The South9
The news is by your side.
after image

నేను లేకపోయి ఉండుంటే.. గౌతమ్‌ బహుశా రాజకీయాల్లోకి కూడా వచ్చి ఉండేవాడు కాదేమో.. వైయస్ జగన్

*28–03–2022,*
*శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా.*

*వీపీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి సంస్మరణ సభ.*

*గౌతమ్‌ రెడ్డి సంస్మరణ సభలో పాల్గొన్ని ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం  వైయస్‌.జగన్‌*

*ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా.*

*వైయస్ జగన్ మాట్లాడుతూ….

Post Inner vinod found

ఈ రోజు ఇటువంటి పరిస్థితుల మధ్య ఇలా మాట్లాడాల్సి వస్తుందని అని ఏరోజూ నేను కలలో కూడా ఊహించుకోలేదు. గౌతమ్‌ మన మధ్య లేడు అని అంటే నమ్మడానికి కూడా ఇంకా మనసుకి కష్టంగా ఉంది. ఇంకా కనిపిస్తూనే ఉంటాడు… రొటీన్‌గా వస్తున్నట్టుగానే ఉంది. తను ఇంక రాడు.. ఇక లేడు అనే సత్యాన్ని జీర్ణించుకోవడానికి కూడా టైం పడుతుంది.

గౌతమ్‌ గురించి చెప్పాలంటే… నాకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయం. మంచి స్నేహితుడు. నాకు బాగా గుర్తుంది. రాజకీయాల్లోకి తను అప్పుడు ఇంకా అడుగుపెట్టలేదు. నేను లేకపోయి ఉండుంటే.. గౌతమ్‌ బహుశా రాజకీయాల్లోకి కూడా వచ్చి ఉండేవాడు కాదేమో. రాజకీయ ఆలోచన కూడా లేదు. అప్పట్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి నేను అడుగు బయటికి అడుగులు వేసినప్పుడు 2009–10 ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీతో ఒక యుద్ధం మొదలైంది. అప్పట్లో రాజమోహన్‌రెడ్డి గారు కాంగ్రెస్‌ పార్టీ ఎంపీగా ఉన్నారు. నేను 2009లో అప్పుడే ఎంపీగా ఎన్నికయ్యాను. కానీ రాజమోహన్‌ రెడ్డిగారు కంటే గౌతమ్‌తో నాకున్న సాన్నిహిత్యమే.. రాజమోహన్‌ రెడ్డిగారిని నావైపున ఉండేటట్టుగా గౌతమ్‌ ఒత్తిడి, అభిమానమే ఎక్కువగా పనిచేసిందని చెప్పాలి. ఆ రకంగా ప్రతి అడుగులోనూ గౌతమ్‌ తోడుగా ఉన్నాడు. 2009–10 నుంచి సాగిన ఆ ప్రయాణంలో ప్రతి అడుగులోనూ నాకు తోడుగా, స్నేహితుడిగా ఉన్నాడు. నా కన్నా గౌతమ్‌ వయస్సులో సంవత్సరం పెద్ద. అయినా ఎక్కడా కూడా తాను నాకన్నా పెద్ద అన్న భావం మనస్సులో ఉండేది కాదు. నన్నే ఒక అన్నగా భావించేవాడు. తను నువ్వు చేయగలుగుతావు… మేమంతా ఉన్నాం అని నన్ను ప్రోత్సహించేవాడు. అటువంటి ఒక మంచి వ్యక్తిని పోగొట్టుకున్నామన్నది ఈ రోజుకు కూడా జీర్ణం చేసుకోలేని అంశం.

Post midle

రాజకీయాల్లోకి తనను నేనే తీసుకురావడం జరిగింది. రా గౌతమ్‌ అని చెప్పి తనను రాజకీయాల్లోకి తీసుకుని వచ్చి… నేను అడుగులు వేస్తేనే తను అడుగులు వేశాడు. ఆ తర్వాత ఒక మంచి రాజకీయనాయకుడిగా కూడా తాను ఎదిగాడు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి… ఆ తర్వాత మంత్రిపదవి చేపట్టిన తర్వాత ఒక మంచి మంత్రిగా కొనసాగాడు. పరిశ్రమలు, ఐటీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌తో పాటు దాదాపు ఆరుశాఖలు నిర్వహించాడు. ప్రతి సందర్భంలోనూ పరిశ్రమలు ఇక్కడికి తీసుకుని రావాలి… ఇక్కడికి తీసుకుని వస్తే… రాష్ట్ర ప్రభుత్వానికి, నాకు వ్యక్తిగతంగా మంచి పేరు వస్తుందని ఎప్పుడూ తాపత్రయపడేవాడు. అందులో భాగంగానే బహుశా చివరి క్షణాల్లో దుబాయ్‌ వెళ్లాడు. వెళ్లేముందు నాకు కనిపించాడు. దుబాయ్‌కి వెళ్లి వచ్చిన తర్వాత అక్కడ జరిగిన పరిణామాల మీద నన్ను కలవాలని టైం కూడా అడిగాడు. అంతలోపే ఈ సంఘటన జరిగింది. ప్రతి సందర్భంలోనూ ఒక మంచి మంత్రిగా, మంచి ఎమ్మెల్యేగా, ఒక మంచి స్నేహితుడిగా అన్నిరకాలుగా ఒక మంచి వ్యక్తిని కోల్పోయామని అని చెప్పి… జీర్ణించుకోవడం కష్టంగా ఉంది.

ఒక్కటైతే చెప్తున్నాను. మంచి స్నేహితుడిని, మంచి వ్యక్తిని పోగొట్టుకున్నాం కానీ.. ఆ కుటుంబానికి నేనే కాదు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మొత్తం తోడుగా ఉంటుంది. కచ్చితంగా ఆ కుటుంబానికి దేవుడి తోడుగా ఉండాలని, అన్ని రకాలుగా మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను.

ఎంత చెప్పినా, ఎంత మాట్లాడినా ఆ లోటును భర్తీ చేయలేం.. కానీ మనిషి వెళ్లిపోయిన తర్వాత ఎంతమంది మనసుల్లో నిలిచిపోయాడు అన్నది మాత్రం కచ్చితంగా నిలబడిపోతుంది. ఆ విషయంలో గౌతమ్‌ అగ్రస్ధానంలో ఉంటాడు, ఉన్నాడు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాజమోహన్‌ రెడ్డి గారు, గౌతమ్‌ జ్ఞాపకార్థం …మొన్న అంత్యక్రియలకు వెళ్లినప్పుడు కొన్ని విషయాలు చెప్పారు. కళాశాలను ప్రభుత్వపరంగా తీసుకోవడం, అగ్రికల్చర్‌ అండ్‌ హార్టికల్చర్‌ కాలేజీ కింద మార్చడమే కాకుండా.. అవకాశం ఉంటే దానిని యూనివర్సిటీగా చేయాలని అడిగారు. ఇటువంటి అభివృద్ధి విషయాలలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్‌ 2లో ఉన్న ఉదయగిరి, బద్వేలు ప్రాంతాన్ని ఫేజ్‌ 1లోకి తీసుకొచ్చి…అక్కడ కూడా ఆత్మకూరు, ఉదయగిరి రెండు నియోజకవర్గాలకు మంచి జరుగుతుందని… దాన్ని కూడా వేగవంతం చేస్తే బాగుంటుందన్నారు. దాని వల్ల గౌతమ్‌ పేరు చిరస్ధాయిగా నిలబడిపోతుందని అడిగారు. ఇవన్నీ కూడా కచ్చితంగా జరుగుతాయి. అంతే కాకుండా సంగమ్‌ బ్యారేజీ పనులన్నీ మే 15 లోగా పనులన్నీ పూర్తవుతాయని మంత్రి అనిల్‌ కుమార్‌ చెప్తున్నారు. ఈ దఫా ఆ తేదీలలో ఒక మంచి రోజు చూసుకుని… మళ్లీ నేను ఇక్కడికి వస్తాను. రాజమోహన్‌రెడ్డిగారు, ఇతర కుటుంబ సభ్యులతో పాటు ఆ ప్రాజెక్టును ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొంటాం. గౌతమ్‌ జ్ఞాపకార్ధం సంగమ్‌ బ్యారేజ్‌కు మేకపాటి గౌతమ్‌ సంగమ్‌ బ్యారేజే అని పేరు పెడతాం. తద్వారా గౌతమ్‌ చిరస్థాయిగా, ఎప్పుడూ మన మనస్సుల్లో ఉండే కార్యక్రమం చేస్తాం. అన్ని రకాలుగా ఆ కుటుంబానికి మంచి జరగాలని మనసారా మరొక్కసారి కోరుకుంటూ… సెలవు తీసుకుంటున్నానని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు.

Post midle

Comments are closed.