సమగ్రాభివృద్ధి, సర్వతోముఖాభివృద్ధి దిశగా ఏపీ అడుగులు.. నీతి ఆయోగ్ వేదిక పై ఏపీ సక్సెస్ స్టోరీ: సీఎం జగన్
తేదీ : 27-05-2023*
- సమగ్రాభివృద్ధి, సర్వతోముఖాభివృద్ధి దిశగా ఏపీ అడుగులు.. నీతి ఆయోగ్ వేదిక పై ఏపీ సక్సెస్ స్టోరీ: సీఎం జగన్
*గ్లోబల్ ఇన్మెస్టిమెంట్ సమ్మిట్‌తో 13 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాం*
*ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ మూడేళ్లుగా నెంబర్ 1గా నిలిచింది*
నీతి అయోగ్ ఛైర్మన్ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం ఢిల్లీలో 8వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ‘వికసిత్ భారత్’ థీమ్‌తో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా.. 2047 నాటికి భారత్ సమ్మిళిత అభివృద్ది దిశగా అడుగులు వేయాలని ప్రధాని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్బంగా దేశంలోని పలు పార్టీలకు చెందిన సీఎంలతో చర్చాగోష్టి నిర్వహించి వారి అభిప్రాయాలను ప్రధాని మోదీ తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన కార్యక్రమాలతోపాటు.. దేశాభివృద్దికి ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలి, విదేశాలు అభివృద్దిలోకి రావడానికి దోహదపడిన అంశాలను సీఎం జగన్ ప్రస్తావించారు. ఏపీలో ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం తీసుకుంటున్న విధానాలను ఆయన వివరించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 10,592 గ్రామ, వార్డు క్లినిక్‌లను ఏర్పాటు చేశామని, ఇందులో ఒక మిడ్-లెవల్ హెల్త్ ప్రొవైడర్, ఒక ఏఎన్ఎం, ఆశావర్కర్లను అందుబాటులో ఉంచి .. ప్రతి గ్రామంలో,వార్డు క్లినిక్‌లో 105 రకాల అవసరమైన మందులు, 14 రకాల డయాగ్నస్టిక్స్ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. గత రెండున్నర సంవత్సరాల కాలంలోనే రాష్ట్రంలో 48,639 మంది వైద్యులను, ఆరోగ్య సిబ్బందిని నియమించామన్నారు. విలేజ్ క్లినిక్‌ల నుంచి బోధనాసుపత్రుల వరకు అవసరమైన వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు.
*ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తో.. ఇంటి వద్దకే వైద్యం*
రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని తీసుకొచ్చి… ప్రతి పీహెచ్సీ పరిధిలో ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వైద్య సేవలను స్పెషలిస్టు వైద్యుల ద్వారా అందిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వస్తున్న వ్యాధుల కట్టడికి ట్రాకింగ్, ఫైండింగ్, స్క్రీనింగ్, నిర్ధారించడం వంటి విధానాలను తమ రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు జగన్ పేర్కొన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023కి అద్భుతమైన స్పందన లభించించిందని, రూ. 13 లక్షల కోట్లు పెట్టుబడుల రూపంలో వచ్చాయన్నారు. దీనివల్ల దాదాపు 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఏర్పాటవుతున్నాయని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత మూడేళ్లుగా వరుసగా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. తాము ఎల్లప్పుడూ… వ్యాపారస్తులకు అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరించేలా నోట్‌ను కూడా సభ్యులకు సీఎం జగన్ అందజేశారు.
*మహిళా సాధికారత కోసం చేయూత, ఆసరా*
మహిళా సాధికారత కోసం ఏపీ ప్రభుత్వం చేయూత, ఆసరా వంటి అనేక పథకాలను అమలు చేస్తోందని, వీటి ద్వారా పేద మహిళలు నాలుగేళ్లోనే వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా సాయం చేస్తున్నామన్నారు. అంతేకాకుండా, మహిళా స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డి కార్యక్రమం, వారికి సకాలంలో రుణాలు ఇవ్వడం తమ ప్రభుత్వం లక్షంగా పెట్టుకుందని జగన్ తెలిపారు.
*రాష్ట్రంలో కొత్తగా 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు*
ఇక సరకు రవాణాను సులభతరం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోర్టు ఆధారిత అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని.. రాష్ట్రంలో కొత్తగా 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటవుతున్నాయన్నారు. అదేవిధంగా కర్నూలులోని ఓర్వకల్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశామని, విశాఖపట్నంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా పీపీపీ పద్ధతిలో నిర్మిస్తున్నట్లు వివరించారు.
*సీఎం జగన్ ప్రస్తావించిన ముఖ్యమైన అంశాలు ఇలా…*
భారతదేశంలో సరకు రవాణా కోసం అధికంగా ఖర్చుపెడుతున్నామని.. ఇది జీడీపీలో 14 శాతంగా ఉందన్నారు. ఇది ఉత్పత్తుల తయారిపై, అదేవిధంగా ప్రపంచస్థాయిలో వాటిని చేరవేసేందుకు ఇబ్బందికరంగా మారిందన్నారు. అమెరికాలో లాజిస్టిక్స్ ఖర్చు కేవలం జీడీపీలో 7.5 శాతానికే అని తెలిపారు. గడచిన తొమ్మిదేళ్లలో సరకు రవాణా కారిడార్లు, జాతీయ రహదారులపై ప్రభుత్వం ప్రశంసనీయరీతిలో ఖర్చు పెట్టిందన్నారు. రవాణా మెరుగు పడటంతో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. దేశ జీడీపీలో తయారీ, సేవల రంగం వాటా 85% దాటినప్పుడే ‘వికసిత్ భారత్’ లక్ష్యం నెరవేరుతుందన్నారు. వ్యవసాయం, పెట్టుబడుల అంశాలపై ఎక్కువగా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఆహార రంగంలో స్వయం సమృద్ధిని సాధించడంతోపాటు, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం చాలా అవసరమని సీఎం జగన్ తెలిపారు.
ప్రజారోగ్యం, పౌష్టికాహారంపై కూడా దృష్టి సారించాలని,, దీర్ఘకాలిక వ్యాధులైన షుగర్, గుండె సంబంధిత సమస్యలకు సకాలంలో వైద్యం అందించకుంటే.. తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. నైపుణ్యాభివృద్ధికి మరొక కీలక అంశం మని.. జర్మనీ వంటి అనేక అభివృద్ధి చెందిన దేశాలు… ఈ విషయంలో ఇప్పటికీ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాయన్నారు. తగ్గుతున్న జననాల రేటు కారణంగా, ఆ దేశాలు చివరికి శ్రామికశక్తి కొరతను ఎదుర్కొంటున్నాయన్నారు. పని చేసే యువత ఆ దేశాల్లో కరువయ్యారని అన్నారు. మన దేశంలో అలాంటి పరిస్తితి లేదని… దేశంలో అపార యువ సంపదన ఉందన్నారు. ఇది దేశానికి అత్యంత ప్రయోజనకరం మని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ వంటి సాంకేతికత రాకతో.. ప్రపంచం శరవేగంగా మారుతోందన్నారు. నైపుణ్యాభివృద్ది పెరగాలంటే.. పాఠశాలల నుంచే పాఠ్యప్రణాళికను అందుకు తగ్గట్టు మార్చాలని పేర్కొన్నారు.
Comments are closed.