The South9
The news is by your side.
after image

కాంగ్రెస్ పార్టీలోకి వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్?

న్యూఢిల్లీ : ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ ముఖ్యమంత్రి కావడానికి ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారు అనేది జగమెరిగిన సత్యం. గతంలో వై.యస్ .జగన్ , తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ కి ఎన్నికల్లో వ్యూహకర్తగా పనిచేసి వారికి విజయం చేకూర్చిన సంగతి తెలిసిందే. మమతా బెనర్జీ విజయంతో మరొకమారు దేశవ్యాప్తంగా ప్రశాంత్ కిషోర్ పేరు తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో గురువారం నాడు కాంగ్రెస్ భావి ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులతో ప్రశాంత్ కిషోర్ చేరికపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ చర్చలో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే చేకూరే ప్రయోజనాలు, బలాబలాలు గురించి సీనియర్ నాయకులు ఏకే ఆంటోనీ, మల్లికార్జున ఖర్గే, అంబికా సోనీ, తదితరులతో రాహుల్ చర్చించారు. ఈ చర్చలో సీనియర్ నాయకులంతా ప్రశాంత్ కిషోర్ చేరితే పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుందని ముక్తకంఠంతో చెప్పినట్లు తెలుస్తోంది. గత నెల 13న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తో, ప్రశాంత్ కిషోర్ సమావేశమై చర్చించారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ లతో సమావేశమై ప్రశాంత్ కిషోర్ చేరికపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ఏది ఏమైనా ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే దేశంలో ప్రస్తుతం బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కి కొత్త ఉత్సాహం వస్తుందని చెప్పవచ్చు.

Post midle

Comments are closed.