*సమిష్టి భాగస్వామంతో మన ప్రాంతాన్ని అభివృద్ది చేసుకుందాం : ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*
*: ఆత్మకూరు డెవలప్ మెంట్ ఫోరం బెంగళూరు ఛాప్టర్ ప్రారంభించిన ఎమ్మెల్యే*
*కన్నతల్లికి ఉన్న ఊరికి సేవ చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, ఆ ఆశ నెరవేర్చుకునేందుకు దారి తెలియక చేయాలని ఉన్నా చాలా మంది ఆగిపోతుంటారు, అలాంటి వారందరి సమిష్టి భాగస్వాములుగా మారి మన ఆత్మకూరు నియోజకవర్గాన్ని మనమంతా కలసి అభివృద్ది చేసుకుందామని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు.*
*ఆదివారం బెంగళూరులోని నోవాటెల్ హోటల్ లో ఆత్మకూరు నియోజకవర్గానికి చెంది వివిధ హోదాలలో బెంగళూరులో ఉంటున్న ప్రముఖులు, ఉద్యోగులు, వ్యాపారులతో కలసి ఆయన ఆత్మకూరు డెవలప్ మెంట్ ఫోరం బెంగళూరు చాప్టర్ ను ప్రారంభించారు.*
*ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ మెట్ట ప్రాంతమైన ఆత్మకూరు నియోజకవర్గాన్ని గతంలో చాలా మంది గొప్పవారు పాలన సాగించారని, వారందరూ ప్రభుత్వ సహకారంతో అభివృద్ది చేసుకుంటూ వచ్చారన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఇంకా చేయాల్సిన అభివృద్ది చాలా మిగిలి ఉందని పేర్కొన్నారు.*
*ప్రతి ప్రాంతంలో తాను పర్యటించిన సమయంలో ప్రభుత్వపరంగా చేయాల్సిన పనులు చాలా వరకు జరిగి ఉన్నా ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్న విషయాన్ని గుర్తించానని, ఆ ఆలోచనతో రాజకీయాలకు అతీతంగా ఆత్మకూరు డెవలప్ మెంట్ ఫోరం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.*
*ప్రభుత్వం ద్వారా సాధ్యమైనంత వరకు పనులు చేస్తూనే మన ప్రాంతానికి మనం చేయాల్సిన అభివృద్దిని ఈ ఏడీఎఫ్ ద్వారా చేయాలని కోరుకున్నానని, ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతోమన ప్రాంత సమస్యలను మనం దూరం చేద్దామని అన్నారు.*
*ఆత్మకూరు డెవలప్ మెంట్ ఫోరం ఏర్పాటు చేసి తొలిగా తమ కుటంబం నుండి రూ.10కోట్లు నిధులు కేటాయించడం జరిగిందని, అందులో భాగంగా తొలి ప్రాధాన్యత నిర్మాణంగా ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ నిర్మాణం చేపట్టడం జరిగిందని వివరించారు.*
*అదే విధంగా నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో సమస్యలను పూర్తిగా జాబితా రూపంలో సిద్దం చేసుకున్నామని, ఒక్కొక్కటిగా అన్ని పూర్తి చేసుకునేందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన మౌళిక వసతుల ఏర్పాటు వద్ద నుంచి డిజిటల్ క్లాస్ రూంల వరకు విద్యా, వైద్యం, వ్యవసాయం ఇలా ప్రతి రంగంలో అందరి సహకారం అవసరమని అన్నారు.*
*ఆత్మకూరు జిల్లా వైద్యశాలలో ఓ దాత ప్రతి రోజు నిత్యాన్నదానం నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారని, తొలుత మున్సిపల్ బస్టాండ్ లో ఏర్పాటు చేస్తానని చెప్పిన సమయంలో తాను జిల్లా వైద్యశాలలో ఏర్పాటు చేయాలని సూచించడం జరిగిందని, ఇప్పడు రోగులకు, వారి సహాయకులందరికి ఇది పూర్తిగాఉపయోగపడుతుందని, ఇలా మాట సాయం ద్వారా కూడా చాలా వరకు పనులు చేయవచ్చునని వివరించారు.*
*ప్రతి ఒక్కరూ ధనరూపేణా సహాయం చేయలేకపోయినా మాట రూపంలో, సమయం వెచ్చించి అయినా ఏడీఎఫ్ కు విస్తృత ప్రచారం కల్పిస్తే ఇది వేలాది మందికి చేరువై మన నియోజకవర్గాన్ని అభివృద్దికి బాట వేస్తుందని అన్నారు.*
*ఈ సందర్భంగా పలువురు ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రధానంగా నెలకొని ఉన్న సమస్యలను ఎమ్మెల్యే మేకపాటి దృష్టికి తీసుకురాగా అన్ని సమస్యలను పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకున్నామని, నిర్ణీత వ్యవధిలో నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసేలా పని చేస్తున్నట్లు వివరించారు.*
*ఎవరికి ఏ ప్రాంతవాసులకు సహాయం చేయాలని అనుకుంటున్నారో ఏడీఎఫ్ వెబ్ సైట్ లో చాలా వరకు పొందుపరుస్తున్నామని, ఇంకా ఏమైనా ఉంటే అదే వెబ్ సైట్ లో మాకు సూచనలు చేయవచ్చునని వివరించారు. త్వరలో ఏడీఎఫ్ హైదరాబాద్, చెన్నై ఛాప్టర్ లను కూడా ప్రారంభిస్తున్నామని వివరించారు.*
*ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నియోజకవర్గానికి వచ్చిన సమయంలో అభివృద్ది గురించి మాట్లాడే శాసనసభ్యులను చూశామే కానీ ఇలా రాజకీయాలకు అతీతంగా మన ప్రాంతాన్ని అభివృద్ది చేసుకుందామని చెబుతున్న శాసనసభ్యుడు మేకపాటి విక్రమ్ రెడ్డి అని ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.*
Comments are closed.