The South9
The news is by your side.
after image

త్వరలో స్వాతి’ వారపత్రిక అధినేత వేమూరి బలరామ్ బయోపిక్!

*ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో ‘స్వాతి’ వారపత్రిక అధినేత వేమూరి బలరామ్ బయోపిక్*

 

తెలుగు పత్రికా ప్రపంచంలో స్వాతి ఓ సంచలనం. తెలుగు ప్రజలు అందరూ ప్రతి గురువారం ‘స్వాతి’ బుక్ కోసం ఎదురు చూస్తూ ఉంటారంటే అతిశయోక్తి కాదు. ఆ స్థాయి పాఠకాదరణ సొంతం చేసుకున్న, 40 ఏళ్ళుగా విజయవంతంగా నడుస్తున్న ఏకైక వారపత్రిక స్వాతి. గురువారాన్ని స్వాతి వారంగా పరిచయం చేసి, పాఠకులను దేవుళ్ళను చేసి, రచయితలను లక్షాధికారులను చేసిన మేరునగధీరుడు వేమూరి బలరామ్. ఇప్పుడు ఆయన జీవితం మీద ఓ బయోపిక్ రూపొందుతోంది. ఆ సినిమా టైటిల్ ‘స్వాతి బలరాం – అతడే ఒక సైన్యం’.

 

స్వాతి పత్రికాధినేత వేమూరి బలరామ్ జీవిత చిత్రం ‘స్వాతి బలరాం – అతడే ఒక సైన్యం’కి ప్రముఖ రచయిత, దర్శకుడు ప్రభాకర్ జైనీ శ్రీకారం చుట్టారు. ఇంతకు ముందు ఆయన దర్శకత్వంలో ‘క్యాంపస్ అంపశయ్య’, ‘ప్రణయ వీధుల్లో’, కాళోజీ నారాయణరావు బయోపిక్ ‘ప్రజాకవి కాళోజీ’ వచ్చాయి. జైనీ క్రియేషన్స్ పతాకంపై స్వాతి బలరామ్ బయోపిక్ ను విజయలక్ష్మీ జైనీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలో నటీనటులను ఎంపిక చేసి సెట్స్ మీదకు సినిమాను తీసుకు వెళ్లనున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు.

 

‘స్వాతి బలరాం అతడే ఒక సైన్యం’ గురించి దర్శకుడు ప్రభాకర్ జైనీ మాట్లాడుతూ ”పైపైన అందరూ విమర్శించినా… నూనూగు మీసమొచ్చిన ప్రతీ కుర్రవాడూ, పరికిణీ కట్టే వయసొచ్చిన ప్రతి ఆడపిల్లా, గత నలభై సంవత్సరాలుగా దిండు కింద దాచుకుని చదివిన ఏకైక వారపత్రిక స్వాతి. నవరసాల సాహిత్యంతో ప్రతీ ఒక్కరినీ అలరింప చేసిన సాహితీ సమరాంగణా సార్వభౌముడు బలరామ్ గారు.

 

బలరామ్ గారిని కలిసిన ఒక సందర్భంలో మాటల్లో ‘నా సాహిత్య ప్రస్థానం’ అన్న పరిచయ బుక్ లెట్ ఇచ్చాను. ఆయన అది చదువుతూ, నేను సినిమాలు తీస్తానని తెలుసుకుని సంతోషించారు. నేను చొరవగా, ‘కాళోజీ’ బయోపిక్ తీస్తున్నానని, అందులో ‘వందేమాతరం శ్రీనివాస్’ గారు పాడిన ఒక వీడియో పాటను, ల్యాప్ టాప్ లో చూపించాను. ఆయన గొప్పగా ఉందని ప్రశంసించారు. నన్ను తన పక్కనే కూర్చోమని చెప్పి మాట్లాడుతూ, కాఫీ తాగుతున్నప్పుడు, ఒక చిన్న ఆలోచన మదిలో మెదిలింది. వారిని అడగాలా వద్దా అని సంశయిస్తూనే,

 

‘సార్! మీ బయోపిక్ తీద్దాం’ అన్నాను.

 

Post Inner vinod found

ఆయన తన జీవితంలోని కొన్ని సంఘటనలు చెప్పినప్పుడు నా కళ్ళ ముందు దృశ్య రూపంలో మెదిలాయి. ఆయన జీవితంలో ఎన్నో విజయాలు సాధించినా… వాటి కన్నా ఎక్కువ విషాదాలు ఉన్నాయి. స్వాతిని ఈ స్థాయికి తేవడానికి 1970 మే 27 నుండి ఈ నాటికీ ఆయన నిరంతరం, శ్రమిస్తున్నారు. ఇవన్నీ ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది.

 

Post midle

‘క్యాంపస్ – అంపశయ్య’, ‘ప్రజాకవి కాళోజీ’ వంటి జీవిత చరిత్రలను తీసిన అనుభవంతో, ఈ సినిమా కూడా తీయగలనన్న నమ్మకంతోనే ఈ ప్రతిపాదన పెట్టాను. అప్పటికి ఖర్చు వంటి మిగతా విషయాలు ఏమీ ఆలోచించ లేదు. మనసులో మెదిలిన ఆలోచన బయట పెట్టాను. అతి చనువు తీసుకున్నానేమోనని కూడా అనిపించింది. ఎందుకంటే, అటువంటి ఆలోచన లేదు నాకు ఆ క్షణం ముందు వరకు కూడా. కానీ, ఆయన సమక్షంలో నాకు కలిగిన పాజిటివ్ వైబ్రేషన్స్ మూలంగా నాకు ఆ ఆలోచన వచ్చింది. ఆయన కూడా ఐదు నిముషాలు ఆలోచించి, తన ఆంతరంగీకులతో సంప్రదించి సరేనన్నారు.

 

బలరామ్ గారి దాతృత్వం గురించి అందరికి తెలిసిందే. అందుకే, ‘సినిమా కోసం మీ దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోను.’ అని నేను ఒక ముఖ్యమైన కండీషన్ పెట్టాను. దానికి ఆయన ఆశ్చర్యపోయి, ‘ఇప్పటి వరకు అందరూ నన్ను వాడుకున్నవారే బిడ్డా! నువ్వేమో ఇట్లా అంటున్నావు. సరే!’ అన్నారు.

 

ఆ విధంగా, అప్పుడూ, ఆ తర్వాత అనేక చర్చలు జరిగాయి. ఆయన గురించిన అనేక వివరాలు సేకరించాను. ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన జీవితాన్ని ప్రతిఫలించే విధంగా ఒక పాటను రికార్డ్ చేసి వారికి వినిపించాను.అటు తర్వాత రెండు మూడు రోజులు విజయవాడలోని వారింట్లో, ఆఫీసులో, కొడాలిలో, ఘంటసాలలో షూటింగ్ ఒక షెడ్యూల్ పూర్తి చేశాం.

 

ఇప్పుడు మిగిలిన షూటింగ్ కోసం వేమూరి బలరాం గారు యవ్వనంలో ఉన్నప్పుడు, మధ్య వయసులో ఉన్నప్పుడున్న పోలికలు కలిగిన నటుల కోసం వెతుకుతున్నాం. కొంత మంది వచ్చారు. వారి నుండి ఫైనలైజ్ చేయాలి. ఔత్సాహిక నటులు తమ ప్రొఫైల్స్, ఆడిషన్ వీడియోస్ balaram.biopic@gmail.com మెయిల్ ఐడీకి పంపగలరు. నాకైతే ఇదొక అద్భుతం అని అనిపిస్తుంది. ఒక అద్భుతమైన దృశ్యకావ్యంగా రూపుదిద్దుకుంటుందని నమ్మకంగా ఉంది” అని చెప్పారు.

 

‘స్వాతి బలరాం అతడే ఒక సైన్యం’ చిత్రానికి ఎడిటర్: రవికుమార్ కొండవీటి, స్టూడియో: డ్రీమ్ స్టూడియో, లిరిక్స్: ప్రభాకర్ జైనీ, కెమెరా: తిరుపతి రెడ్డి కోట, సంగీతం: శ్రీధర్ ఆత్రేయ, బ్యానర్: జైనీ క్రియేషన్స్, నిర్మాత: విజయలక్ష్మీ జైనీ, దర్శకత్వం: ప్రభాకర్ జైనీ.

 

#PrabhakarJaini #SwathiBalaram

Post midle

Comments are closed.