The South9
The news is by your side.
after image

చరిత్ర గమనంలో కన్నీటిదే విజయం:డా.కత్తి పద్మారావు

చరిత్ర గమనంలో కన్నీటిదే

విజయం.

……………..      కడలి సుడులలో

నక్షత్రాల జాతర.

చేపలు

పడవల తెడ్డులకు

అందకుండా

Post midle

పరుగులెడుతున్నాయి.

చేపలు తమలో తాము

మాట్లాడుకుంటున్నాయి.

వేటగాడి కి అందకుండా

ఈత ఒరవడి పెంచుతున్నాయి.

నది ఒడ్డున

కుప్పలుగా పడివున్న

కొరమీనులు.

ఆ పడతి బొచ్చెల తలమీద

నీళ్ళు జల్లుతుంది.

కొనుగోలుదారులకు

ఇవి బతికే వున్నాయని

కేకలేస్తుంది.

ఔను! వేట కొత్తరూపాలు

తీసుకుంటుంది.

ఆ కాశ్మీర్ సౌందర్యం వెనుక

నెత్తుటి ప్రవాహాలు.

దృశ్యం మరింత నగ్నమౌతుంది.

అక్షరం పై దృశ్యం దాడి.

మెదడు పై దృశ్యాదృశ్య భ్రమణం.

తన ముందున్న సజీవచిత్రాన్ని

నిరాకరిస్తున్నారు.

రంగుల వలయాల్లో

తలదూరుస్తున్నారు.

ప్రతి అర్ధనగ్న భంగిమ వెనుక

ఒక మ్యూజికల్ బీట్

మెదడును హంట్ చేస్తుంది.

శరీర రూపాన్ని ముక్కలుచేసి

పగిలిన అద్దంలా

మనుషులు ఛిద్రం అవుతున్నారు.

భ్రమల్లో బతకడం కోసం

తమను తాము

చీల్చుకుంటున్నారు.

పుస్తకాలకు చెదలు పడుతున్నాయి.

దులిపేవారు లేరు.

చివరకు వాటిని తగులబెడ్తున్నారు.

ఆ నడి వయస్కుడి చేతిలో

ఒక దృశ్య భ్రమణ పరికరం.

తన పిల్లోడు

ఆసుపత్రి లో చావుబతుకుల్లో

ఉన్న దృశ్యం.

అతడి మెదడుకు ఎక్కలేదు.

అతడు బొమ్మలకొలువు లో

చిక్కుకుపోయాడు.

ఆ బాలికను రేప్ చేసిన వారిని

ముసుగేసి జైలుకు

తీసుకెళుతున్నారు.

ఆ పబ్ లకు మాత్రం అదనంగా

తలుపులు తెరుస్తున్నారు.

వారు ఊబిని సృష్టిస్తున్నారు.

ఊబిలో దిగుతున్నవారికి

చెయ్యందించే వారు లేరు.

రాజ్యం నూరిన కత్తిలా ఉంది.

ఒక చేత్తో మత్తుమందు ను

చల్లుతుంది.

వధను కొనసాగిస్తుంది.

నడెoడలో క్వారీలో

రాళ్లు కొడుతున్న

ఆ బుడ్డోడి వేలిమీద

సుత్తి దెబ్బ పడింది.

వాడు అమ్మా అన్నాడు.

ఆ అమ్మ ఉపాధి కూలీగా

మట్టి తట్ట మోస్తూ

స్పృహ తప్పి ఉంది.

వాడి బాబు మాత్రం

పగిలిన సీసాలోని

మందు చప్పరిస్తున్నాడు.

ఆ గంజాయి మొక్కలు

పెరటి చెట్లల్లో దాక్కుని

పెరుగుతున్నాయి.

ఇప్పుడు దొంగోడే

Post Inner vinod found

దొంగా దొంగా అని అరుస్తున్నాడు.

నిజాయితీ పరుడే

ముద్దాయి అవుతున్నాడు.

ఆ పూజా మందిరంలో

అన్నీ బంగారు ప్రతిమలే.

వెండి దీపస్తంభాల పై

చిరువెలుగులు.

ఇంకా ఆ చెంచు గూడెంలో

దీపాలు వెలుగలేదు.

ఒక గొడ్డలి – కత్తి – వడిసెల

ఆ గుడిసె లో

చరిత్రకు గుర్తుగా ఉన్నాయి.

బంగారం అనే మాట

వారు విని ఉండరు.

ఔను! ఇప్పుడు ఇళ్ళల్లో

పూజా మందిరాల్లోనే

నల్లధనం దాగి ఉంది.

బ్యాంకులకు కోట్లు

ఎగ్గొట్టిన వాడు

తిరుమల దేవేరి కి

రత్న ఖచిత కిరీటాలు పెడుతున్నాడు.

ఆ సవర స్త్రీ

నవమాసాలు మోస్తుంది.

నొప్పులొచ్చాయి.

డోలీ కట్టుకుని

కొండచరియలు దిగుతున్నారు.

కట్టుకున్నోడి కాలు జారింది.

అమ్మా! అని అరిచింది.

రాజ్యం ధనవంతుల

ఖాతాల్లో కూడా

కాసులు విదిలించి

మెప్పులు పొందుతుంది.

నీళ్ళు కింద నుండి

కొండ మీదకు చేరుతున్నాయి.

లోయల్లో జింకలకు

నీటి చుక్క లేదు.

ఔను ! అంబేద్కర్

ఎత్తు పల్లాలు పూడ్చమన్నాడు.

పాలకుడు

పల్లం మట్టిని తీసి

కొండల ఎత్తుపెంచుతున్నాడు.

మూల వాసుల్ని

మూల మూలలకు

జరుపుతున్నాడు.

అగ్రవర్ణాలను అందలం ఎక్కిస్తున్నాడు.

అంబేద్కర్ చూపుడువేలు

పాలకుల్ని మరొక్కసారి

కిందకు చూడమంటుంది.

అంధత్వం వెలుగును చూడలేదు.

బధిరత్వం సైగలకు

అలవాటుపడుతుంది.

ఎర్రని నిప్పు గుండె

కొలుముల్లో మండుతుంది

ఎండిపోయిన కట్టెలలోనుండి

నిప్పురవ్వలు లేస్తున్నాయి.

ధర్మావేశం అంతర్గతంగా పెరుగుతుంది.

మళ్లీ అంబేద్కర్

రాజ్యాంగ ప్రతిని తెరుస్తున్నాడు.

మానవతా దర్శనాన్ని

ప్రవచిస్తున్నాడు.

ఒక్కసారి

చెవులు రిక్కించి వినండి!

తర తరాల వ్యధా గానం

వినిపిస్తుంది.

దళితుల గుండె

మండిన ప్రతిసారీ

మార్పు అనివార్యమౌతుంది

సుమా !

చరిత్ర గమనంలో

కన్నీటి దే విజయం.

 

మహాకవి డా.కత్తి పద్మారావు

14 – 06 – 2022,

లుంబినీ వనం,

అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్,

అంబేద్కర్ కాలనీ,

పొన్నూరు పోస్ట్,

గుంటూరు జిల్లా,

ఆంధ్ర ప్రదేశ్.

ఫోన్ : 9849741695.

Post midle

Comments are closed.