తేదీ – 28-07-2023*
*స్థలం – తాడేపల్లి*
*వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం జగన్ సమీక్ష*
ముంపు ప్రాంతాల్లో కచ్చా ఇళ్లు దెబ్బతింటే రూ. 10వేలు ఇవ్వండి*
ఆంధ్రప్రదేశ్‌తోపాటు, తెలంగాణ, ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి, కృష్ణా, ఇతర నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఏపీలోని కొన్ని జిల్లాలు వరద ముంపునకు గురయ్యాయి. ఈ సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వివిధ జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ సూచించారు. రోజు రోజుకీ భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుండటంతో.. ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సీఎం ఆదేశించారు.
*అధికారులు మంచి చేశారు అని చెప్పుకోవాలి…*
ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ప్రమవాహం సుమారు 16 లక్షలకు చేరుకునే అవకాశాలు ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్న తరుణంలో.. కలెక్టర్లు అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని సీఎం తెలిపారు. వరద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో సహాయ, పునరావాసం కార్యక్రమాలు అత్యంత సమర్థవంతంగా సాగాలన్నారు. అధికారులు మానవీయ కోణంలో సాయం అందించాలన్నారు. డబ్బుల గురించి ఆలోచించకుండా బాధితులకు అండగా ఉండాలన్నారు. అధికారులు తమకు మంచి చేశారు అన్న మాటే తనకు వినిపించాలని సీఎం చెప్పారు.
*నిత్యావసరాలు అందరికీ అందజేయాలి*
ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజల ఇళ్లు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు పంపినట్లు అధికారులు సీఎంకు వివరించారు. అవసరం అనుకుంటే… పరిస్థితిని అంచనా వేసుకుని మిగిలిన ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం జగన్ తెలిపారు. సహాయ శిబిరాల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పించాలన్నారు. సహాయ శిబిరాల నుంచి తిరిగి ఇళ్లకు పంపించేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2వేలు రూపాయలు ఇవ్వాలని, వ్యక్తులైతే వారికి రూ.1000లు ఇవ్వాలని అధికారులకు సూచించారు. కచ్చా ఇళ్ల విషయంలో కలెక్టర్లు మానవీయ దృక్పథంతో ఉండాలన్నారు. కచ్చా ఇళ్లు ఉన్న ప్రతి ఒక్కరికీ రూ.10వేలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఇలాంటి సమయాల్లో వారికి బాసటగా అధికారులు నిలవాలన్నారు. అలాగే ముంపునకు గురైన ఇళ్లు, అలాగే వరదనీరు ప్రవహించిన ఇళ్లు ఉన్న ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలన్నారు. ఉదారంగా నిత్యావసరాలను పంపిణీ చేయాలన్నారు. 25 కేజీల బియ్యం, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళాదుంపలు, కేజీ పామాయిల్, కేజీ కందిపప్పు ఇవ్వాలన్నారు.
ఈ నాలుగు సంవత్సరాల్లో ప్రతి ఏడాది కూడా ఇలాంటి పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామన్నారు. కంట్రోలు రూమ్స్ ఏర్పాటు చేయడం, జిల్లా స్థాయి నుంచి మండల స్థాయివరకూ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలన్నారు. సచివాలయ స్థాయిలో కూడా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. సచివాలయాల సిబ్బందిని, వాలంటీర్ల సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని, ముంపు బాధిత గ్రామాల మీద, లంకల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఆయా ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు సరిపడా నిల్వ ఉండేలా చూసుకోవాలన్నారు. లంక గ్రామాలలో జనరేట్లర్లు లాంటివాటిని సిద్ధంచేసుకోవాలన్నారు. తాగునీటి కొరత లేకుండా, తాగునీటి సరఫరా వ్యవస్థలు నిలిచిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు ఆయా గ్రామాల్లో ముమ్మరంగా చేపట్టాలన్నారు. అలాగే ఆరోగ్య శిబిరాలను కూడా ఏర్పాటు చేయాలన్నారు. వరదల కారణంగా పాముకాట్లు పెరుగుతాయి, వీటికి అవసరమైన మందులను అందుబాటులో చేసుకోవాలన్నారు. వరదనీరు తగ్గాక పంట నష్టం వివరాలను నమోదు చేసుకుని రైతులకు బాసటగా నిలిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. అత్యంత పారదర్శకత పద్ధతిలో నష్టపరిహారం చెల్లించాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు.
ఈ కార్యక్రమంలో హోం, విపత్తు నిర్వహణశాఖ మంత్రి తానేటి వనిత, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కె వి రాజేంద్రనాథ్ రెడ్డి, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి సాయి ప్రసాద్, పురపాలక,పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ కె విజయానంద్, పౌరసరఫరాలశాఖ కమిషనర్ హెచ్ అరుణ్‌కుమార్, ఆర్అండ్బి కార్యదర్శి పీ ఎస్ ప్రద్యుమ్న, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ పి. కోటేశ్వరరావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ ఎ సూర్యకుమారి, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ జి లక్ష్మీషా, ఏపీ విపత్తు నిర్వహణశాఖ డైరెక్టర్ డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Comments are closed.