25-1-2023
*తాడేపల్లి*
*ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై చర్చకు సిద్ధమా?*
*దేశంలో 22 రాష్ట్రాల కంటే మిన్నగా ఏపీలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమం*
*టీడీపీపై తప్పుడు ప్రచారంపై మంత్రి ఆదిమూలపు సురేష్ ఫైర్*
*సబ్ ప్లాన్ గడువు పదేళ్ల పెంపుపై విషం చిమ్మడం న్యాయమా..*
ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ఖర్చు చేసిన నిధుల వాస్తవ లెక్కలపై చర్చకు సిద్ధమా అని మంత్రి ఆదిమూలపు సురేష్ సవాల్ విసిరారు. గత టీడీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం గత టీడీపీ ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసిందో ఆ పార్టీలో మంత్రులుగా పనిచేసిన వారికైనా పూర్తిగా తెలుసా అని ప్రశ్నించారు. చంద్రబాబు తన హాయంలో ఐదేళ్లలో ఎస్సీల కోసం చేసిన ఖర్చు కేవలం రూ.33,635 కోట్లు మాత్రమేనన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 2019–23 మధ్య ఈ మూడున్నరేళ్లలో ఎస్సీల సంక్షేమం కోసం రూ.48,898 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. అంటే గత ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన ఖర్చు కంటే, మూడున్నర ఏళ్లలోనే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.15,274 కోట్లు అదనంగా ఖర్చు చేసిందన్నారు. టీడీపీ హయాంలో కంటే 45.4 శాతం ఎక్కువ ఖర్చు చేసినట్లు వివరించారు. ఎస్టీల సంక్షేమం అంశంలో టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో గిరిజనుల కోసం రూ.12,487 కోట్లు చేయగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 2019–23 వరకు మూడున్నరేళ్లలో రూ.15,589 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. గత టీడీపీ ఐదేళ్లలో చేసిన ఖర్చు కంటే ఈ మూడేళ్లలోనే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ. 3,101 కోట్లు ఎక్కువ ఖర్చు చేసిందని ఇది 25 శాతం అదనంగా ఉన్నట్లు మంత్రి వివరించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నాడు జరిగిన మీడియా సమావేశంలో మంత్రి ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల ఖర్చుల వివరాలపై టీడీపీ తప్పుడు ప్రచారం, ఎల్లో మీడియాలో అసత్య కథనాలపై తీవ్రంగా మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీలను ఆర్థికంగా సమాజంలో ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని చూసే మనసున్న వ్యక్తి సీఎం జగన్ మాత్రమేనని మంత్రి వివరించారు. సబ్ ప్లాన్ నిధులపై తప్పుడు రాతలు రాస్తున్న ఎల్లో మీడియాకు టీడీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల మళ్లింపు లెక్కలు తెలియవా అని ప్రశ్నించారు.
*ఎస్సీ, ఎస్టీల సంక్షేమమే మా అజెండా..*
ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ ను మరో పదేళ్లు పొడిగించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో పేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లో సంతోషం వెల్లి విరుస్తోందని మంత్రి ఆదిమూలపు సరేష్ పేర్కొన్నారు. సీఎం జగన్ నిర్ణయంతో దళితులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుంటే టీడీపీ మాత్రం సబ్ ప్లాన్ గడువు పొడిగింపుపై విషం చిమ్ముతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు అన్ని రంగాల్లో రాణించేలా వారికి ఆర్థిక, విద్యా పరంగా వెసులుబాటును అందిస్తూ, సమాజంలో అసమానతలు తొలగించాలని తమ ప్రభుత్వం తపిస్తోందని వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం భారీ స్థాయిలో వ్యయం చేశామన్నది పూర్తి వాస్తవమని దీనిపై ఎలాంటి ఆడిట్‌కైనా తాము సిద్ధమని సవాల్ విసిరారు. ఎస్సీ ఎస్టీ ప్లాన్, నాన్ సబ్‌ప్లాన్ బదులుగా ఎస్సీ ఎస్టీ స్పెషల్ కాంపొనెంట్‌గా కేంద్రం మార్చిందని వివరించారు. ఐదేళ్ల కాలంలో ఒక రంగాన్ని తీసుకుని, ఎంత ఖర్చు చేయాలో కూడా కేంద్రమే దిశా నిర్దేశం చేసిందని మంత్రి తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో జనాభా దామాషాకు మించి ఎస్సీ ఎస్టీల కోసం ఖర్చు చేస్తున్నామన్నారు.
– అమ్మ ఒడి పథకంలో ఎస్సీల జనాభా దామాషా చూస్తే 16.4 శాతం ఉండగా ఆ పథకంలో ఎస్సీలకు రూ.4,007 కోట్లు వెచ్చించామని ఇది 20.3 శాతంగా ఉందని మంత్రి తెలిపారు.
– వాహనమిత్ర పథకంలో ఎస్సీల కోసం చేసిన ఖర్చు రూ.244.91 కోట్లు. అంటే జనాభా దామాషాను మించి 23 శాతం అధికంగా ఖర్చు చేసినట్లని వివరించారు.
– వసతి దీవెనలో 19.88 శాతం, విద్యాదీవెనలో 19.05 శాతం, విద్యాకానుకలో 19.84 శాతం వారి కోసం ఖర్చు చేశామని, అన్ని పథకాల్లోనూ 20 నుంచి 25 శాతం నిధులు ఎస్సీ ఎస్టీల కోసం ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు.
Comments are closed.