*మీడియా సమాజాన్ని ప్రతిబింబించాలి*
*సానుకూల మార్పునకు కృషి చేయాలి*
*• సత్యానికి దగ్గరగా, సంచలనానికి దూరంగా ఉంటేనే ప్రజలు ఆదరిస్తారు*
*• నైతికత పునాదుల మీద జర్నలిజం భవిష్యత్ ముందుకు సాగాలని ఆకాంక్ష*
*• లేదంటే ప్రజల్లో భయాందోళనలు పెరిగిపోతాయన్న ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు*
*• పత్రికాస్వేచ్ఛతోనే సమాజానికి, ప్రజాస్వామ్యానికి మేలు జరుగుతుందని సూచన*
*• ఆకాశవాణికి, నెల్లూరు జిల్లాకు 6 దశాబ్దాల అవినాభావ సంబంధముంది*
*• సాహిత్యానికీ, సంగీతానికి, సంస్కృతికి నెల్లూరు జిల్లా పెట్టింది పేరు*
*• నెల్లూరు ఆలిండియా రేడియో కేంద్రాన్ని జాతికి అంకితం చేసిన ఉపరాష్ట్రపతి*.
ప్రస్తుత వేగవంతమైన సమాచార యుగంలో మాట పెదవి దాటే లోపు, సమాచారం పృథివి దాటుతోందని అందుకే ఇచ్చే సమాచారం సరైనదా కాదా అనేది ఎప్పటికప్పుడు సరి చూసుకోవలసిన అవసరం ఉందని గౌరవ భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మీడియాకు సూచించారు. మీడియా అనేది అద్దం లాంటిదని అది సమాజాన్ని ప్రతిబింబించడంతో పాటుగా సమాజంలో సానుకూల మార్పునకు కృషి చేయాలని సూచించారు. ఎన్ని పత్రికలు, ప్రసార మాధ్యమాలు ఈ దిశగా స్వీయ నియంత్రణతో పనిచేస్తున్నాయనేది ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.
బుధవారం నెల్లూరు జిల్లాకేంద్రంలోని నెల్లూరు ఆలిండియా రేడియో కేంద్రాన్ని జాతికి అంకితం చేసిన అనంతరం, 100 మీటర్ల 10 కిలోవాట్ల ఎఫ్ఎం స్టేషన్ కార్యక్రమాలను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విక్రమ సింహపురికి, ఆకాశవాణికి 6 దశాబ్దాలుగా ఉన్న అవినాభావ సంబంధాన్ని, ఇక్కడి ప్రజల జీవితాల్లో రేడియో పాత్రను ప్రస్తావిస్తూ మీడియాకు పలు సూచనలు చేశారు. ప్రచార, ప్రసార మాధ్యమాలు అందించే వార్తలు సత్యానికి దగ్గరగా, సంచలనానికి దూరంగా ఉండేలా చూసుకోవాలన్నారు.
మీడియా స్వేచ్ఛ గురించి ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉందని ఇలాంటి చర్చ జరుగుతూనే ఉండాలన్న ఉపరాష్ట్రపతి పత్రికా స్వేచ్ఛ ద్వారానే సమాజం, ప్రజాస్వామ్య పరిరక్షణ జరుగుతుందన్నారు. అయితే ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేసే వారి విషయంలో మాత్రం ప్రజలు కఠినంగా వ్యవహరించే పరిస్థితి రావాలని ఆయన అన్నారు.
మాధ్యమాల్లో, మరీ ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తల్లో నిజానిజాలు తేల్చడానికి ప్రభుత్వ పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) ఒక నిజనిర్ధారణ విభాగాన్ని ఏర్పాటు చేయాల్సి రావడం పరిస్థితి తీవ్రతను ప్రతిబింబిస్తుందన్నారు. ఇలాంటి వార్తల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సమాచారం నిజమైనదా కాదా అనేది తెలుసుకోకుండా అందరికీ చేరవేయడం వల్ల సమాజం భయాందోళనలకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు.
నైతికత పునాదుల మీద జర్నలిజం భవిష్యత్తు ముందు సాగాలని ఆకాంక్షించే వారిలో తాను మొదటివరుసలో ఉంటానన్న ఉపరాష్ట్రపతి, అలాంటి జర్నలిజానికి ప్రజలు సైతం ప్రోత్సాహం అందించాలన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు, సంగీతం, వ్యవసాయం వంటి వాటికి పత్రికలు, మీడియా, సామాజిక మాధ్యమాలు మరింత ప్రాధాన్యత కల్పించాలన్నారు.
ఆకాశవాణికి, నెల్లూరు జిల్లాకు ఆరు దశాబ్ధాలు అవినాభావ సంబంధం ఉందన్న ఉపరాష్ట్రపతి, తాను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిగా ఉండగా నెల్లూరు ఎఫ్.ఎం. శంకుస్థాపన జరగడం, అది పూర్తి స్థాయి రేడియో కేంద్రంగా రూపుదిద్దుకోవడం, ఇప్పుడు దాన్ని జాతికి అంకితం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
టీవీ చానళ్లు రాకముందు తన చిన్నతనంలో ఆకాశవాణి యువతను ఉత్తేజపరిచేదని చిన్న నాటి స్మృతులను గుర్తు చేసుకున్న ఉపరాష్ట్రపతి, వార్తాప్రసారాలలో నిష్పాక్షికత కనిపించేదని పేర్కొన్నారు. రేడియో కవులకు, కళాకారులకు, సంగీతజ్ఞులకు ప్రోత్సాహం అందించిందని, కర్ణాటక సంగీతం, సినిమా పాటలు ఆ రోజుల్లో అతిపెద్ద వినోదకార్యక్రమంగా ఉండేవాని పాతరోజులను ఉపరాష్ట్రపతి గుర్తుచేసుకున్నారు. వ్యవసాయదారుల కార్యక్రమాల ప్రసారాల ద్వారా మారుమూల గ్రామాలలోని రైతన్నలకు వ్యవసాయ పంటల గురించి, తెగుళ్ళు, పురుగు మందుల గురించి ఎన్నో సూచనలు, సలహాలు అందేవన్నారు. ల్యాబ్ టూ ల్యాండ్ కార్యక్రమాన్నీ, వ్యవసాయ పరిశోధనా క్షేత్రాల ఫలితాలను ఎప్పటికప్పుడు రైతులకు అందించడంతోపాటు కర్ణాటకలో రేడియో రైస్ పేరిట ఓ వరి వంగడాన్ని కూడా ప్రాచుర్యంలోకి తెచ్చిన విషయాన్ని ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు.
ఏ పదాలు రాసినా అవి ప్రజలకు అర్ధమయ్యేలా ఉండాలని, ఎలాంటి సందేహాలకు తావు ఇవ్వకుండా విషయాన్ని కచ్చితంగా తెలియజేసేలా ఉండాలని ఉపరాష్ట్రపతి అన్నారు. రాసే ప్రతి మాట, సమాచారం సమగ్రంగా ప్రజలకు తెలియజేసేలా ఉండాలి. ముఖ్యంగా రేడియా, టీవీ మాధ్యమాల్లో మళ్ళీ మళ్లీ వెనక్కు వెళ్ళి పరిశీలించే అవకాశం ఉండదు గనుక నేరుగా ప్రజలకు చేరేలా భాష ఉండాలని ఆయన సూచించారు.
తమ చిన్న తనంలో హరికథలు, బుర్రకథలు, జానపద గేయాలు, బావగారి కబుర్లను రేడియో ద్వారా వినేవారమన్న ఉపరాష్ట్రపతి, గ్రామ కూడలిలోని పార్కులో పంచాయితీ రేడియో సెట్లు, ఏర్పాటు చేసేవారన్నారు. ‘నెల్లూరు గాంధీ బొమ్మ పక్కన పార్కులో రేడియో వార్తలు నేను కూడా విన్నాను. దినపత్రికల కంటే ముందు తాజా వార్తలు అందించడంలో రేడియో ప్రథమ స్థానంలో ఉంది’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
సింహపురి వాణి అయిన ఆకాశవాణి, ఈ ప్రాంత సాంస్కృతిక చైతన్యానికీ, సాహిత్య పురోగమనానికీ, సమైక్యతా శంఖారావానికీ నాందీ ప్రవచనం పలుకగలదని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. పూర్తి స్థాయి ప్రసారాల ప్రారంభంలో ఉపరాష్ట్రపతి ఆకాశవాణి శ్రోతలను ఉద్దేశించి తమ సందేశాన్ని అందించారు. అనంతరం ఆకాశవాణి, నెల్లూరు ప్రాంగణంలో మొక్కను నాటారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ప్రసార భారతి సి.ఈ.వో. శశిశేఖర్ వెంపటి, ఆకాశవాణి డైరక్టర్ జనరల్ ఎన్.వేణుధర్ రెడ్డి, అదనపు డైరక్టర్ జనరల్ వి.రమాకాంత్, చెన్నై డిప్యూటీ డైరక్టర్ జనరల్ ఆనందన్, ఇంజనీరింగ్ విభాగ డైరక్టర్ సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments are closed.