03-08-2023
అమరావతి-
*- వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం చేసిన అప్పు రూ.1,77,991 కోట్లే..*
*- ఏపీ ప్రభుత్వం మొత్తం అప్పు రూ.4,42,442 కోట్లు*
*- కార్పొరేషన్ రుణాలతో కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటు కలిపితే టీడీపీది 33%, వైసీపీది 25 శాతమే*
*- స్థూల ఉత్పత్తి, రుణాల నిష్పత్తిని తీస్తే 7 శాతం పెంచిన టీడీపీ ఎక్కువ? 3 శాతం ఉన్న వైసీపీ ఎక్కువా?*
*- పబ్లిక్ అకౌంట్ లో టీడీపీ తీసుకుంది రూ.36,241 కోట్లు, వైసీపీ కేవలం రూ.3,475 కోట్లే*
*- అత్యుత్సాహం, అవగాహనారాహిత్యంతోనే ఎల్లో మీడియా, ప్రతిపక్షాల విమర్శలు*
*- రాష్ట్రానికి మేలు జరగకూడదన్నదే ప్రతిపక్షాల లక్ష్యం*
*- టీడీపీ హయాంలో రాబడి 6%, జగన్ హయాంలో అది 16.7%*
*- అప్పుల్లో ముంచిన బాబు.. సంపద సృష్టిస్తానంటే ఎవరు నమ్ముతారు?*
*- ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితికి ఏ ఢోకా లేదు..*
*- స్యయంప్రతిపత్తి సంస్థల నివేదికల కన్నా..స్వయం ప్రకటిత ఆర్థిక నిపుణుల ఆరోపణలే మిన్నా?*
*- ‘ప్రజా సంక్షేమమే’ గిట్టనోళ్లు రెట్టింపు సంక్షేమ మేనిఫెస్టోని ప్రకటిస్తే ప్రజలు నమ్ముతారా?*
*- సింహం, కొదమసింహం మీరు అనుకోవడం కాదు చంద్రబాబు గారూ..ప్రజలు చెప్పాలి*
ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ..
*గతం కంటే ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉందిః*
2019లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి నాలుగేళ్ల కాలంలో చేసిన అప్పు రూ.1,77,991 కోట్లు మాత్రమేనని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. కొన్ని మీడియా వర్గాలు, ప్రతిపక్ష నాయకులు అత్యుత్సాహంతో, అవగాహన రాహిత్యంతో అసత్య ప్రచారం చేస్తున్నట్లు రాష్ట్ర అప్పు రూ.10 లక్షల కోట్లు కాదని ఆయన స్పష్టం చేశారు. తమకు తాము స్వయం ప్రకటిత ఆర్థిక నిపుణులుగా భావించే కొందరి దుష్ప్రచారం రాష్ట్ర ప్రజలు నమ్మరని మంత్రి బుగ్గన పేర్కొన్నారు. 2014-15 నుంచి 2018-19 ఐదేళ్ల కాలంలో గత ప్రభుత్వం ఏడాదికేడాది అప్పుల్లో వార్షిక వృద్ధి రేటు 14.7% పెరిగిందన్నారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిపాలనా కాలంలో(2019-23) 12.4% మాత్రమే ఉందని వెల్లడించారు. రెవెన్యూ లోటు గత టీడీపీ ప్రభుత్వంలో 2.4% కాగా అప్పుడు కేంద్ర ప్రభుత్వం రెవెన్యూ లోటు 2.5% అంటే దాదాపుగా కేంద్ర, రాష్ట్రాల లోటు సమానంగా ఉందన్నారు. 2019-23 కాలంలో భారత దేశ రెవెన్యూ లోటు 4.8% కాగా, ఏపీ రెవెన్యూ లోటు కేవలం 2.7%గా నమోదైందని..అంటే కేంద్రంతో చూస్తే, ఇంచుమించుగా రాష్ట్రంలో సగమే రెవెన్యూ లోటు నమోదైనట్లు మంత్రి బుగ్గన వివరించారు. ద్రవ్య లోటు విషయానికొస్తే..గత ప్రభుత్వంలో భారతదేశ సగటు 3.1 శాతం కాగా, నాటి టీడీపీ ప్రభుత్వంలో మాత్రం 4.5శాతం ఉందన్నారు. అదే గత నాలుగేళ్ల కాలంలో ద్రవ్యలోటు భారత ప్రభుత్వానిది 6.7 శాతంగా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 4 శాతమే ద్రవ్యలోటుగా నమోదైందన్నారు. ఇలా ఏ విషయంలోనైనా గత ప్రభుత్వ స్థితితో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నా..అసత్య ప్రచారంతో ప్రజలని నమ్మించడమే ప్రతిపక్షాలు పనిగా పెట్టుకున్నారని ఆర్థిక మంత్రి విమర్శించారు.
*బాబు హయాంలోనే అప్పుల్లోనే వృద్ధిః*
చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన కాలం 1994-95 నుంచి 1998-99 పాలనా కాలాన్ని పరిశీలిస్తే, అప్పుల్లో వార్షిక వృద్ధి రేటు 16.8 శాతంగా నమోదైందన్నారు. రెండో పర్యాయంలో సీఎంగా ఉన్నప్పుడు కూడా 17 శాతానికి పెంచిన చరిత్ర చంద్రబాబుదన్నారు. ఆ తర్వాత, 2004 నుంచి 2009 మధ్య వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో అప్పు వార్షిక వృద్ధి రేటు 17% నుంచి 9.9%కి తగ్గిందన్నారు. 2014-2019 చంద్రబాబు పాలన కాలంలో అప్పు వార్షిక వృద్ధి రేటు మళ్లీ 14.7%కి చేరిందన్నారు. ప్రస్తుత 2019-23 సీఎం వైఎస్ జగన్ పాలనలో అప్పు వార్షిక వృద్ధి రేటును మళ్లీ కేవలం 12.4 శాతంగా తీసుకురాగలిగామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గణాంకాలతో సహా వివరించారు.
కార్పొరేషన్ రుణాల విషయానికొస్తే, ఈ అంశంలో గ్యారంటీ, నాన్-గ్యారంటీ అనే రెండు పద్ధతులు ఉంటాయని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. విద్యుత్ డిస్కంలకు గ్యారంటీలుండవు,కానీ మిగతా అన్నింటికీ గ్యారంటీ రుణాలుంటాయని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన నాటికి కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రూ.14,028 కోట్లు కాగా, చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి అది రూ.59,257 కోట్లకు తీసుకెళ్లారని మంత్రి బుగ్గన తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వ కాలంలో గత జూలై చివరి నాటికి రూ.1,44,875 కోట్లుగా కార్పొరేషన్ రుణాలున్నాయన్నారు. కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటుతో కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలను కలిపి చూస్తే టీడీపీ హయాంలో 33.4% అప్పు పెరిగిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వ కాలంలో పెరిగింది 25% మాత్రమేనన్నారు.
గ్యారంటీ ఇవ్వని రుణాలను పరిశీలిస్తే..విభజన నాటికి రూ.18,374 కోట్లు కాగా, గత చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.59,692 కోట్లన్నారు. అది ప్రస్తుత ప్రభుత్వం మార్చి-2023 నాటికి రూ.56,017 కోట్లున్నట్లు తెలిపారు. విద్యుత్ రంగానికి సంబంధించి డిస్కంలకు తిరిగి చెల్లించిన అప్పులను కూడా ఆర్థిక మంత్రి గణాంకాలతో సహా వివరించారు. రూ.2893 కోట్లు విభజన నాటికి, రూ.21,541 కోట్లు గత ప్రభుత్వంలో, రూ.8,455 కోట్లు మార్చి-2023 నాటికి ఉన్నాయని, దీని ప్రకారం విద్యుత్ రంగానికి చెందిన అప్పులను తీర్చిన విషయాలను గణాంకాలతోసహా మంత్రి బుగ్గన ప్రకటించారు. గ్యారంటీ ఇచ్చినవి, గ్యారంటీ ఇవ్వని అప్పులను కలిపి చూస్తే, విభజన నాటికి రూ.35,296 వేల కోట్లని పేర్కొన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రూ.1,40,490 కోట్లు, ప్రస్తుత ప్రభుత్వ పాలనలో రూ.2,09,247 కోట్లుగా గణాంకాలే చెబుతున్నాయన్నారు. ఈ లెక్కల ప్రకారం టీడీపీ ప్రభుత్వంలో పెరిగిన అప్పుల వృద్ధి రేటు 21.9 శాతం కాగా, ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కాలంలో పెరిగిన అప్పు వృద్ధి రేటు 12.7 శాతమే అని ఆయన పునరుద్ఘాటించారు.
*అవగాహనా రాహిత్యంతోనే విమర్శలుః*
ఈ మధ్యనే క్రియాశీలక రాజకీయాలకు వచ్చి, వచ్చీ రాగానే రాష్ట్ర అప్పులు, ఆర్థిక పరిస్థితులపై మాట్లాడుతున్న ఔత్సాహిక రాజకీయనాయకులకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చురకలంటిస్తూ పలు సూచనలిచ్చారు. ఆర్బీఐ లెక్కల ప్రకారం, నాబార్డు ద్వారా తీసుకున్న రుణం రూ.7,992 కోట్లు కాదని అదంతా ముమ్మాటికి అబద్ధపు ప్రచారమేనన్నారు. వాస్తవానికి తీసుకున్న రుణం కేవలం రూ.3281 కోట్లు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునేలా గవర్నర్ దగ్గర ఉంచే కంటెంజన్సీ నిధులపైనా రాద్ధాంతం చేయడం ‘ఫ్రెషర్స్’కు తగదన్నారు. ఎప్పటికీ చెక్కుచెదరకుండా అలాగే వినియోగించుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసే కంటెంజన్సీ నిధులను కూడా లెక్కలలోకి తీసుకోవడం వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. పబ్లిక్ అకౌంట్ అనేది ఒక పద్దు మాత్రమేనన్నారు. పబ్లిక్ అకౌంట్ లో ఉద్యోగులకు సంబంధించిన మొత్తాలు, ఏదైనా లావాదేవీల సమయంలో టెంపరరీ పార్కింగ్ వంటివి ఉంటాయన్నారు.
ఈమధ్య మీడియా ఛానెల్స్‌లో కొంతమంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర అప్పుల పై వివిధ సందర్భాల్లో నోటికొచ్చిన ప్రకటనలు చేస్తున్నారు. అలాంటి వారిని కొమ్ముకాస్తున్న ప్రత్యేక మీడియా కూడా రకరకాల హెడ్డింగులు పెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎవరిష్టం వచ్చినట్లు వారు విశ్లేషిస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికల్లోనైతే రాష్ట్ర అప్పులంటూ ప్రతీరోజూ ఒక వార్త ఉంటుంది. చివరికి వీళ్లు ఏ స్థాయికి వెళ్లారంటే కేంద్రం కేరళకు రూ.17వేల కోట్లు అప్పును తగ్గించింది కానీ ఆంధ్రరాష్ట్రానికి మాత్రం తగ్గించలేదని మరో వార్తనూ రాసుకున్నారు. అంటే, కేంద్రం ఆంధ్ర రాష్ట్రానికి సహకరిస్తుందనే బాధనా..? అక్కసా? ఇలాంటి వాటిని ఎలా అర్థం చేసుకోవాలి. మనరాష్ట్ర మంచి గురించే కాకుండా కేరళ రాష్ట్ర మంచి గురించి కూడా మన మీడియా ఆలోచిస్తున్నందుకు సంతోషం అంటూ వ్యంగ్యంగా అన్నారు. ఇంతేకాకుండా.. ‘అప్పు చేయని నెల ఉందా..?’ అంటూ కూడా మరో వార్త రాసుకుంటారు. ఇవన్నీ రాసుకున్న తర్వాత ఆ కథనాలన్నింటినీ పట్టుకుని అత్యుత్సాహంతో పార్లమెంట్‌లో రాష్ట్ర అప్పుల పరిస్థితిపై టీడీపీ వారు ప్రశ్నలు వేయడం జరిగింది.
*ఏపీ ప్రభుత్వం మొత్తం అప్పు రూ.4,42,442 కోట్లుః*
రాజకీయ నేతల విశ్లేషణలు, వాటిని ఆధారంగా పుంఖాను పుంఖానులుగా రాసుకున్న కథనాలతో ఒక ఎంపీ పార్లమెంట్‌లో ప్రశ్నకు సాహసించారు. దీనిపై కేంద్ర ఆర్థికశాఖామాత్యులు ఈ ప్రశ్నకు క్లియర్‌గా సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. ఏమని అంటే, 2023 నాటికి రూ.4,42,442 కోట్లు అప్పు అని చెప్పి సమాధానం వచ్చింది. ఈ సంఖ్య వింటూనే వారంతా ఎంత బాధపడిపోతున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం. వారి కళ్లల్లో ఆవేదన, బాధ వర్ణానాతీతంగా ఉందన్నారు.చివరికి మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ‘అప్పులేని రోజుందా..?’ అని ప్రశ్నిస్తున్నారు. వీరి విశ్లేషణలు, ఆవేదన ధాటికి గతంలో ఆర్థికమంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడు కూడా ఏమీ మాట్లాడకుండా వెనక్కి వెళ్లిపోయారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై పొలోమంటూ ఇంతమంది మాట్లాడుతుంటే, మాజీ ఆర్థిక మంత్రి యనమల మాత్రం ఇక తాను స్పందించాల్సిన అవసరమేముందిలే అంటూ ఆయన వెనకబడిపోయారన్నారు.
*పబ్లిక్ అకౌంట్ నిధులను అధికమొత్తంలో తీసుకుంది గత ప్రభుత్వమే*
2015-16 నుంచి 18-19 కాలంలో ఉద్యోగుల పీఎఫ్ సహా వివిధ మొత్తాలను రూ.36,241 కోట్లు గత ప్రభుత్వం తీసుకుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం పబ్లిక్ అకౌంట్ ద్వారా రూ.3,475 కోట్లు మాత్రమే వినియోగించుకుందన్నారు. కానీ , ఎక్కువ అప్పులు, వడ్డీలు చేస్తుందని వైఎస్ ఆర్సీపీ ప్రభుత్వంపై బురదచల్లుతున్నారన్నారు.
ఇక అదనపు రుణాల విషయానికొస్తే, గత టీడీపీ ప్రభుత్వం పరిమితి దాటి అప్పులు చేసిందని గణాంకాలతో సహా ఆర్థిక మంత్రి వివరించారు. 2016-17 ఏడాదికి గానూ రూ.4,800 కోట్లు, 2017-18లో రూ.1,040 కోట్లు, 2018-19 సమయంలో ఏకంగా రూ.10,574 కోట్లు, 2019-20 ఏడాదికి గానూ ప్రస్తుత ప్రభుత్వం రూ.9, 711 కోట్లు, అందులో 2020-21లో రూ.3,666 కోట్లు తిరిగి చెల్లించాం. 2020-21లో 11,521 కోట్లు తిరిగి కట్టినట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. మొత్తంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.17,531 కోట్లు పరిమితి దాటి చేసినట్లు చెబుతున్న అప్పులో రూ.16,418 కోట్లు గత ప్రభుత్వానిదేనని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ అడ్డగోలుగా చేసిన అప్పుల ప్రభావం ఈ ప్రభుత్వంపై పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రతిపక్షాలు పదే పదే అదే పనిగా వినతి పత్రాలు ఇవ్వడం వల్ల ఈ నిజాలన్నీ బయటకి వచ్చాయన్నారు.
*టీడీపీ డొల్లతనం కనిపించిందిః*
టీడీపీ ఎంపీ కనకమేడల పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నావళిని చూస్తే.. రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత అక్కసు వెళ్లగక్కుతున్నారో అర్థమవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానిక ఈ నెల రూ.2 వేల కోట్లు ఎక్కువ అప్పులు ఇచ్చారా? ఏపీకి ప్రత్యేక సాయం కింద నిధులు ఇవ్వలేదా? రూ.1,10,599 కోట్ల అప్పును శాసన సభ ఆథరైజేషన్ లేకుండా ఇచ్చారా? ఇలా అడిగిన తీరుపై కేంద్ర ఆర్థిక సహాయ్ మంత్రి పంకజ్ చౌదరి పరిమితికి మించి తాము ఇవ్వలేదని, శాసన సభ ఆమోదం లేకుండా 2014-15లో టీడీపీ ప్రభుత్వం తీసుకున్న రూ. లక్షా 62 వేల కోట్లకు ఆథరైజేషన్ లేదని కేంద్ర మంత్రి స్పష్టతనిచ్చిన సమాధానాలను మంత్రి బుగ్గన వివరించారు.
రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ద్వారా ఎక్కువ రుణాలు తీసుకున్నామంటూ కొందరు చేస్తున్న విమర్శలపైన కూడా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన స్పష్టతనిచ్చారు. రూ.21,737 కోట్లు గత టీడీపీ ప్రభుత్వం తన హయాంలో సివిల్ సప్లైస్ ద్వారా రుణం తీసుకుందని మంత్రి వెల్లడించారు. ఈ ప్రభుత్వం కేవలం రూ.8,363 కోట్లే తీసుకుందన్నారు. మొత్తం పౌరసరఫరాల సంస్థ ద్వారా రెండు ప్రభుత్వాలు కలిపి తీసుకున్న రుణం రూ.30,100 కోట్లన్నారు. అందులోనూ గత టీడీపీ ప్రభుత్వం దిగిపోయే సమయంలో 2018-19 ఏడాదికిగానూ రూ.5వేల కోట్లు రుణం తీసుకుని ‘పసుపు-కుంకుమ’ పథకానికి వినియోగించినది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
రాష్ట్ర వ్యయంపై చేసిన అప్పును నిష్పత్తిగా తీసుకుంటే, చంద్రబాబు గారూ మీరు మొదట ముఖ్యమంత్రిగా పరిపాలించబోయే నాటిక ఉన్న 16 శాతం, దిగిపోయే నాటికి 21 శాతం చేయగా, తర్వాత పాలించిన వైఎస్ గారు దాన్ని 2009 నాటికి 14 శాతానికి తగ్గించడం వాస్తవం కాదా? అని సూటిగా ప్రశ్నించారు. గత నాలుగేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం పరిమితులకు లోబడి 2022-23ఏడాదికి గానూ రూ.7,718 కోట్లు ఇంకా వాడలేదన్నారు. 2021-22 ఏడాదిలో రూ.36,303 కోట్లు నెగిటివ్ లో ఉన్నామన్నారు. మొత్తంగా రూ.28,466 కోట్లు మన ప్రభుత్వం ఇంకా వాడలేదన్నారు. గత ప్రభుత్వంలో మాత్రం పరిమితి దాటి రూ.47,674 కోట్లు ఎక్కువే వినియోగించుకుందన్నారు. ఇవన్నీ ఎఫ్ఆర్ బీఎం లెక్కల ప్రకారం, అడిషనల్ బారోయింగ్స్, విద్యుత్ రంగంలో సంస్కరణలు, కోవిడ్ తర్వాత క్యాపిటల్ ఎక్స్ పెండిచర్ వంటివి అన్నింటినీ కలిపి చూసినా వాళ్లే ఎక్కువ అప్పులు చేశారన్నారు.
బహిరంగ మార్కెట్ లో ఏ రేట్ లో అప్పు చేశామన్న వివరాలు పరిశీలిస్తే, 2014-15 ఏడాదిలో 8.5, 2015-16లో 8.3శాతం , 2016-2017లో 7.5శాతం, 2017-18లో 7.5శాతం, 2018-19లో 8.5, 2019-20లో 7.45శాతం, 2020-21లో 6.57 శాతం అంటే గత ప్రభుత్వం కన్నా సగటున 1% తక్కవకే రుణం తెచ్చామని మంత్రి బుగ్గన స్పష్టతనిచ్చారు.
*సంపద సృష్టిస్తానంటే నమ్మేది ఎవరు?*
ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తి,మొత్తం అప్పుల నిష్పత్తి చూస్తే.. 23.4 శాతం నుంచి 30.3 శాతం (మొత్తంగా 6%)వరకూ పెంచిన చరిత్ర చంద్రబాబుదే అన్నారు. గత నాలుగేళ్లలో, రెండేళ్ళు కోవిడ్ ఉన్నా 30 నుంచి 33.6 శాతానికే (3%) పెంచాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. గత ప్రభుత్వం పరిమితులు పాటించకుండా, గ్యారంటీ లేకుండా, రుణాలను చెల్లించకుండా, అధిక వడ్డీలకు అప్పులు చేసినా కనీసం గొంతెత్తని కొన్ని మీడియా విభాగాలు..సవ్యంగా, పారదర్శకంగా, అప్పటి కన్నా తక్కువ వడ్డీకి, కోవిడ్ ప్రభావమున్నా తక్కువే అప్పులు చేస్తున్నా చర్చోపచర్చలు, వాదోపవాదాలు తండోపతండాలుగా కలిసి మాట్లాడుతుండడం చూసి ఆశ్చర్యంగా ఉందన్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న సంక్షేమాన్ని నిన్నటి దాకా విమర్శించి, ఇప్పుడు వాటిలో వైసీపీ సంక్షేమ పథకాలను కొన్నింటిని తన మేనిఫెస్టోగా చెబుతూ మళ్లీ ఇంత కన్నా ఎక్కువ సంక్షేమం చేస్తామని ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. మరి అంతటి తన సంక్షేమానికి అప్పులు ఎలా చేస్తావని ప్రశ్నిస్తే..సంపద సృష్టిస్తా, అనుభవజ్ఞుడినని మాట్లాడితే ప్రజలు నమ్మరని మంత్రి తెలిపారు. కర్ణాటక, తమిళనాడు, ప్రస్తుత ప్రభుత్వ మేనిఫెస్టోలను కాపీ కొట్టి కొత్త మేనిఫెస్టోని టీడీపీ రూపొందించిందన్నారు.
రాబడి విషయానికొస్తే, చంద్రబాబు పాలనలో వార్షిక వృద్ధి రేటు 1999 నుంచి 2004 వరకూ పరిశీలిస్తే.. రాష్ట్ర రాబడి 12.4 శాతం కాగా, వైఎస్ గారి హయాంలో రాబడి 21.6 శాతంగా పేర్కొన్నారు. గత టీడీపీ ఐదేళ్ల పాలనలో ఏపీ రాబడి గమనిస్తే..6 శాతం మాత్రమేనన్నారు. సీఎం వైఎస్ జగన్ గారి హయాంలో అది ఏకంగా 16.7 శాతానికి పెరగడం జరిగిందన్నారు. ఎవరి హయాంలో పెరిగింది, ఎవరి హయాంలో పడిపోయిందో రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలన్నారు. స్థూల ఉత్పత్తిని పరిగణలోకి తీసుకుంటే 2014-19 ఐదేళ్ల కాలంలో సగటున రూ.6. 95 లక్షల కోట్లు కాగా, 2019-23 నాలుగేళ్ల కాలంలో సగటున రూ.10.84 లక్షల కోట్లన్నారు. ఎవరి హయాంలో సంపద సృష్టి జరిగిందో ప్రతిపక్షాలు కూడా కళ్లు తెరచి చూడాలన్నారు.
విద్యుత్ బకాయిలు ప్రభుత్వం నుంచి రావాల్సినవి గణాంకాలు పరిశీలిస్తే..2014-19 కాలంలో కేవలం రూ.20,165 కోట్లు బకాయిలు తీర్చగా..గత నాలుగేళ్లలోనే ఈ ప్రభుత్వం రూ.55,808 కోట్లు విద్యుత్ బకాయిలు చెల్లించడం జరిగిందన్నారు.
*రాష్ట్రానికి కేంద్ర సహకారం ఉండకూడదనే దుర్బుద్ధిః*
ఇదిలాఉంటే, నాకొక మిలియన్ డాలర్ల ప్రశ్న ఏంటంటే, ఈ పచ్చమీడియా, కొంతమంది రాజకీయ నాయకులు, ఎవరైతే తమకు తాము ఆర్థికనిపుణులమంటూ స్వయంగా ప్రకటించుకుంటున్నారో వారికి ఈ రెండు మూడేళ్లుగానే రాష్ట్రం అప్పులు చేస్తున్నట్లు కనిపిస్తుందా..? ఈ రాష్ట్ర అప్పులు, ఆర్థికంపైన వారంతగా దిగులు పడటానికి కారణాలేంటి..? మరి, ఇదే దిగులు, ఆవేదన, ఆందోళన పదేళ్ల కిందట, ఐదేళ్ల కిందట కూడా ఉండాలికదా..? అప్పుడు రాని ఆవేశాలు, ఆందోళనలు ఇప్పుడే ఎందుకు కనిపిస్తున్నాయి..? వారి ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు. ఎవరెవరికో లేఖలు రాస్తారు. వినతిపత్రాలు సమర్పిస్తారు. నేరుగా కేంద్రానికి ఫిర్యాదులు కూడా చేస్తారు. ఏతావాతా, మనమంతా అర్ధం చేసుకోవాల్సిందేమిటంటే, కేంద్రం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో సహకరించకూడదనేది వారి తాపత్రయం. ఆంధ్రరాష్ట్రానికి మంచి జరగకూడదు. కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందకూడదనే దురాలోచనతో వారు ఇంత రాద్ధాంతం చేస్తున్నారని సగటు మనిషికి కూడా అర్ధమౌతుంది.
*కేంద్రం ఇచ్చిన సమాధానంపైనా వక్రీకరణలా..?*
పోనీ, వీరంతా కూడబలుక్కుని పార్లమెంట్‌లో ఒకతని చేత ప్రశ్నను సంధిస్తే.. దానికి స్వయంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి సమాధానమిస్తే వీరు నమ్మరు. అయితే, ఇక్కడ రాష్ట్ర బీజేపీ పగ్గాలు తీసుకున్న పురందేశ్వరి చెప్పే స్క్రిప్టు లెక్కల్ని మాత్రం బాగా నమ్ముతున్నారు. అక్కడ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫైనాన్స్ పంకజ్ చౌదరి గారు చెప్పింది నమ్మరు. పచ్చ పత్రికల్లో రాయరు. అదే ఇక్కడ మాత్రం బీజేపీ ప్రధాన కార్యదర్శి స్థాయి నేత మాట్లాడితే మాత్రం నమ్ముతారు. పచ్చ మీడియాలో ఫుల్ కవరేజీ ఇచ్చుకుంటారు. పోనీ, ఆర్బీఐ ఇచ్చిన నివేదికనైనా వారు పరిగణలోకి తీసుకుని నమ్ముతారేమో అనుకుంటే, అస్సలు మేం వాటిని నమ్మేదే లేదంటారు. ఇక్కడ స్వయం ప్రకటిత ఆర్థిక నిపుణుల విశ్లేషణలకు మాత్రం పేజీలకు పేజీల కవరేజీ ఇచ్చుకుని నమ్ముతారు. కాగ్ (సీఏజీ), (పీఏజీ) నివేదికలనూ నమ్మరు. ఊరుపేరులేని వ్యక్తి తానొక ఆర్థిక నిపుణుడ్ని అంటూ లెక్కలు చెబితే మాత్రం ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ఫుల్ కవరేజీని చూస్తాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిత్యం నిందిస్తూనే ఉంటామంటూ.. విషప్రచారం చేస్తున్న వారికి కేంద్ర మంత్రుల నుంచి గానీ ఇతర పెద్దపెద్ద వ్యవస్థల నుంచి గానీ వచ్చిన అధికార నివేదికలపై నమ్మకం ఉండదు. ఏదైతే, రాష్ట్రప్రభుత్వానికి వ్యతిరేకంగా, రాష్ట్రప్రభుత్వానికి సహకరించకుండా ఉన్న వాటిని మాత్రమే అపారంగా నమ్ముతామంటారు వారు.
*పక్కరాష్ట్రాల్లో ఉంటూ.. స్వరాష్ట్రంపై విమర్శలా..?*
2019లో వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలో వచ్చిన దగ్గర్నుంచి ప్రతిపక్షాలకు మా ప్రభుత్వమంటే గిట్టనే గిట్టడంలేదు. ‘మీరు పరిపాలన చేయలేరు’ ‘రాష్ట్రం తరఫున చేయాల్సిన అప్పులన్నీ మేమే చేశాం.. మీరు పాలన చేయడానికి పైసా లేదు’ అంటూ స్వయంగా అదే ప్రతిపక్ష నేతలు బహిరంగంగానే అన్నారు. సరేనని మా ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్నాం. ఆ తర్వాత ఏమన్నారంటే, ‘అసలు మీరు ప్రజలకు ఎలాంటి సంక్షేమాన్ని అందజేయలేరు’ అని విమర్శించారు. దానికీ, సరేనని మేము మూడేళ్లు పాలన పూర్తిచేశాం. ఆ తర్వాత మళ్లీ ఏమన్నారంటే, ‘మీ ప్రభుత్వం అప్పులు చేస్తుంది..’ అన్నారు. ఆవేశపడ్డారు. ఆందోళన పడ్డారు. చివరికి ఈ రాష్ట్ర అప్పులపై కేంద్రాన్నే ప్రశ్నించారు. మరి, కేంద్రమేమో ఈ రాష్ట్ర అప్పులు పరిమితంగానే ఉన్నాయని, నాలుగేళ్లలో వాస్తవ పరిస్థితులను కూడా తేటతెల్లంచేసింది. తమ ప్రశ్నకు దిమ్మదిరిగే సమాధానం వచ్చినందుకు ఇప్పుడు వారంతా నోరునొక్కుకుంటున్నారు.
దేశంలో 29 రాష్ట్రాలుంటే, రాష్ట్రానికో రూల్ ఉంటుందా..? అందరికీ ఒకటే రూల్స్ వర్తిస్తాయి కదా..? ఆ ప్రకారంగానే మన రాష్ట్రం కూడా కేంద్రం నిర్దేశించిన రూల్స్‌నే పాటిస్తూ.. ఆర్థికపరిస్థితిని బేలన్స్ చేసుకుంటూ ముందుకుపోతున్నాం. అలాంటిది, ప్రతిపక్షాలకు మాత్రం వాస్తవాలు గిట్టడంలేదు. రాష్ట్రప్రభుత్వం తరఫున మనం కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన విషయాలను గౌరవనీయ విధానాలతో సమర్పిస్తాం. మనకు నిర్దేశించిన పరిమితిలోనే ఆర్థికసహకారం తెచ్చుకుంటాం. మన రాష్ట్రం నుంచి రిప్రజెంటేషన్ గౌరవంగా జరుగుతుంది. కేంద్రంతో మనం మసలుకుంటున్న తీరును తెలియజేస్తుందన్న పరిస్థితి ఇది.
కోవిడ్ సమయంలో రెండుమూడు రోజులు ఆర్థికపరిస్థితిని బ్యాలెన్స్ చేసేక్రమంలో ఉద్యోగులకు జీతాలివ్వలేని ప్రభుత్వమంటూ ఇవే ప్రతిపక్షాలు విమర్శించారు. మేము మా విధానం మేరకు ఉద్యోగులు, జీతాలు అన్నింటినీ జాగ్రత్తగా చూసుకుంటుంటే.. మరోవైపు ఆంధ్రను అప్పుల్లో మరో శ్రీలంకను చేస్తున్నారంటూ గగ్గోలు పెట్టారు. అసలు, శ్రీలంకకు మన రాష్ట్రానికి ఏమైనా పోలిక, పొంతన ఉందా..? అది దేశం, మనది రాష్ట్రం. ఆర్థికపరిస్థితి, అప్పులు చేయడంలో దేశానికో విధానం, రాష్ట్రానికో పరిమిత విధానం ఉంటుంది. అవసరమైతే, డబ్బునోట్ల ప్రింటింగ్ కూడా దేశం చేసుకోవచ్చు. బహుశా ప్రతిపక్షాలుకు తెలియదేమో.. ఇదిలాఉంటే, మరో విచిత్రమైన అంశమేమంటే, ఇప్పటిదాకా మన రాష్ట్ర ఆర్థికం, అప్పులపై నిందలేసి విమర్శించేవారంతా ఈ రాష్ట్రంలో నివసించేవారు కాకపోవడం. పక్క రాష్ట్రాల్లో ఉంటూ అక్కడ పన్నులు కడుతూ ఈ రాష్ట్ర అప్పులు, ఆర్థిక పరిస్థితిపై మాట్లాడుతున్నారు, ఇది సిగ్గు చేటు అని మంత్రి బుగ్గన తీవ్రంగా విమర్శించారు.
————————-
Comments are closed.