కోటి జనాభా ఉన్న హైదరాబాద్ మహానగరం సురక్షితం. జీవనప్రమాణా పరంగా చూసినా అంతర్జాతీయ స్థాయి ఎవ్వరూ కాదనలేని నిజం. కానీ.. కరోనా వైరస్ ఇక్కడ ఉండాలంటే తెలియని భయాన్ని నాటింది. పిల్లా జెల్లతో కలసి సొంతూళ్లకు పయనమయ్యేలా చేసింది. ఇంతమాత్రాన.. హైదరాబాద్‌ను తక్కువ చేయటం కాదు. బతుకునిచ్చే భాగ్యనగరంలో వైరస్ ఎక్కడ కబళిస్తుందనే ఆందోళనే దీనికి కారణం. తప్పెవరిదైనా ఫలితం యావత్ ప్రపంచం చవిచూస్తుంది. తనదాకా వస్తే కానీ తెలియదన్నట్టుగా తెలంగాణలో కొవిడ్ 19 పాజిటివ్ కేసుల ఉదృతితో భయం నెలకొంది. పాలకులు ఎంతగా ధైర్యం చెబుతున్నా ప్రజల్లో నమ్మకాన్ని కలిగించలేకపోయారు.
దీనికి కారణం ఫలానా అని నిందించకపోయినా.. ప్రభుత్వ వైఫల్యమే అనేది ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. కరోనా కేవలం ఒక వర్గానికి పరిమితం అనుకున్నా. క్రమంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, చివరకు తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ కూడా దాన్నుంచి తప్పించుకోలేకపోయాడు. ఇక్కడే అసలు తప్పిదం జరిగింది. కరోనా ఎవరికి సోకినా.. అది కోటీశ్వరుడైనా సరే గాంధీ ఆసుపత్రికి రావాల్సిందేనంటూ.. మొదటి మీటింగ్‌లో చెప్పిన మాటలు నేతిబీర చందంగా మారాయి. పెద్దలకు వైరస్ సోకినా.. అనుమానం వచ్చినా ఛలోమంటూ కార్పోరేట్ ఆసుపత్రుల వైపు పరుగులు తీస్తున్నారు. విపక్ష నేతగా ఏదో సాధించాలని ఉవ్విళ్లూరే హన్మంతరావు అదేనండీ వీహెచ్ కూడా అపోలోకే ఓటేసి బయటపడ్డాడు. ఇదంతా గమనిస్తున్న జనం.. కలో గంజో తాగుదామని సొంతూళ్లు చేరుతున్నారు.
లాక్డౌన్ పెడతారనే ప్రచారంతో దాదాపు 20-30శాతం నగరంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలు.. అటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలోని వివిధ జిల్లాలకు ప్రయాణమయ్యారు. చిరు వ్యాపారులు నష్టాలు చవిచూడలేక.. మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయనేది అర్ధమవక జన్మభూమిలోనే ఏదోఒక పనిచేసుకుందామనే ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే 5.5లక్షల మంది ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం తో సొంతూళ్ల నుంచి కొలువులు చక్కదిద్దుతున్నారు. ఇలా.. దాదాపు 1/3 నగర జనాభా ఇలా.. ఏదో కారణంతో గ్రేటర్ సరిహద్దులు దాటుతున్నారు. ఇదంతా నిజమేనా.. అంటే.. ఖాళీగా కనిపిస్తున్న దుకాణాలు.. టులెట్ బోర్డుతో వెక్కిరిస్తున్న అపార్ట్మెంట్స్ ఇందుకు నిలువెత్తు నిదర్శనం.
Comments are closed.