The South9
The news is by your side.
after image

జగనన్న ఆరోగ్య సురక్షలో 1.22 కోట్ల కుటుంబాల సర్వే.. 3.17 కోట్ల మందికి సేవలు :సీఎం జగన్

తేది :13–10–2023*

*స్థలం : తాడేపల్లి*

జగనన్న ఆరోగ్య సురక్షలో 1.22 కోట్ల కుటుంబాల సర్వే.. 3.17 కోట్ల మందికి సేవలు*

*రాష్ట్ర వ్యాప్తంగా నేటి వరకు 5,216 ఆరోగ్య సురక్ష క్యాంపులు*

*సగటున ఒక్కో క్యాంపులో 357 మందికి వైద్య సేవలు*

*కలెక్టర్లకు మరిన్ని నిధులు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశాలు*

 

రాష్ర్ట వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిర్వహిస్తున్నా జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాల్లో ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎం జగన్ వైద్య ఆరోగ్య శాఖ, కలెక్టర్లను ఆదేశించారు. రాష్ర్ట వ్యాప్తంగా ఇప్పటి వరకు 5,216 ఆరోగ్య సురక్ష క్యాంపుల నిర్వహించగా సగటున ఒక్కో క్యాంపులో 357 మందికి వైద్య సేవలు అందించినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకమైనదన్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టనే కాదు, వైద్య ఆరోగ్య శాఖ ప్రతిష్టను కూడా పెంచుతుందన్నారు. రోగులు ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలతో పూర్తి స్థాయిలో సంతృప్తి చెందడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. వైద్య శిబిరాల్లో రోగులకు కల్పిస్తున్న సదుపాయాలు మెరుగ్గా ఉండాలని ఆదేశించారు.

 

Post midle
Post Inner vinod found

వైద్య శిబిరాల నిర్వహణ, వసతులపై కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాలని, శిబిరాల నిర్వహణకు కలెక్టర్లకు మరిన్ని నిధులు ఇవ్వాలని ఉన్నాతాధికారులను సీఎం జగన్ ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై శుక్రవారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ జగనన్న సురక్ష కార్యక్రమంపై సీఎం జగన్ కు వివరాలు అందించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా అక్టోబరు 11, 2023 వరకు 1,22,69,512 కుటుంబాలపై ఆరోగ్య సర్వే చేసినట్లు వివరించారు. ఇప్పటివరకు 3,17,65,600 మందిని ఆరోగ్య సిబ్బంది కవర్‌ చేసినట్లు తెలిపారు. దీనిపై సీఎం జగన్ మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో వైద్య శిబిరాలను నిర్వహిస్తూనే చికిత్స అవసరమని గుర్తించిన వారి ఆరోగ్యం బాగు అయ్యేంత వరకూ చేయిపట్టుకుని నడిపించాలని అధికారులకు సూచించారు.

 

*మందులు ఎంత ఖరీదైనా ఇవ్వాల్సిందే.. సీఎం జగన్*

 

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పాత పేషెంట్ల విషయంలో వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని, చికిత్స అనంతరం వీరు వాడాల్సిన మందులు ఎంత ఖరీదైనా సరే వారికి అందించాల్సిన బాధ్యత ఉందని సీఎం జగన్ అన్నారు. క్రమం తప్పకుండా వారికి చెకప్‌లు చేసే బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఆరోగ్య శ్రీలో కవర్‌ కాకుండా గతంలో చికిత్సలు చేయించుకున్న పాత రోగుల విషయంలో శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ఆరోగ్య పరంగా, చికిత్సల పరంగా, చెకప్‌ల పరంగా, మందులపరంగా ఎవరికి ఏ అవసరాలు ఉన్నా వారికి అవి తీర్చే దిశగా ఈ ఆరోగ్య సురక్ష క్యాంపులు పనిచేయాలన్నారు. మూడు దశలుగా విభజించి ఆరోగ్య సంరక్షణ చర్యలు తీసుకోవాలని, దీని కోసం ప్రతి సచివాలయం వారీగా ఇలా ఎవరెవరు ఉన్నారనేది వివరాలు తీసుకోవాలని దీనికి అవసరమైన నిధులను ప్రభుత్వం వెంటనే సమకూరుస్తుందన్నారు. విలేజ్‌ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌లతో దీన్ని అనుసంధానం చేయాలని సీఎం జగన్ అన్నారు. నెలకు ఒక మండలంలో నాలుగు సచివాలయాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించాలన్నారు.

 

*జగనన్న ఆరోగ్య సురక్షలో 4 అంశాలు కీలకం*

 

జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో రోగుల సంతృప్తి, క్యాంపుల్లో సదుపాయాలు, రోగులకు చేయూత అందించడం, ఆరోగ్య సురక్ష కార్యక్రమంమీద అవగాహన, విస్తృత ప్రచారం వంటి 4 అంశాల మీద తప్పనిసరిగా సమీక్ష చేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖకు సీఎం జగన్ సూచించారు. ఆరోగ్య సురక్ష మీద ప్రతి వారం క్రమం తప్పకుండా సమీక్షిస్తానని సీఎం జగన్ అన్నారు. ఆరోగ్య శ్రీని ఎలా వినియోగించుకోవాలని తెలియని వ్యక్తి రాష్ట్రంలో ఉండకూడదని, ఆరోగ్య శ్రీ చికిత్సల కోసం వెళ్లే రోగులకు ప్రయాణ ఛార్జీలుకూడా ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరి ఫోన్‌లో కూడా ఆరోగ్య శ్రీ యాప్‌ని డౌన్లోడ్‌ చేయించాలన్నారు. దీని వల్ల పర్యవేక్షణ మరింత సులభతరం అవుతుందని సూచించారు.

 

*ప్రకాశం జిల్లాలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటు*

 

ఆరోగ్య సురక్ష క్యాంపులకు స్పెషలిస్టులను పంపే విషయంలో మరింత శ్రద్ధ వహించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. క్యాంపుల్లో ఎక్కడా కూడా తొందరపాటు లేకుండా రోగులకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు క్యాంపులకు తప్పనిసరిగా నలుగురు వైద్యులు వెళ్లాలని, అందులో ఇద్దరు స్పెషలిస్టులు ఉండేలా చూడాలన్నారు. అలాగే వైద్య పరీక్షలు చేసేటప్పుడు మరింత నిర్ధారణ కోసం అదనపు పరీక్షలు కూడా చేసి, సరైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

 

క్యాంపుల ద్వారా గుర్తించిన 2,841 మంది రక్తహీనత ఉన్న బాలికలకు మందులు, పౌష్టికాహారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రక్తహీనతతో ఉన్నవారిని గుర్తించిన వారికి పౌష్టికాహారాన్ని అక్కడే అందించేలా ఎస్‌ఓపీ రూపొందించాలన్న సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పుట్టుకతోనే వివిధ రోగాలతో బాధపడుతున్న 251 మందికి అవసరమైన వైద్య సేవలు ప్రారంభించాలన్నారు. నిపుణులైన వైద్యులు ఆరోగ్య సురక్షా శిబిరాలకు వస్తున్నప్పుడు అక్కడే దివ్యాంగ సర్టిఫికెట్లు జారీచేసేలా ఆలోచించాలని సీఎం జగన్ సూచించారు. తిరుపతి తరహాలోనే చిన్నపిల్లలకోసం అత్యాధునిక ఆస్పత్రిని విజయవాడ–గుంటూరు, విశాఖపట్నంలలో ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లాలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.

Post midle

Comments are closed.