*ప్రతి మనుసును వెంటాడే జ్ఞాపకం..మన మేకపాటి గౌతమ్*
: నవంబర్ 2న ద్వితియ జయంతి వేడుకలు
: ఘన నివాళులు అర్పించనున్న నియోజకవర్గ ప్రజలు
పద్ధతైన రాజకీయ కుటుంబ నేపథ్యం,విజయవంతమైన వ్యాపారవేత్త. మంత్రి కావడం ప్రజల్లో మరింత మంచి పేరు. ఆయన మరణించి 20 నెలలు కాలం గడిచింది. కానీ అందరి మదిలో శాశ్వతంగా నిలిచిపోయారు.
తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజకీయ వారసునిగా అడుగుపెట్టిన గౌతమ్ రెడ్డి 2014 ఆత్మకూరు నియోజకవర్గం తరపున తొలిసారిగా శాసనసభ్యునిగా బరిలో దిగారు. ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించిన అనంతరం పూర్తిగా ప్రజాక్షేత్రంలోనే నడిచారు.
ఆత్మకూరు నియోజకవర్గం గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలన్న సంకల్పంతో… నియోజకవర్గంలో 50 రోజుల పాటు పాదయాత్ర చేపట్టి ప్రతి ప్రాంతంలో సమస్యలు తెలుసుకున్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో 30,191 ఓట్ల భారీ మెజారిటితో విజయం సాధించారు.
ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యునిగా ఉన్న సమయంలో అభివృద్దికి ఒక్క పైసా కూడా ప్రభుత్వ సాయం అందని సమయంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి స్వంత నిధులతోనే అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ చరిత్రలో తొలి క్యాంపు కార్యాలయం ఏర్పాటు దగ్గర నుండి నూతన రాజకీయాన్ని ఆత్మకూరుకు నేర్పింది మేకపాటి గౌతమ్ రెడ్డే.
ఆత్మకూరులోని మెట్ట ప్రాంత రైతులు సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్న సమయంలో స్వంత నిధులతో జెసీబీని ఏర్పాటు సుమారు 75 రోజుల పాటు రైతుల పొలాలకు సాగునీరు అందించి వారి మన్ననలు చూరగొన్నారు. మరికొందరు రైతుల పొలాల్లో ఆయన డబ్బులతో బోర్లు కూడా వేయించిన ఘనత ఎమ్మెల్యే మేకపాటి సొంతం.
తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎంపీ నిధుల ద్వారా నియోజకవర్గంలో విద్య సంస్థలు సహా మౌలికసదుపాయాల అభివృద్ది పనులు చేశారు. 2017 జూన్ లో గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్లీనరీ సమావేశం ఇప్పటికి వైఎస్సార్సీపీ నాయకుల మనస్సులో అలాగే నిలిచి ఉందంటే అతిశయోక్తి కాదు.
పల్లెబాట కార్యక్రమం ద్వారా శాసనసభ్యుని హోదాలో ప్రతి గ్రామాన్ని సందర్శించిన ఆయన ప్రజల సమస్యలను అధికారులకు తెలియచేస్తూ పరిష్కార మార్గాలను చూపాలని విన్నవించిన సందర్భాలు అనేకం. మెట్ట ప్రాంత రైతాంగానికి డెల్టాతో సమానంగా నీరు అందించాలని ఎన్నో సమావేశాల్లోనూ, అధికారుల వద్ద అనేక సార్లు మాట్లాడి సాధించిన వ్యక్తి మేకపాటి అని నియోజకవర్గ రైతాంగం ఇప్పటికి గుర్తు చేసుకుంటుంది.
2019లో ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల్లో నిలిచి రెండోసారి ఆత్మకూరు ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలుపొంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అత్యధిక శాఖలు నిర్వహించిన మంత్రిగా మేకపాటి గౌతమ్ రెడ్డి కీర్తి పొందారు.
మంత్రిగా ఎంతో తీరిక లేకుండా ఉన్నప్పటికి నియోజకవర్గంలో అభివృద్ది, సంక్షేమ పథకాలకు ఎటువంటి లోటులేకుండా అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూనే వచ్చారు. తన క్యాంపు కార్యాలయానికి ప్రజలు నేరుగా సమస్యలు చెప్పుకునే విధంగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం విశేషం.
కరోనా సమయంలో మంత్రి మేకపాటి అందించిన సేవలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలెవ్వరూ మరచిపోలేరు. ఆత్మకూరు నియోజకవర్గంలో కరోనాకు సంబంధించిన శానిటైజర్లు, మాస్కులు తన స్వంత నిధులతో లక్షల్లో అందచేసిన ఆయన ఆక్సిజన్ సిలెండర్లు కూడా సమకూర్చి కరోనా పెను ప్రమాదం నుండి ప్రజలను కాపాడుకున్న బాధ్యత ఉన్న మంత్రి.
మెట్ట నియోజకవర్గాన్ని పారిశ్రామికంగానూ అభివృద్ది చేయవచ్చునని తలించిన ఆయన ఎంఎస్ఎంవి పార్కు ఏర్పాటు చేసి కంపెనీల ఏర్పాటుకు కూడా కృషి చేశారు. అంత వరకు చేసిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా నియోజకవర్గాన్ని పారిశ్రామిక అభివృద్ది వైపు దృష్టి సారించిన దాఖలాలు కూడా లేవు.
తన మంత్రిత్వ శాఖల ద్వారా ఆత్మకూరు నియోజకవర్గానికి ఎంత వరకు మేలు చేయవచ్చునో అన్నింటిని చేసేందుకు గౌతమ్ రెడ్డి కృషి చేశారు. ఇలా ఆయన మరణించే వరకు రాష్ట్రంలో ఆయన శాఖల ద్వారా చేసిన అభివృద్ది, సంక్షేమ పనులు అసాధరణం.
నవంబర్ 2న మేకపాటి గౌతమ్ రెడ్డి 53వ జయంతిని పురస్కరించుకుని కుటుంబసభ్యులు భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాల్లో నియోజకవర్గం నుండే కాక రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలు పాల్గొని ఆయనకు నివాళులు అర్పించేందుకు సిద్దమవుతున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఆయన పేరిట సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి నాయకులు, అభిమానులు సమాయత్తమవుతున్నారు.
Comments are closed.