తేదీ: 12-10-2022,
అమరావతి.
*చిన్న పరిశ్రమలకు గొప్ప అవకాశం : ఏపీఐఐసీ వీసీ, ఎండీ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా*
*’బ్యాంక్ ఆఫ్ బరోడా’తో ఏపీఐఐసీ కీలక ఒప్పందం*
*ఎమ్ఎస్ఎమ్ఈ పారిశ్రామికవేత్తలకు తక్షణ రుణ సదుపాయం*
అమరావతి, అక్టోబర్, 12 : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మార్గనిర్దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడే విధంగా ఏపీఐఐసీ మరో కీలక ఒప్పందం చేసుకుంది. ఎమ్ఎస్ఎమ్ఈ పరిశ్రమలకు రుణ సదుపాయంలో ఎదురయ్యే ఇబ్బందులను తొలగించేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడాతో ఏపీఐఐసీ ఎంవోయూ కుదుర్చుకున్నట్లు ఏపీఐఐసీ వీసీ, ఎండీ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా వెల్లడించారు. ఒప్పంద పత్రాలపై ఏపీఐఐసీ ఎండీ భరత్ గుప్తా, బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ జనరల్ మేనేజర్, జోనల్ హెడ్ మన్మోహన్ గుప్తా సంతకాలు చేసిన ఎంవోయూలని పరస్పరం ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. విజయవాడ హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ఎంవోయూ సందర్భంగా ఎండీ డాక్టర్ భరత్ గుప్తా మాట్లాడుతూ దశలవారీగా ఏపీఐఐసీ గుర్తించిన ఇండస్ట్రియల్ పార్కులలోని ఎమ్ఎస్ఎమ్ఈలకు, వాటిని ప్రారంభించడంలో అవసరమైన రుణ సదుపాయం కల్పించడంలో బ్యాంక్ ఆఫ్ బరోడా కీలక భాగస్వామ్యం కానుందని పేర్కొన్నారు. ఇప్పటికే గత ఆగస్ట్ లో యూనియన్ బ్యాంకుతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం వల్ల ఆ బ్యాంకు రూ.10 కోట్లకు పైగా మొత్తంలో పారిశ్రామికవేత్తలకు రుణాలిచ్చినట్లు ఎండీ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పారిశ్రామిక పార్కులలోని పారిశ్రామికవేత్తలకు కూడా ఈ వెసులుబాటు కల్పించే దిశగా బ్యాంక్ ఆఫ్ బరోడాతో కలిసి ముందుకు సాగుతామన్నారు. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో బ్యాంక్ ఆఫ్ బరోడా ముద్ర వేసేలా ఒక్కటిగా కలిసి పని చేయాలన్నారు.
*ప్రభుత్వం, ఏపీఐఐసీతో కలిసి పారిశ్రామికవేత్తలకు ఆర్థికంగా తోడ్పాటు: బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ జనరల్ మేనేజర్, జోనల్ హెడ్ మన్మోహన్ గుప్తా*
ప్రభుత్వం, ఏపీఐఐసీతో ఎంవోయూ కుదర్చుకోవడం తమకు గొప్ప అవకాశమని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ జనరల్ మేనేజర్, జోనల్ హెడ్ మన్మోహన్ గుప్తా పేర్కొన్నారు. ఎమ్ఎస్ఎమ్ఈలు లేనిదే పారిశ్రామికాభివృద్ధి లేదన్నారు. ఎమ్ఎస్ఎమ్ఈలకు, పారిశ్రామికవేత్తలకు రుణ సదుపాయంలో అండగా నిలవడం సంతోషంగా ఉందన్నారు. లోన్ ల విషయంలో పారిశ్రామికవేత్తలకు జాప్యం రాకుండా చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా తోడ్పాటునందిస్తామని మన్మోహన్ గుప్తా తెలిపారు.
ఏపీఐఐసీ, బ్యాంక్ ఆఫ్ బరోడాకు మధ్య జరిగిన ఒప్పంద కార్యక్రమంలో ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్, సీజీఎం సుబ్బారెడ్డి(ఫైనాన్స్),సీజీఎం(అసెట్ మేనేజ్ మెంట్) ఎల్.రామ్, జనరల్ మేనేజర్ నాగ్ కుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) అఫ్సర్, సిడ్బి పీఎంయూ డాక్టర్ ఐ. శ్రీనివాసులు, పవన్, బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
———–
Comments are closed.