*18–01–2023*
*తాడేపల్లి*
*ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు*
*వ్యవసాయశాఖపై సీఎం జగన్ సమీక్ష*
*ఏప్రిల్ లో శాయిల్ టెస్టింగ్ తప్పనిసరి*
*ధాన్యం సేకరణ కొనసాగుతోందన్న అధికారులు*
*సేకరణ నిలిపివేత అని ఈనాడులో వచ్చిన కథనం అవాస్తవం*
ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా మిగిలిన సేకరణ కూడా జరగాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వ్యవసాయశాఖపై సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. రైతులకు ఎక్కడా నష్టంలేకుండా చూడాలని సూచించారు. ఇప్పుడున్న ప్రక్రియను మరింత బలోపేతం చేయాలన్నారు. రైతులకు మిల్లర్లతో పని ఉండకూడదు, ధాన్యం కొనుగోలు కేంద్రాలవద్ద విక్రయంతోనే రైతుల పని ముగుస్తుంది, ఆతర్వాత అంతా ప్రభుత్వానిదే బాధ్యత అని గుర్తు చేశారు.
*రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి*
రబీలో కూడా రైతులకు విత్తనాల పరంగాగాని, ఎరువుల పరంగాగాని ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా, ఆర్బీకేల ద్వారా రైతులకు ఎరువులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. ఏమైనా సమస్యలున్నా, మిల్లర్లు, మధ్యవర్తుల ప్రమేయం ఉన్నా ఫిర్యాదు చేయడానికి వీలుగా ఒక నంబర్‌ను ఏర్పాటు చేయాలని, రైతులు ఫిర్యాదు చేయగానే వెంటనే స్పందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
చంద్రబాబు హయాంలో ఏడాదికి ధాన్యం కొనుగోలు సేకరణకు సుమారు రూ.8వేల కోట్లు అయితే మన ప్రభుత్వం హయాంలో ఏకంగా రూ.15వేల కోట్లు సగటున ఏడాదికి ధాన్యం సేకరణకు పెడుతున్నామని సీఎం జగన్ తెలిపారు. అంతేకాదు ఎప్పుడూ లేని విధంగా రైతులకు అనుకున్న సమయానికే చెల్లింపులు జరుగుతున్నాయన్నారు.
*ఏప్రిల్ లో శాయిల్ టెస్టింగ్ తప్పనిసరి*
శాయిల్ టెస్టింగ్ ప్రతి ఏటా కూడా ఏప్రిల్ మాసంలో జరిగేలా చూసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. టెస్టు అయిన తర్వాత సర్టిఫికెట్లను రైతులకు ఇవ్వాలని తెలిపారు. ఫలితాలు ఆధారంగా ఎలాంటి పంటలు వేయాలన్నదానిపై రైతులకు మార్గనిర్దేశం చేయాలని సీఎం ఆదేశించారు. తద్వారా ఆ పంటకు అవసరమైన పోషకాలను సూచించాలన్నారు. భవిష్యత్తులో ప్రతి ఆర్బీకేలో కూడా శాయిల్ టెస్ట్ పరికరాలు ఉంచాలని.. దీనికి సంబంధించి శిక్షణ కార్యక్రమాలను కూడా రూపొందించుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రతి గ్రామంలో శాయిల్ టెస్టింగ్ తర్వాత మ్యాపింగ్ జరగాలని సూచించారు. దీనివల్ల ఎరువులు, రసాయనాల వినియోగం అవసరాలమేరకే జరుగుతుందని, రైతులకు పెట్టబడులు ఆదా అవడంతో పాటు, కాలుష్యం కూడా తగ్గుతుందని తెలిపారు. అదేవిధంగా, మాండస్ తుపాను వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చేందుకు సిద్ధంకావాలని అధికారులకు సీఎం ఆదేశించారు.
ఆహార ధాన్యాల ఉత్పత్తి, సేకరణపై అధికారులు సీఎంకు అందించిన వివరాలు;
2014–19 మధ్య ఆహార ధాన్యాల సగటు ఉత్పత్తి 153.95 లక్షల మెట్రిక్ టన్నులు కాగా.. 2019–20 నుంచి 2022–23 ఖరీప్ వరకూ సగటు ఆహారధాన్యాల ఉత్పత్తి 166.09 లక్షల మెట్రిక్ టన్నులు జరిగిందని అధికారులు సీఎంకు నివేదించారు. రబీకి సంబంధించి ఇ– క్రాప్ బుకింగ్ ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభిస్తామని వెల్లడించిన అధికారులు. మార్చి మొదటి వారంలో తుది జాబితా వెల్లడిస్తామని తెలిపారు.
*డ్రోన్ల పంపిణీకి అధికారుల కసరత్తులు*
ఆర్బీకేల స్థాయిలో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు, కిసాన్ డ్రోన్లు, రైతులకు 50శాతం సబ్సిడీతో వ్యక్తిగత వ్యవసాయ పరికరాల పంపిణీపై ప్రత్యేక దృష్టిపెట్టినట్టు అధికారులు సీఎంకు తెలిపారు. ఈ ఏడాది మార్చి, మే–జూన్ నెలల్లో ఈ కార్యక్రమాలను అమలు చేస్తామని అధికారులు వెల్లడించారు. 2వేల డ్రోన్లను పంపిణీ చేసేదిశగా కార్యాచరణ చేశామన్నారు. అందులో భాగంగా తొలివిడతగా రైతులకు 500 ఇస్తామని తెలిపారు. గత డిసెంబరు నుంచే డ్రోన్ల వినియోగంపై శిక్షణ ప్రారంభించామని.. శిక్షణ పొందినవారికి సర్టిఫికెట్లు ఇస్తున్నామన్నారు. అదేవిధంగా, ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ యూనివర్శిటీ ద్వారా శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
సీఎం ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలమేరకు ఇప్పటికే రైతులకు ధాన్యం సేకరణపై 89 శాతం చెల్లింపులు జరిగాయని అధికారులు వెల్లడించారు. సంక్రాంతి పండుగ వేళ ప్రభుత్వం రైతుల్లో సంతోషాన్ని నింపిందన్నారు. ఇప్పటివరకూ రూ. 5,373 కోట్లు విలువైన ధాన్యాన్ని సేకరించామన్న అధికారులు.. ఇంకా సేకరణ కొనసాగుతుందన్నారు. ఆయా ప్రాంతాల్లో పంటల సీజన్లను దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి రెండోవారం వరకూ సేకరణ కొనసాగుతుందని అధికారులు సీఎం జగన్ కు వివరించారు. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా 2023ను ప్రకటించిన నేపథ్యంలో చిరుధాన్యాల వినియోగంపై కార్యాచరణ రూపొందించామని అధికారులు సీఎంకు నివేదించారు.
*మరోవైపు, రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు నిలిపివేసినట్లు ఈనాడులో ప్రచురించిన కథనాన్ని ప్రభుత్వం ఖండించింది.*
ఈనాడు దిన పత్రికలో 18-01-2023న “ధాన్యం కొనుగోలు నిలిపివేత!” అను శీర్షికన వార్త ప్రచురించారు. రైతుల వద్ద ఇంకా నిల్వలు…. ఎదురు చూపులు, బ్యాంకు గ్యారంటీలు లేక…. కొనడానికి నిరాకరిస్తున్న మిల్లర్లు, రంగు మారిన ధాన్యం సేకరణకూ మొండి చెయ్యి అంటూ అవాస్తవాలను ప్రచురించారు. ధాన్యం సేకరణకు సంబంధించిన వాస్తవాలు ఇలా ఉన్నాయి.
*ధాన్యం కొనుగోలు నిలిపివేత పూర్తిగా అవాస్తవం:*
ధాన్యము కొనుగోళ్లు ఏ జిల్లాలోనూ నిలిపివేయలేదు. ప్రతిజిల్లా లోని రైతు భరోసా కేంద్రము పరిధిలో ధాన్యం సేకరణ కొనసాగుతున్నట్లు పేర్కొంది. ఏ రైతు వద్ద ధాన్యము నిల్వ లేదని నిర్దారించుకొన్న తర్వాతనే ధాన్యం సుకరణ ప్రక్రియను అక్కడ ముగించడం జరుగుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నిజ నిర్ధారణ(ఫ్యాక్ట్ చెక్) ద్వారా తెలియజేసింది
Comments are closed.