హైదరాబాద్ ప్రతినిధి: సైబరాబాద్ పోలీస్ పెట్రోలింగ్ వాహనాలను ప్రారంభించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్
జాతీయ రహదారి భద్రత మాసంలో పాల్గొన్న ఎన్టీఆర్
సైబరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో ప్రత్యేక కార్యక్రమం
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వార్షిక సమావేశం
సైబరాబాద్ పోలీసుల పెట్రోలింగ్ వాహనాలను సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రస్తుతం కొనసాగుతోన్న జాతీయ రహదారి భద్రత మాసంలో భాగంగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వార్షిక సమావేశం కూడా జరుపుతున్నారు. దీనికి అతిథిగా ఎన్టీఆర్ హాజరయ్యాడు. అలాగే, అడిషనల్ డీజీ రైల్వేస్ సందీప్ శాండిల్య, ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ సైబరాబాద్ పోలీసుల సేవలను కొనియాడారు. ట్రాఫిక్ పోలీసులు రహదారి భద్రత విషయంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ మంచి ఫలితాలను సాధిస్తున్నారని చెప్పారు. డీసీపీ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసుల కృషి వల్ల ట్రాఫిక్ జామ్ సమస్యలు, రోడ్డు ప్రమాదాల వంటివి గత మూడేళ్లుగా తగ్గిపోయాయని అన్నారు. హెల్మెట్ పెట్టుకోకపోయినా, మద్యం తాగినా సైబరాబాద్ పరిధిలోని రోడ్లలోకి వెళ్లకూడదని వాహనదారులు భావిస్తున్నారని, అంతగా కృషి చేసి ట్రాఫిక్ పోలీసులు మంచి పేరు తెచ్చారని సీపీ సజ్జనార్ ప్రశంసించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎన్టీఆర్ మాట్లాడుతూ….. నేను ఈ కార్యక్రమానికి నటుడిగా రాలేదు
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు కుటుంబ సభ్యులను కోల్పోయాను . ఒక కుటుంబంలో ఇద్దరు సభ్యులు కోల్పోయాం అంటే ఆ బాధ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే
ఓ పౌరుడిగా ఇక్కడకు వచ్చాను అని అన్నారు. రహదారి భద్రతా నిబంధనలను పాటించడం అన్నింటి కన్నా ముఖ్యమైన విషయం’ అని ఎన్టీఆర్ చెప్పాడు.
అవగాహన కోసం పోలీసులు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపాడు. రహదారులపై అందరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించి మళ్లీ సురక్షితంగా ఇంటికి వెళ్లాలని పిలుపునిచ్చాడు. కాగా, కార్యక్రమం ప్రారంభించేముందు ఎన్టీఆర్‌కు పోలీసులు ఘన స్వాగతం పలికారు.
Comments are closed.