*ఏపీ అంతటా విస్తరించిన రుతుపవనాలు.. ఐదు రోజుల పాటు వర్షాలు!*
ఏపీ అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఫలితంగా రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్రా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గతంలో గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా మంచి వర్షాలు కురిసే అవకాశం ఉండగా, రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నది.
సాధారణంగా సీజన్ ప్రారంభంలో ఉత్తర కోస్తా ఆంధ్రలో వర్షాలు కురుస్తాయి. ఆ తర్వాత మిగిలిన కోస్తా ప్రాంతాలు, రాయలసీమలో మెల్లగా విస్తరిస్తుంది. అయితే ఈసారి ముందుగా రాయలసీమలో వర్షాలు కురిశాయి. కర్నూలు, కడప, అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఇదే సమయంలో కోస్తా ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో జూన్‌లో సరిపడా వర్షాలు కురియలేదు. అయితే, వచ్చే వారం కోస్తాలో వర్షాలు పెరిగి రాయలసీమలో తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది.
మరోవైపు, పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో కారణంగా మన వాతావరణంపై ప్రభావం చూపుతాయి. ఫలితంగా ఈ సీజన్‌లో రుతుపవనాలు మరింత ఉధృతమై మంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
Comments are closed.