*రైతుల సమస్యల పరిష్కారానికే సమీక్ష సమావేశాలు : ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*
*: సమీక్షలో సమస్యలు తెలిపి పరిష్కారానికి చర్యలు*
ఆత్మకూరు నియోజకవర్గంలో రైతాంగం ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలను పరిష్కరించేందుకే రెవెన్యూ అధికారులు, సమన్వయ కమిటి సహకారంతో గుర్తించిన సమస్యలను జిల్లా కలెక్టర్, ఇతర అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు.
జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ తో కలసి ఆత్మకూరునియోజకవర్గ రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో ఆత్మకూరు ఆర్డీఓ, తహశీల్దార్లు, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ సమన్వయ కమిటి సభ్యులతో కలసి సమీక్ష నిర్వహించి పలు సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
అనంతరం కలెక్టరేట్ ఎదుట మీడియాతో మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గంలో రెవెన్యూ సమస్యలను ప్రధానంగా పరిష్కరించే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ తో కలసి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామని, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తెలిపిన సమస్యలే కాకుండా ఇతర భూ సమస్యలను కూడా పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
నియోజకవర్గ పర్యటనలో భాగంగా భూములు, ఇంటి స్థలాలు లేవని అనేక మంది మా దృష్టికి తీసుకొచ్చారని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి భూములు అందచేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చినట్లు వివరించారు.
ఈ సమీక్ష సమావేశాల వల్ల ఆధార్ కార్డులకు భూములు తప్పుగా నమోదై సంక్షేమ పథకాలు దూరమైన 450 మంది రైతులకు సంబంధించి సమస్యలు పరిష్కారమైనట్లు వివరించారు. అంతేకాక నియోజకవర్గంలో గుర్తించిన నోషన్ ఖాతాలలో 19 వేల ఖాతా నెంబర్ల సమస్యలను అధికారులు పరిష్కరించినట్లు తెలిపారు.
నియోజకవర్గంలో ఇప్పటి వరకు 6 వేల సాదాబైనామా భూములు నమోదు అయితే వాటిలో 3 వేల సమస్యలను పరిష్కార దశకు వచ్చాయని, మిగిలినవి కూడా అతిత్వరలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారన్నారు.
ఆత్మకూరు నియోజకవర్గంలో రెండు విడతల్లో ఇప్పటి వరకు 21 వేల ఎకరాల్లో చుక్కల భూముల సమస్యలు పరిష్కారం కావడంతో ఆ రైతులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారని, ఆర్ఎస్ఆర్ లో భూముల స్థితిగతులను మార్చే విధంగా రీ సర్వే ప్రక్రియ కూడా జరుగుతుండడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు.
నియోజకవర్గంలో రెవెన్యూ సమస్యలను అతి త్వరగా పరిశీలించి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని, రానున్న 2,3 నెలల వ్యవధిలో పూర్తి పరిష్కార దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
Comments are closed.