The South9
The news is by your side.
after image

ఐసీఎంఆర్ షాకింగ్ ప్రకటన.. ప్లాస్మా పని చేయట్లేదట

ప్రపంచానికి చుక్కలు చూపిస్తున్న కోవిడ్ -19.. ఒక పట్టాన కొరుకుడుపడనిదిగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నప్పటికీ.. ఇప్పటికి ఈ వైరస్ కు చెక్ పెట్టే వ్యాక్సిన్ తయారీలో పెద్ద ఎత్తున సవాళ్లు ఎదుర్కోవటం తెలిసిందే. ఇది సరిపోదన్నట్లు.. చికిత్సలోనూ ఎదురవుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు.

కోవిడ్ వైద్యంలో ప్లాస్మా చికిత్స మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్లుగా ఇప్పటివరకు విన్నాం. కానీ.. అసలు వాస్తవం ఏమిటంటే.. అంటూ భారతీయ వైద్య పరిశోధన సంస్థ (సింఫుల్ గా చెప్పాలంటే ‘ఐసీఎంఆర్’) చెప్పిన మాట షాకింగ్ గా మారింది.

అదేమంటే.. ప్లాస్మా చికిత్సతో పెద్ద ప్రభావం లేదని.. దాని కారణంగా మెరుగైన పరిస్థితులు ఏమీ చోటు చేసుకోవటం లేదని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. మరణాల రేటు తగ్గించటంలో కానీ.. కోవిడ్ తీవ్రతను తగ్గించటంలో ప్లాస్మా ప్రభావాన్ని చూపించటం లేదని పేర్కొంది. ఏప్రిల్ 22 నుంచి జులై 14 మధ్య పలు ప్రభుత్వ.. ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్లాసిడ్ ట్రయల్ పేరుతో జరిపిన పరీక్షలకు సంబంధించిన వివరాల్ని పరిశీలించినప్పుడు ఈ విషయం అర్థమైందని చెప్పింది.

Post Inner vinod found

ప్లాస్మా చికిత్సలో భాగంగా 464 మంది కోవిడ్ రోగుల్ని ఎన్నుకొని.. వారిలో 235 మందికి ప్లాస్మాను ఎక్కించారు.మరో 229 మందికి ప్లాస్మా చికిత్స చేయకుండా సాధారణ చికిత్స చేశారని పేర్కొన్నారు. ప్లాస్మా చికిత్సలో భాగంగా ఈ పరీక్షల్లో పాల్గొన్న వారికి 24 గంటలకు ఒక్కొక్కటి చొప్పున రెండు డోసుల ప్లాస్మా ఇచ్చినట్లుగా పేర్కొంది. ప్లాస్మా ఇచ్చిన నాటి నుంచి 28 రోజుల వరకు సాధారణ చికిత్స చేసిన వారితో పోల్చినప్పుడు పెద్ద తేడా ఏమీ కనిపించలేదని ఐసీఎంఆర్ వెల్లడించింది.

రెండు చికిత్సా విధానంలో రెండు గ్రూపుల మధ్య పెద్ద తేడా కనిపించలేదని.. మరణాల రేటు కూడా మారలేదన్న విషయాన్ని తాము గుర్తించినట్లుగా పేర్కొంది. తాము చేసిన ఈ పరిశోధనను కోవిడ్ 19 కోసం ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్ ఫోర్సు కూడా పరిశీలించిందని.. తాము చెప్పిన అంశాల్ని ఆమోదించిందన్నారు.

ఫ్లాస్మాథెరపీ ప్రయోగం సురక్షితమే కానీ ప్లాస్మాను నిల్వ చేయటం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా చెప్పాలి. ఈ చికిత్సా విధానంపై చైనా.. నెదర్లాండ్ లలో పరిశోధనలు చేశారు. అయితే..ఈ రెండు దేశాలు ఆ పరిశోధనల్ని మధ్యలోనే ఆపేయటం గమనార్హం. తాజాగా ప్లాస్మా చికిత్సతో పెద్ద ప్రయోజనం లేదన్న విషయాన్ని ఐసీఎంఆర్ వెల్లడించటంతో కోవిడ్ చికిత్స మొదటికి వచ్చిందని చెప్పాలి. ఒక అడుగు ముందుకు పడితే.. రెండు అడుగులు వెనక్కి పడిన చందంగా కోవిడ్ వ్యవహారం ఉందని చెప్పక తప్పదు.
Tags: ICMR, shocking announcement, plasma not working, coronavirus patients

Post midle

Comments are closed.