*తేది: 17-05-2023*
*స్థలం: తాడేపల్లి*
*అమరావతిలోనూ పేదలకు ఇళ్ల స్థలాలు.. సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్*
అమరావతి పరిధిలో పేదలకు సొంత ఇళ్లు నిర్మించుకునే అవకాశం ఇవ్వాలన్న సీఎం జగన్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు హై కోర్టు అభ్యంతరాలను తోసిపుచ్చింది. అమరావతిలో ఇళ్ల స్థలాల కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వ వాదనకు వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు కొట్టి వేసింది. దీంతో అమరావతి ఇళ్ల స్థలాల కేటాయింపుకు లైన్ క్లియర్ అయ్యింది. హైకోర్టు ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ పై బుధవారం నాడు విచారన జరిగింది. ఈ సందర్భంగా ఇచ్చిన ఆఫిడవిట్ లో ఏపీ ప్రభుత్వం అమరావతిలోని ఆర్5 జోన్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చని ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే హక్కు రాష్ర్ట ప్రభుత్వానికి ఉందని బుధవారం తీర్పు వెలువరించింది. జస్టిస్ కె ఎం. జోసెఫ్ , జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది. ఆర్5 జోన్లో పట్టాల పంపిణీపై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి.
*చట్ట ప్రకారమే ఇళ్ల స్థలాల కేటాయింపులు..*
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే హక్కు ప్రభుత్వానికి ఉందని బెంచ్ తీర్పు ఇచ్చింది. చట్ట ప్రకారం ఐదు శాతం ఈడబ్ల్యూఎస్‌కు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అయితే కేసు తుది ఉత్తర్వులకు లోబడే ఇళ్ల పట్టాలపై హక్కులుంటాయని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణలో భాగంగా ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ ‘‘34వేల ఎకరాలలో 900 ఎకరాలు మాత్రమే పేదలకు కేటాయించాం. పది మంది రైతులు మాత్రమే ఇక్కడికి వచ్చారు. సీఆర్డీఏ చట్టం లోని సెక్షన్.53.1డి ప్రకారం పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉంది‘‘ అని వాదనలు వినిపించారు. సీఆర్డీఏ నుంచి సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ మాస్టర్ ప్లాన్ లో ఎలాంటి మార్పులు లేవని, చట్ట ప్రకారమే ఇళ్ల స్థలాలు ఇచ్చేలా చూస్తామని తెలిపారు.
Comments are closed.