పటి వరకు మహిళలకు 19 వేల కోట్లు ఇచ్చినట్లు అవుతుందని సీఎం అన్నారు. పది రోజుల పాటు సంబరాలు జరగాలని చెప్పారు. మూడవ కార్యక్రమం వైఎస్సార్ ఆసరా అని జనవరి 20 నుంచి 30 వరకు వైఎస్సార్ ఆసరా అందిస్తామని పేర్కొన్నారు. చివరి విడతగా మరో రూ.6500 కోట్లు ఇచ్చి ప్రతి అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడే కార్యక్రమం ఉంటుందని అన్నారు.
ఇక, ఫిబ్రవరిలో మ్యానిఫెస్టోను ప్రజలకు తీసుకుని వెళ్లే కార్యక్రం ఉంటుందన్నారు. మార్చి నెలలో ఎన్నికలకు సన్నద్ధం కావాలని సూచించారు. “ప్రతి ఇంటికి మన మేనిఫెస్టోను తీసుకెళ్దాం, మనం చేసిన మంచిని గ్రామ గ్రామాన ఇంటింటా అందరికీ తెలియజేసే బాధ్యతను మీ భుజస్కందాలపై మోపుతున్నాను. మీరందరూ కూడా మండల స్థాయి నుంచి పైస్థాయిలో ఉన్నారు. ప్రతి కార్యక్రమం బాగా జరిగేలా చూసే బాధ్యత మీదే. గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలి. గృహసారధులు, వలంటీర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు వీటిపై అవగాహన కల్పించి అందరిని ఒక తాటిపైకి తీసుకురావాలి. అందరిని అడుగులు ముందుకు వేయించే బాధ్యత మీ భుజస్కందాలపై మోపుతున్నాను.”- వైయస్ఆర్సీపీ ప్రతినిధులతో సీఎం జగన్
*చంద్రబాబు ఆరెస్టు వెనుక ఎలాంటి కక్ష లేదు.. చంద్రబాబు జైల్లో ఉన్నా ఊళ్ళో ఉన్నా పెద్ద తేడా లేదు*
చంద్రబాబును ఎవరూ కూడా కక్షసాధింపుతో అరెస్టు చేయలేదని సీఎం స్పష్టం చేశారు. చంద్రబాబుపై తనకు ఎలాంటి కక్ష లేదని ఆయన అరెస్టు సమయంలో తాను దేశంలో లేనని, తాను లండన్‌లో ఉన్నప్పుడు ఇదంతా జరిగిందని సీఎం వివరించారు. చంద్రబాబును ఎవరు కక్షసాధింపుతో అరెస్టు చేయలేదని అదే నిజమనుకుంటే కేంద్రంలో బీజేపీ ఉందని, దత్తపుత్రుడు బీజేపీతోనే ఉన్నాడని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, సగం బీజేపీ పార్టీ టీడీపీ మనుషులే ఉన్నారుని అయినా కేంద్రంలోని ఇన్‌కం ట్యాక్స్, కేంద్రంలోని ఈడీ చంద్రబాబుపై విచారణ జరిపి అవినీతిని నిరూపించిందని, దోషులను అరెస్టు కూడా చేసిందని సీఎం అన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీలను రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వనని చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అనుమతులు కూడా ఇవ్వలేదని గుర్తి చేశారు.
“ఆనాటికే అవినీతిపరుడని స్పష్టమైన చంద్రబాబుపై విచారణ చేయకూడదట, ఆధారాలు లభించినా అరెస్టు చేయకూడదట, కోర్టులు ఆధారాలతో రిమాండుకు పంపినా కూడా చంద్రబాబును కానీ, గజదొంగల ముఠా వీరప్పను చట్టాలకు పట్టి ఇవ్వడానికి వీలు లేదని ఎల్లోమీడియా, ఎల్లో గజదొంగల ముఠా వాదనలు వినిపిస్తున్నాయి. ఆలోచన చేయండి.”- సీఎం జగన్
*చంద్రబాబు, దత్తపుత్రడు కలిసివచ్చినా సున్నాయే.. ప్రజలతోనే మన పొత్తు*
మన ప్రతిపక్షాలు అన్ని కూడా పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాని, ఎంత మంది కలిసినా కూడా రెండు సున్నాలు కలిసినా లేదా నాలుగు సున్నాలు కలిసినా వచ్చే రిజల్ట్ సున్నానేని సీఎం ఎద్దేవా చేశారు. దత్తపుత్రుడు జీవితమంతా కూడా చంద్రబాబును భుజానికి ఎత్తుకోవడమేనని, చంద్రబాబు దోచుకున్నది పంచుకోవడంలో ఆయన పార్ట్‌నర్ అని సీఎం విమర్శించారు. ఇద్దరూ కలిసి ప్రజలను ఎలా మోసం చేయాలని ఆలోచిస్తారుని, నిజంగా ప్రజలకు మంచి చేయాలని ఆలోచించరని అన్నారు. వీరికి తెలిసిన రాజకీయమంతా కూడా అధికారంలోకి రావడం దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడమే అని ధ్వజమెత్తారు.
“ఈ రోజు మన ధైర్యం మనం చేసిన మంచి. ఆ మంచి ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో జరిగింది. అందుకే వై నాట్ 175 పిలుపుతోనే అడుగులు ముందుకు వేస్తున్నాను.ఈ రోజు నేను చెప్పిన మాటలు గ్రామస్థాయిలోకి తీసుకెళ్లాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. గ్రామస్థాయిలో మన çసచివాలయ కన్వీనర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, గృహసారధులు, వలంటీర్లు, మన కార్యకర్తలు, మనల్ని అభిమానించే అందరిని సమాయత్తం చేయండి. ప్రతి విషయాన్ని అందరికి చెప్పండి, ప్రతి ఇంటిని సందర్శిస్తూ, ప్రతి గ్రామంలో మన పార్టీ జెండాను రెపరెపలాడించాలి.ప్రతి ఒక్కరి ఆశీస్సులు తీసుకుంటూ అడుగులు ముందుకు వేయాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ..మీ అందరికీ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరికీ కూడా ఈ సందేశాన్ని చేరవేయాలని మనసారా కోరుతున్నాను” అని సీఎం జగన్ పేర్కొన్నారు.
Comments are closed.