తేదీ: 02-08-2023,
అమరావతి.
*శభాష్ ‘కిషాల్’*
*పదేళ్ల బాలుడు..సామాజిక సేవలో ఘనుడు*
*స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ ప్రశంసలు*
*”ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్-2024″కు ఏపీ ప్రభుత్వ ప్రతిపాదన*
అమరావతి, ఆగస్ట్, 02; పాఠశాలకు వెళ్లి వచ్చి..అలసిపోయే దాకా ఆడుకునే వయసులో అలుపెరుగని పనులతో అబ్బురపరుస్తున్నాడు ఎన్టీఆర్ జిల్లా సాయినగర్ కు చెందిన ‘కిషాల్’. ఆడపిల్లనే కారణంతో పురిట్లోనే చిన్నారులను చిదిమేస్తున్న సమాజంలోని ఓ వర్గాన్ని..అలా చేయడం తప్పంటూ అవగాహన కలిగిస్తున్నాడు. ఐదేళ్ల వయసు నుంచే సమయం చిక్కినప్పుడల్లా అంగన్ వాడీ కేంద్రాలు, ప్రార్థనా మందిరాలు, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ చైతన్యం నింపుతున్నాడు. తల్లిదండ్రులతో పాటు పార్కులో ఆడుకోవడానికి వెళ్లిన సమయంలో తన కళ్ల ముందు జరిగిన ఓ ఘటనతో కిషాల్ లో ఆలోచన మొదలైంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తన ఆలోచన పోరాటం దిశగా ముందుకు కదిలింది. ఆడపిల్ల అని తెలిసిన ఇరువురు దంపతుల ఘర్షణను తన తల్లిదండ్రుల ద్వారా అడిగి తెలుసుకున్నాడు. పదే పదే అవే ఆలోచనలు,పరిస్థితులు మనసులో మెదిలి తన కుటుంబం ద్వారా లోతుగా ఆలోచించి..ఏదైనా చేయాలనే కర్తవ్యాన్ని తనకు తానుగా లక్ష్యం పెట్టుకుని ముందుకు వెళుతున్నాడు. శని, ఆదివారాలొచ్చినా ఆటలకు బదులు ఇలాంటి కార్యక్రమాల్లోనే నిమగ్నమై ఇప్పటికే పొరుగు జిల్లాల్లోనూ తన అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. తనకు ప్రోత్సాహంగా ఇచ్చిన నగదును కూడా బాలింతలు, గర్భిణీల పౌష్టికాహారానికే వెచ్చిస్తూ భళా బాలకా! అనిపించుకుంటున్నాడు.
పెద్దయ్యాక ఐపీఎస్ అధికారినై వ్యవస్థను మారుస్తానంటున్న పదేళ్ల బాలుడి ఆలోచనలను తెలుసుకున్న ‘కిషాల్’ కృషిని గుర్తించి స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ సచివాలయంలోని తన ఛాంబర్ కు పిలిపించారు. తన ముద్దు ముద్దు మాటలు పెద్ద పెద్ద పనులను అడిగి తెలుసుకుని మనస్ఫూర్తిగా ప్రశంసించారు. ఇలాగే సమాజాన్ని చైతన్యవంతుల్ని చేస్తూ మరింత ముందుకెళ్లాలని వెన్నుతట్టి ప్రోత్సహించారు. అందుకు సంబంధించిన ప్రశంసా పత్రాన్ని మంత్రి ఉషశ్రీ చరణ్ తన చేతుల మీదుగా కిశాల్ కంచర్లకు అందజేశారు. అంతేకాదు, సమాజసేవ కేటగిరీలో “ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్-2024″కు ప్రతిపాదిస్తూ మరో పత్రాన్ని బాలుడికి అందించారు. ఈ కార్యక్రమంలో కిషాల్ తల్లి దీప్తి పాల్గొన్నారు.
———
Comments are closed.