వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలను రెండు రోజుల్లో పరిష్కరించి, రైతులు శాంతించే నిర్ణయాలు తీసుకోకుంటే, వారికి మద్దతుగా దేశవ్యాప్త సమ్మెకు దిగుతామని ఆల్ ఇండియా టాక్సీ యూనియన్ హెచ్చరించింది. దేశ రాజధాని సరిహద్దుల చుట్టూ ఉన్న రాష్ట్రాల నుంచి లక్షలాది మంది రైతులు హస్తిన ముట్టడికి రాగా, పోలీసులు వారిని గడచిన ఐదు రోజులుగా అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూనియన్ ప్రెసిడెంట్ బల్వంత్ సింగ్ భుల్లార్ స్పందించారు. కేంద్రం వెంటనే రైతుల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
“ప్రధాని, హోమ్ మంత్రులకు ఈ మేరకు ఇప్పటికే విజ్ఞప్తి చేశాం. ఈ చట్టాలను వెనక్కు తీసుకోవాలి. ఇవి అమలులోకి వస్తే, కార్పొరేట్లు మొత్తం వ్యవసాయాన్ని నాశనం చేస్తారు. రెండు రోజుల్లో చట్టాలను ఉపసంహరించుకోకుంటే, రోడ్లపై ఉన్న మా వాహనాలను తొలగిస్తాం. దేశవ్యాప్తంగా డ్రైవర్లు అందరూ 3వ తేదీ నుంచి సమ్మెకు దిగుతారు” అని ఆయన అన్నారు. రైతులు శాంతియుతంగా నిరసనలు తెలుపుతుంటే, ప్రభుత్వాలు మాత్రం వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నాయని ఆయన ఆరోపించారు.
Comments are closed.