సినీ బ్యూరో : ప్రముఖ సినీ రచయిత, చిత్రకారుడు లక్ష్మీ భూపాల తన రచనలతో పాటు తను బొమ్మలు గీసే విధానం తో కూడా తన అభిమానులను అలరిస్తూ ఉంటాడు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలోని ప్రముఖుల జన్మదినం సందర్భంగా వారి గురించి తనకున్న అభిప్రాయాన్ని, తనకున్న పరిచయాన్ని వివరిస్తూ వారి చిత్రాన్ని తన స్వహస్తాలతో వేసి ఆ విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్న ప్రముఖ దర్శకుడు (సీనియర్)వంశీ గురించి ఆయన రాసిన ఆర్టికల్….. మీకోసం…………………………………………………………….. ఈ మనిషి మహా తలతిక్కలోడు.. భారతీరాజా, కె.విశ్వనాధ్ లాంటి గొప్పోళ్ల దగ్గర అసిస్టెంట్ గా పన్జేసి ‘మంచుపల్లకి’ అనే రీమేక్ సినిమాతో డైరెక్టర్ అయ్యాడు.. ఆ తర్వాత తీసిన అన్వేషణ, సితార సినిమాలతో ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీ, ప్రేక్షకులు ఉలిక్కిపడి ‘ఎవరీ వంశీ’ అని చూసేలా చేసాడు.. సినిమా కథల్లో, మేకింగ్ లో అప్పటివరకు ఉన్న రూల్స్ కి అడ్డంగా వెళ్ళిపోయి ఇలాక్కూడా తియ్యొచ్చు సినిమా అన్నాడు.. అవార్డులు, రివార్డులు, సన్మానాలు, సత్కారాలు గబగబా జరిగిపోయాయి..
మంచి భావుకుడిగా మహర్షి, ప్రేమించు పెళ్లాడు సినిమా వరకు బాగానే ఉన్నాడు.. ఆ తర్వాత వచ్చిన ‘లేడీస్ టైలర్’ అనే సినిమా సూపర్ హిట్టైపోయి, మనకి వంశీ లోని సృజనాత్మక దర్శకుడ్ని దూరం చేసేసింది.. నాకు ఇప్పటికీ బాధగా అనిపించే విషయం ఇది.. ఎందుకంటే ఆయన పూర్తిగా కామెడీ సినిమాల దర్శకుడైపోయాడు..అది అస్సలు నచ్చలేదు నాకు.. తర్వాత వచ్చిన శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్, చెట్టుకింద ప్లీడర్, ఏప్రిల్ 1 విడుదల లాంటి సినిమాల్ని ఇష్టపడినా, నేను క్రేన్ మీద నిలబెట్టి, ఆకాశంలో పెట్టి చూసుకున్న ‘వంశీ’ నాకు దూరమైపోయాడు.. ఈ మాట కొంతమందికి అర్ధం కాకపోవచ్చు.. ఎందుకంటే ఇప్పుడు సినిమా అంటే కామెడీ మాత్రమే అనుకునే ప్రేక్షకులు పెరిగిపోయారు, కథల్లో విషయం లేకపోయినా స్టార్లు వల్లో, పిచ్చి మాటల వల్లో అవే హిట్ అవుతున్నాయి కాబట్టి..
ఇకపోతే వంశీ ఒక రచయితగా నాకు చాలా ఇష్టం.. కథల్ని కళ్ళక్కట్టేస్తాడు.. పసలపూడి కథలు, గాలికొండాపురం రైల్వే గేటు, మహాల్లో కోకిల లాంటి రచనలన్నీ ఒకెత్తైతే, నేను ఎప్పుడో చదివిన శంకరాభరణం సినిమా నవల నాకు చాలా ఇష్టం..
ఒకసారి ఈయన నాకు ‘గోపి గోపిక గోదావరి’ సినిమా కథ చెప్పాడు.. కథ చెప్పడానికి ముందు ఈయన ఒక డిస్క్లైమర్ ఇచ్చాడు “నాకు కథ చెప్తుమ్ రాదండీ” అని.. అంతేలే రాసినోళ్లు, తీసినోళ్లు అంత గొప్పగా చెప్పలేకపోవచ్చు అనుకున్నా..
ఆయనెలా చెప్పాడో మచ్చుకో సీను….
“హీరోయిన్ ఉదయం రమారమి ఆరేడు గంటల మజ్జిని గోదారిగట్టుని పావడా తడవకుండా మోకాళ్ళ మీదకి లాక్కుని, కాళ్ళు నీళ్ళల్లో పెట్టి కూచ్చోనుంది.. కాళ్ళు పసుపురంగులో ఉన్నా పెట్టుకున్న బంగారప్పట్టీలు సూర్య కిరణాలు పడి తళతళా మెరుస్తున్నాయి నీళ్ళల్లో.. ఆ కాళ్ళ మయాన్ని చిన్న చిన్న రంగుచేప్పిల్లలు కలతిరుగుతా ఉంటే, ఆయమ్మాయికి పర్లాంగు దూరంలో గట్టుని మూడుపక్కలా ఇటుకలు పెట్టి, మధ్యలో చింతపుల్లలేసి తాటాకు మంటపెట్టి, పైన మట్టి దాకలో చేపల పులుసొండుతుంది ఆళ్ళమ్మ……. ” ఎంత అందంగా చెప్పాడీ ఊహ.. ఇది కదా దర్శకుడికి కావాల్సిన ఊహాశక్తి అనిపించింది.. వింటూ నేను కూడా కాస్త నెరేషన్ నేర్చుకున్నా.. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాకి నేను పనిచెయ్యడం కుదర్లేదు.. కానీ ఈ మనిషి నాకిష్టం.. ఈయన మొదట్లో చేసిన సిన్మాలిష్టం.. నేను సినిమా అంటే ఏంటో తెల్సుకోడానికి నన్ను పరోక్షంగా తన సినిమాలతో ఉసిగొల్పాడు కాబట్టి ఇంకా ఇష్టం..
ప్రపంచ సినిమా తెల్సిన మనిషి వంశీ..
సృజనాత్మక ఆలోచనలతో ఒక తరాన్ని ప్రభావితం చేసిన దర్శకుడు వంశీ..
ఈయన పెట్టిన షాట్లు పెట్టాలని ఇప్పటికీ ముప్పుతిప్పలు పడుతూ ఫెయిల్ అవుతున్న దర్శకులందరో నాకు తెల్సు.. ఈయన తీసినట్టు పాటలు తీద్దామని కలలుగనేవాళ్ళు కూడా తెల్సు.. పాటలంటే గుర్తొచ్చింది.. ఇళయరాజా ఈయన సిన్మాలక్కొట్టినట్టు మిగతా సినిమాల్లో ఉండదేంటో అనే ప్రశ్న వేసుకోని సినిమా అభిమాని ఉండడు.. అసలేం చెప్తాడో ఈ వంశీ ఆ ఇళయరాజాకి కథ చెప్పి ట్యూన్లు ఆడిగేటప్పుడు.. పాటలంత గొప్పగా ఉంటాయ్ మరి.. ఇలాగే ఈ మనిషి గురించి చెప్తూ పోతే ఇయ్యాల్టి పుట్టిన్రోజు వెళ్లిపోద్ది కాబట్టి ఆపేస్తా…
నా వరకూ గొప్ప దర్శకులంటే… తెలుగు సినిమాల్లో మొదటి తరం దర్శకుల్ని దాటాక..
ఒక #విశ్వనాధ్,
ఒక #బాపు,
ఒక #వంశీ… అంతే.
ఒక్క చివరాకరి మాట…
“ఇప్పుడు ఏమైపోయాడీ వంశీ?” అనుకునే తికమకలో అయితే నేను లేను.. ఆయన ఇప్పుడు ఎందుకలా లేడో నా మనసుకి, అనుభవానికి తెల్సు కాబట్టి….
ఇష్టంగా ఆయన బొమ్మ గీసి, ఈ నాలుగు మాటలు చెప్తూ…..
పుట్టినరోజు శుభాకాంక్షలు vamsy Director Vamsy గారు…
ఇట్లు
భవదీయుడు
లక్ష్మీ భూపాల ✍️.
Comments are closed.