హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారిక నివాసంలో నలుగురికి కరోనా పాజిటివ్ సోకింది. ఇందులో సమాచార శాఖలో పనిచేసే కెమెరా మెన్ ఉన్నారు.
దీంతో ప్రగతి భవన్ లో పనిచేసే మొత్తం సిబ్బందికి కరోనా పాజిటివ్ టెస్టులు నిర్వహించారు. కరోనా నియంత్రణ కోసం సీఎం కేసీఆర్ తన అధికారిక నివాసం ప్రగతి భవన్ లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ నలుగురికి సోకడంతో సంచలనంగా మారింది. ఇంతకు ముందే బేగంపేటలోని మెట్రో రైలు భవన్ లోని సీఎం కార్యాలయంలో ఇద్దరికి కరోనా సోకడంతో మూడు రోజుల పాటు కార్యకలాపాలు నిలిపివేశారు. పూర్తిగా శానిటైజేషన్ చేయడంతో పాటు, అందరికీ పరీక్షలు నిర్వహించి నిర్థారణ నివేదికలు వచ్చిన తరువాతే తిరిగి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యాలయంలో సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, ఇతర అధికారులు భూపాల్ రెడ్డి, స్మితా సబర్వాల్, రాజశేఖర్ రెడ్డి, ప్రియాంక వర్ఘీస్ విధులు నిర్వర్తిస్తున్నారు.
ప్రగతి భవన్ లో విధులు నిర్వర్తించే ఉద్యోగులను ఇళ్లకు పంపించకుండా షిప్టుల వారిగా గండిపేటలోని ఒక భవనానికి ప్రత్యేక వాహనాల్లో పంపిస్తున్నారు. అక్కడ రెస్టు తీసుకున్న తరువాత మళ్లీ నేరుగా ప్రగతి భవన్ విధులకు హాజరవుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా కాటు నుంచి ప్రగతి భవన్ తప్పించుకోలేకపోయింది.
Comments are closed.