ఓర్వకల్లు రాళ్ళగుట్టల్లో పరిశ్రమల పంటలు* *అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజ: కర్నూలు జిల్లా ఇంఛార్జ్ మంత్రి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
తేదీ: 07-10-2022,
కర్నూలు.
*ఓర్వకల్లు రాళ్ళగుట్టల్లో పరిశ్రమల పంటలు*
*అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజ: కర్నూలు జిల్లా ఇంఛార్జ్ మంత్రి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*
*ఎగుమతులలో 7వ స్థానం నుంచి 4వ స్థానానికి ఎగబాకిన ఏపీ*
*ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ దే మొదటిస్థానం*
*హైదరాబాద్ – బెంగళూరు పారిశ్రామిక కారిడార్ ను సాధించాం*
*గత ప్రభుత్వం ఆర్భాటపు ప్రచారాలకే పరిమితం*
*అసలు అభివృద్ధి అంటే ఏంటో చేతల్లో చాటుతున్నాం*
కర్నూలు, అక్టోబర్, 07 : గత మూడేళ్లలో రాష్ట్రం అన్ని రంగాలలో ప్రగతి సాధించిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. పారిశ్రామికాభివృద్ధి దిశగా నిశబ్దంగా అడుగులు పడుతున్నాయన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్ కు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ముచ్చుమర్రి ప్రాజెక్టు మీదుగా నీటి వసతి ఏర్పాటుకు సంబంధించిన పనులకు మంత్రి బుగ్గన శంకుస్థాపన చేశారు. రూ.288 కోట్ల విలువైన పైప్ లైన్ మొదటి దశ పనులను ఏడాదిలోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను మంత్రి ఆదేశించారు. గత ప్రభుత్వంలా ఏమీ చేయకుండా అన్నీ పూర్తి చేసేసినట్లు ఆర్భాటంగా ప్రచారం చేయడం తమ విధానం కాదని మంత్రి స్పష్టం చేశారు. అనుకూల మీడియా, సోషల్ మీడియాల ద్వారా అసత్య ప్రచారాలతో ప్రతిపక్షాలు ఊదరగొడుతున్నా నిశబ్దంగా పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి బుగ్గన పేర్కొన్నారు.
గత ప్రభుత్వం కేంద్రంతో చివరి వరకే కలిసుండి కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయలేదని మంత్రి బుగ్గన అన్నారు. హైదరాబాద్- బెంగళూరు పారిశ్రామిక కారిడార్ ని మంజూరు చేయించిన ఘనత సీఎం జగన్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానిదన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చొరవ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వ కృషికి ఇదే నిదర్శనమన్నారు. 57 కి.మీ పైపులైన్ ద్వారా ముచ్చుమర్రి నుంచి ఓఎమ్ఐహెచ్ కు నీటి సరఫరా అందుబాటులోకి రావడం వల్ల మరిన్ని పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయని మంత్రి తెలిపారు. అనంతపురం, విశాఖ, చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం, కర్నూలు అన్ని ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధి పరవళ్లు తొక్కుతుందన్నారు. అరటితోటల మధ్యలో పరిశ్రమలు, అద్దె షూట్ లతో పెట్టుబడులంటూ ప్రచారమే గత ప్రభుత్వ విధానమన్నారు. నిశబ్దంగా అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకుంటూ పోవడమే తమ నినాదమన్నారు. ఉయ్యలవాడ నరసింహారెడ్డి ఎయిర్ పోర్ట్ ఏమీ చేయకుండానే ప్రారంభించారన్నారు. సోమవారం పోలవరం అని ప్రచారం చేసుకుని..వాస్తవానికి చేసింది శూన్యమన్నారు.
ప్రతి జిల్లాలో పారిశ్రామికవేత్తలతో చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో సమావేశాలకు నిర్ణయించినట్లు ఈ సందర్భంగా మంత్రి బుగ్గన వెల్లడించారు. పారిశ్రామికవేత్తలకు చిన్న ఇబ్బంది కూడా రాకూడదన్నదే అంతిమ లక్ష్యంగా ఎప్పటికప్పుడు వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. రూ.80 కోట్లతో కర్నూలుకి సుంకేశుల ద్వారా నీరందించేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. త్వరలోనే అనుమతుల అనంతరం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం ఖాయమన్నారు.మల్లికార్జున రిజర్వాయర్ పై ముఖ్యమంత్రితో మాట్లాడతానన్నారు. ఓర్వకల్ సర్వే నంబర్ 1లో సాగు రైతులకు చట్టపరంగా ఇవ్వవలసిన నష్టపరిహారం చెల్లించి న్యాయం చేస్తామని స్థానిక ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి విజ్ఞప్తిపై మంత్రి స్పందించారు.
*ముఖ్యమంత్రి నాయకత్వంలో మూడేళ్లలోనే పరిశ్రమల పరుగులు : ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి*
ఎక్కువ పని తక్కువ ప్రచారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ విధానమని ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవిందరెడ్డి వెల్లడించారు. నిశబ్ద పారిశ్రామిక విప్లవానికి సీఎం శ్రీకారం చుట్టారన్నారు.సీఎం జగన్ వరుస ప్రారంభోత్సావాలు, శంకుస్థాపనలే అభివృద్ధికి నిదర్శనమని ఛైర్మన్ పేర్కొన్నారు. ఏ పరిశ్రమకైనా అన్ని సదుపాయాలిస్తాం..అన్ని విధాల సహకరిస్తాం అన్నారు. ఫార్మా పరిశ్రమలకూ ఓర్వకల్ పార్క్ అనుకూలమని ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి తెలిపారు.
పారిశ్రామికాభివృద్ధిలో ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్ కీలకంగా మారుతుందని ఏపీఐఐసీ వీసీ, ఎండీ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా వెల్లడించారు. పారిశ్రామిక విధానం, పారదర్శకపాలనతో మరిన్ని పెట్టుబడులు ఏపీకి రానున్నాయన్నారు. రోడ్డు, రైలు, విమానాశ్రయం వంటి అన్ని సదుపాయాలతో పాటు నీటి వసతి ఓర్వకల్ పారిశ్రామిక పార్కును పెట్టుబడులకు చిరునామాగా మారుస్తుందని ఏపీఐఐసీ వీసీ, ఎండీ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా అన్నారు.
జిల్లా కలెక్టర్ శ్రీ పి.కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఈ కారిడారుకు భూములు ఇచ్చిన రైతుల సమస్యలన్నీ తీరుస్తామని వారికి రావలసిన అన్ని రకాల సహాయం వారికి అందించడం జరుగుతుందని తెలిపారు .ఈ పారిశ్రామిక వాడ రావడానికి కృషి చేసిన ఆర్థిక మంత్రి గారికి ధన్యవాదాలు తెలిపారు.
రాళ్ళ భూముల్లో పారిశ్రామిక సిరులు కురుస్తాయని నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి వెల్లడించారు. ఓర్వకల్లు పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని పోచా బ్రహ్మానందారెడ్డి తెలిపారు.
*ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు : పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి*
ఓర్వకల్ లాంటి పెద్ద పార్కును అభివృద్ధి చేయడానికి సీఎం శ్రీకారం చుట్టారని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ పేర్కొన్నారు. పారిశ్రామికంగా ఓర్వకల్లును తీర్చిదిద్దడంలో మంత్రి బుగ్గనది కీలక పాత్రని ఎమ్మెల్యే కాటసాని తెలిపారు. గ్రీన్ కో కంపెనీ ద్వారా సోలార్ పవర్, విండ్ పవర్, హైడ్రో పవర్ తయారీ అంతా తన నియోజకవర్గంలో జరుగుతుందన్నారు. సంక్షేమంతో పాటు పారిశ్రామిక ప్రగతిపై ముఖ్యమంత్రి శ్రద్ధ వహించారన్నారు. సాగు రైతులకు నష్టపరిహారమిచ్చాకే భూములను సేకరించిన ప్రభుత్వం తమదన్నారు. పరిశ్రమలకు భూములిచ్చిన కుటుంబాలకే ఉద్యోగాల కల్పనలో తొలి ప్రాధాన్యతనివ్వాలని కాటసాని కోరారు.
పరిశ్రమలకు నీరు ఎంతో ఆవశ్యకమని ఏపీఐఐసీ డైరెక్టర్ మర్రి గోవింద్ రాజ్ వెల్లడించారు. ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు వెనుక ఆర్థిక మంత్రి కృషి చాలా ఉందన్నారు. ఓర్వకల్ పారిశ్రామికాభివృద్ధితో ఉపాధి అవకాశాలకు కొదవ ఉండదని జెడ్పీటీసీ సభ్యులు రంగనాథ గౌడ్ పేర్కొన్నారు. 10వేలకు పైచిలుకు పారిశ్రామిక భూమి ఒకే చోట అందుబాటులో ఉండడం సానుకూలమని ఫుడ్ ప్రాసెసింగ్ ఛైర్మన్ రామలింగారెడ్డి తెలిపారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ తోడ్పాటు హర్షణీయమని కర్నూలు జెడ్పీ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏ ఇబ్బంది వచ్చినా స్పందించే తీరు వల్లే పరిశ్రమల ప్రగతి సాధ్యమన్నారు. ఎస్సీ, ఎస్టీ చాంబర్ ఆఫ్ కామర్స్ , ఇండస్ట్రీ ప్రెసిడెంట్ రాజమహేంద్రనాథ్ మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ ప్రోత్సాహం పట్ల ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
శంకుస్థాపన కార్యక్రమంలో పాణ్యం నియోజకవర్గ శాసనసభ సభ్యులు కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి, ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి, ఏపీఐఐసీ డైరెక్టర్ మర్రి గోవింద్ రాజ్,కర్నూలు జెడ్పీ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు రంగనాథ గౌడ్, కర్నూలు జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు, ఏపీఐఐసీ వీసీ, ఎండీ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్,ఏపీఐఐసీ కర్నూలు జోనల్ మేనేజర్ విశ్వేశ్వరరావు, ఎస్సీ, ఎస్టీ చాంబర్ ఆఫ్ కామర్స్ , ఇండస్ట్రీ ప్రెసిడెంట్ రాజమహేంద్రనాథ్ , 11 గ్రామాల సర్పంచ్ లు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
——–
Comments are closed.