*ఆదివాసీ కన్నీటి చుక్క‘జై భీమ్’*
—- *చల్లపల్లి స్వరూపరాణి*
*ఆమధ్య ఒక మిత్రుడు చెప్పాడు, కర్నూలు సబ్ జైలులో ఏళ్ల తరబడి కనీసం విచారణ లేకుండా వున్నవారిలో యెక్కువమంది ఆదివాసీలైన చెంచులు, యితర తెగలవారు, దళితులూ వున్నారని. ఇద్దరు చెంచులు బావ, బావ మరిది అడవి దారిలో వెళ్ళే లారీని ఆపి డ్రైవర్ దగ్గర వున్న చేతి వాచీని దొంగతనం చేశారు. ఆవాచీ ఖరీదు సుమారు నూట యాభై నుంచి రెండొందలు వుంటుంది. అంతే, వాళ్ళు ఆచిల్లర నేరానికి సంవత్సరాల నుంచి జైలులో మగ్గుతున్నారు. వాళ్ళు ఎక్కడున్నారో కుటుంబాలకు తెలీదు, వారికోసం కనీసం చూడ్డానికి కానీ, జామీను యిచ్చి విడిపించడానికి గానీ ఎవరూ రారు. యిది ఆ చెంచు బావా బావామరుదుల పరిస్తితి మాత్రమే కాదు, చాలామంది ఆదివాసీల కధ దాదాపు ఇదే! యిక్కడి జైళ్లన్నీ నిండి వుండేది ఆదివాసులు, దళితులతోనే అనేది వాటిని పరిశీలించేవారికి సులభంగానే అర్ధమవుతుంది. కొన్ని కులాలను పుట్టుకతోనే నేరస్తులుగా కులసమాజం ముద్ర వెయ్యడమే వారిపట్ల పోలీసుల తీరుకు కారణం. ఈ దేశంలో ఘరానా మోసాలకు పాల్పడే వారికి రాచమర్యాదలు చేస్తూ ఏనేరం చెయ్యని అమాయకులను, రోజువారీ అవసరాలకు చిల్లర దొంగతనాలకు పాల్పడేవారిమీద కేసులమీద కేసులతో కస్టడీలోకి తీసుకుని చిత్రహింసలు పెట్టడం, లాకప్ మరణాలు యిక్కడ సర్వసాధారణం. యిక స్త్రీలపట్ల పోలీసుల జులుంకి హద్దూ అదుపూ వుండదు. అటవీ ప్రాంతాలలో ఆదివాసీ స్త్రీలు సారా కాసి అమ్ముతున్నారని, అన్నలకు అన్నం పెడుతున్నారని వారిని పోలీసు స్టేషన్స్ కి పిలిపించి చిత్రహింసలు పెట్టి, అత్యాచారం చేసి భయభ్రాంతులకు గురిచేసిన సందర్భాలు అనేకం వున్నాయి. ఆమధ్య ఒక గర్భవతిని పోలీసులు పొట్టపై తన్నగా అక్కడికక్కడే ఆమె కడుపులో పిండం అక్కడికక్కడే జారిపడిపోయిన సంఘటన తెలంగాణాలో జరిగింది. అమాయకులైన ఆదివాసీలపై పోలీసుల ఆగడాలు వారికి కనీసం జీవించే హక్కుని నిరాకరించడమే!
‘జై భీమ్’ సినిమా ఈపరిస్తితిని కళ్ళకు కట్టింది. అనేకమంది రాజన్నలు, సాంబయ్యలు, బుచ్చిబాబులు, సినతల్లి, పైడితల్లుల మూగరోదనను తెరకెక్కించిన అరుదైన సినిమా యిది. ఒకసారి చెయ్యని నేరాన్ని అంగీకరిస్తే బతుకంతా నేరస్తులమనే నింద మొయ్యాల్సి వస్తుందని పోలీసుల టార్చర్ ని పళ్ళ బిగువున భరించి చివరకు ప్రాణమే పోగొట్టుకున్న రాజన్నల నెత్తుటి గాయాలు చెప్పిన కధ ‘జై భీమ్’. భర్తని కాపాడుకోవడం కోసం పోలీసు స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగి పడిగాపులు పడుతూ బతికే హక్కు కోసం సినతల్లి పెట్టిన పెనుకేకలు, బడిలో పెన్సిల్ ముక్క కనబడకపోతే తన సంచినే వెదుకుతారని ఆవేదన చెందే ఆదివాసీ కుర్రాడి మనసుకి తగిలిన గాయాలు, యెక్కడో లూటీ జరిగితే అర్ధరాత్రి, అపరాత్రీ, ఆడామగా అనిలేకుండా తన్నుకుంటూ తీసుకెల్తుంటే ఎవరికీ మొర పెట్టుకొవాలో తెలీక వారు పెట్టే ఆక్రందనలు సినిమాలో చిత్రించిన తీరు వాస్తవికంగా అనిపిస్తుంది. నిజానికి అమాయకులైన ఆదివాసులు పోలీసుల హింస భరించలేక చెయ్యని నేరాలను తామే చేసినట్టు ఒప్పుకుని యితరుల బదులు తామే శిక్షలు అనుభవించే పరిస్తితి వుంటుంది. కానీ, ఈసినిమాలో అణగారిన ప్రజల విషయంలో అధికార వ్యవస్థల లెక్కలేనితనాన్ని ఒక ఆదివాసీ స్త్రీ చేత బోనులో నిలబెట్టిస్తాడు హీరో. తన భర్త ప్రాణాలకు వెలకట్టబోయిన అధికారులతో ‘రేపు నాపిల్లలు తమకి పెట్టే తిండి ఎక్కడిది అని అడిగితే మీ అయ్యని కొట్టి చంపినోళ్ళు యిచ్చిన డబ్బుతో వచ్చింది అని చెప్పాలా సార్?’ అని అడిగే సన్నివేశం ఈసినిమా స్థాయిని పెంచిందని చెప్పాలి. ఆదివాసీ స్త్రీ అనగానే నల్లటి శరీర సౌస్టవంతో గోడలమీద వేలాడే బొమ్మ అనుకునేవారికి జవాబుగా ఆదివాసీ స్త్రీ పోరాట పటిమను, ఆత్మగౌరవాన్ని తెరమీద వున్నతంగా పరిచిన సినిమా యిది.
సినతల్లిగా ‘లిజో మోలేజోస్’ జీవించింది, చింపిరి జుట్టు, మురికి గుడ్డలతో గుండెలు అవిసిపోయేలా ఏడుస్తూ గుర్తుండిపోయే ఆమెకు ఇకపై గ్లామర్ పాత్రలు వస్తాయో లేదో చెప్పలేం. ఎందుకంటే గతంలో శనీచరి (రుడాలి) పాత్ర చేసిన డింపుల్ కపాడియాకి తర్వాత గ్లామర్ గా కనిపించే ఒక్క పాత్రా రాలేదు. ఫూలన్ పాత్ర(బండిట్ క్వీన్) చేసిన సీమా బిస్వాస్ పరిస్తితీ అదే!
మంచి కంటెంట్ వుండే సినిమాలతో తనదైన ఇమేజ్ వున్న సూర్య పేదప్రజలకు న్యాయ సహాయాన్ని అందించే ఒక సజీవ పాత్ర ‘చంద్రు’కి జీవం పోశాడు.ఆయన ఆఫీస్ లో గోడలపై కారల్ మార్క్స్, అంబేడ్కర్, పెరియార్ ఫోటోలు పెట్టడంతో పాటు ఆయన బుద్ధుడి విగ్రహానికి పూలు చల్లుతున్నట్టు చిత్రించడం బాగుంది. అలాగే హిందీ మాట్లాడే బంగారం షాపు మనిషిని తమిళ/తెలుగులో మాట్లాడమని ఐ.జి ప్రకాష్ రాజ్ చెంపదెబ్బ కొట్టడం ఉత్తరాది హిందీ, హిందూ ఆధిపత్యాన్ని కొట్టడమే! ఏజాతీ నేరస్త జాతిగా పుట్టదు, నేర స్వభావం వుంటే అందరిలో ఒకేవిధంగా వుంటుంది అని సందర్భానుసారం చెబుతాడు హీరో. ఖైదీలను కోర్టుకి హాజరు పరిచేటప్పుడు వారి చేతులకు బేడీలు వెయ్యకూడదు అనే విషయం నుంచి అనేక ముఖ్యమైన సున్నితమైన అంశాలు ఈసినిమాలో చర్చించడం ‘జై భీమ్’ ప్రత్యేకత. చంద్రు పాత్రని చూస్తే బాలగోపాల్, చంద్రశేఖర్, స్టాన్ స్వామి వంటివారు గుర్తుకొస్తారు. టీచర్ గా ఆదివాసుల మధ్య పనిచేస్తూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకునే ‘మిత్ర’గా రజిష ఆ పాత్రకు న్యాయం చేసింది. ఆమెని చూస్తే మహాశ్వేతా దేవి, గెయిల్ ఆమ్వేద్ట్, సుధా భరద్వాజ వంటివారు గుర్తుకొస్తారు. అలాంటివారిని అధికార వ్యవస్తలు టార్గెట్ చేసి వేధిస్తాయి, వంటరి వాళ్ళని చేస్తాయి, ఆడవారైతే క్యారెక్టర్ మీద బురద చల్లుతాయి. అయినా చంద్రులు సమాజం పట్ల తమ ప్రేమ వెన్నెల పంచుతుంటే, మిత్రలు తమ స్నేహ సహకారాలు అందిస్తూనే వుంటారు. నోరులేని జనాలకోసం మాటలై, అక్షరాలై ప్రవహిస్తారు, చివరికి వారికి ప్రశ్నించడం నేర్పిస్తారు.
వాస్తవానికి వస్తే అతి తక్కువ కాలంలో వేలాది పెండింగ్ కేసులు పరిష్కరించిన అడ్వకేట్ గా పేరున్న చంద్రు అనే ఆయన అమాయకులైన ఆదివాసులపై అక్రమంగా పెట్టిన కేసులను మానవహక్కుల కేసులుగా పరిగణించారు. ఆయా కేసులను అర్ధం చేసుకుని వాదించడానికి బాబాసాహెబ్ అంబేడ్కర్ రచనలూ, ప్రసంగాలూ ఎంతగానో ఉపయోగపడ్డాయని పేర్కొన్న చంద్రు పాత్ర ప్రధానంగా ‘జై భీమ్’ అనే టైటిల్ తో సినిమా తియ్యడం డైరెక్టర్ ‘జ్ఞానవేలు’ తెగువకి నిదర్సనం. ఈసినిమాకి నిర్మాతలుగా జ్యోతిక, సూర్యలు ఉండడమేకాక తమిళనాడులో ముఖ్యమైన ఆదివాసీ తెగ అయిన ‘ఇరుల’ తెగ సంక్షేమం కోసం ముఖ్యమంత్రికి డబ్బు అందించి ఆదర్శం అనేది రీల్ కే పరిమితం కాదని నిరూపించిన జ్యోతిక, సూర్యలకు అభినందనలు. సినిమా కోసం పనిచేసిన అందరికీ ‘జై భీమ్’!
మరాఠీ కవి ‘విలాస్ పిడిలరే’ అన్నట్టు
జై భీమ్ అంటే కాంతి
జై భీమ్ అంటే ప్రేమ
జై భీమ్ అంటే
చీకటి నుంచి వెలుగువైపు ప్రయాణం
*జై భీమ్ అంటే*
*కోట్లాది ప్రజల కన్నీటి చుక్క*
Comments are closed.