The South9
The news is by your side.
after image

కొండా’ సినిమా చూశాక ప్రజల్లో ప్రశ్నించే తత్వం వస్తుందని ఆశిస్తున్నా – ప్రీ రిలీజ్ వేడుకలో కొండా సురేఖ

*’కొండా’ సినిమా చూశాక ప్రజల్లో ప్రశ్నించే తత్వం వస్తుందని ఆశిస్తున్నా – ప్రీ రిలీజ్ వేడుకలో కొండా సురేఖ

కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమా ‘కొండా’. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. కొండా మురళి పాత్రలో త్రిగుణ్‌, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ పతాకంపై సినిమా రూపొందింది. కొండా సుష్మితా పటేల్ నిర్మించారు. జూన్ 23న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం వరంగల్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు.

కొండా మురళి మాట్లాడుతూ ”కొండా మురళికి ఏం కష్టం ఉందని అనుకుంటారు. ముంబై మాఫియా, విజయవాడ రౌడీలను వర్మ చూశారు. మాజీ పోలీసులు, నక్సలైట్లను కలిసిన తర్వాత… తెలంగాణలో ఇంత కష్టపడిన మనిషి ఉంటాడా? అని నా జీవితాన్ని సినిమాగా తీస్తానని చెప్పారు. 30 ఏళ్ళ క్రితం నాకు పోలీసులు 50 శాతం, నక్సలైట్లు 50 శాతం సాయం చేశారు. రెండు వర్గాల సాయంతో నేను ఈ స్థాయికి వచ్చాను. ఆర్కే కనుసన్నల్లో నేను ఈ స్థాయికి వచ్చాను. నాకు సాయం చేసినవాళ్లను నేను మర్చిపోను. నా జీవితంలో ఆర్జీవీని మర్చిపోను. నా పాత్రలో త్రిగుణ్ బాగా నటించారు” అని అన్నారు.

కొండా సురేఖ మాట్లాడుతూ ”30 సంవత్సరాల మా జీవిత చరిత్రను రెండున్నర గంటల్లో ఎంతో ఇష్టంతో తీసినందుకు వర్మకి ఏం ఇచ్చుకున్నా మా రుణం తీర్చుకోలేం. అధికారం ఉంటే దయాకర్ రావు ఏం చేస్తారనే దానికి ఉదాహరణ ఈ రోజు రేవంత్ రెడ్డి ఇక్కడికి రాకపోవడం! ఇటువంటి సంఘటనలు మా జీవితంలో కోకొల్లలు ఉన్నాయి. కొండా మురళి నన్ను పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఈ రోజు నేను ఇలా ప్రజల ముందు నిలబడ్డాను. నా జీవిత చరిత్ర వారితో తెరకెక్కింది. సుష్మిత నా బంగారం. నాతో పాటు చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడింది. ఇక, ‘కొండా’లో మురళి గారి పాత్ర పోషించిన త్రిగుణ్‌ నా కొడుకు లాంటోడు. మా అమ్మాయి కంటే పదేళ్లు చిన్నోడు. మేడమ్ అని మెసేజ్ పెడితే… ‘అమ్మ’ అని పిలవమని చెప్పా. అప్పట్నుంచి అమ్మ అని పిలుస్తున్నాడు. మురళి గారి పాత్రలో బాగా చేశాడు. నా పాత్రలో ఇర్రా మోర్ కూడా బాగా నటించింది. ఇక్కడికి వచ్చిన వర్మ గారి కుటుంబ సభ్యులకు థాంక్స్. జూన్ 23 నుంచి థియేటర్లలో సినిమా చూడండి. ‘కొండా’ చూశాక… ప్రజల్లో ప్రశ్నించే తత్త్వం వస్తుందని ఆశిస్తున్నాను” అని అన్నారు.

కొండా సుష్మితా పటేల్ మాట్లాడుతూ ”కొండా మురళికి జన్మనిచ్చింది కొండా చెన్నమ్మ, కొండా కొమరయ్య అయితే… రాజకీయంగా పునర్జన్మ ఇచ్చిన వంచనగిరి గ్రామ ప్రజలకు, ఓరుగల్లు సోదర సోదరీమణులకు నా హృదయపూర్వక నమస్కారాలు, పాదాభివందనాలు. ‘కొండా’ సినిమా అనేది మన సినిమా. ఇన్ని రోజులు పెత్తందార్లు, పెద్దోళ్ళు సినిమా తీసుకున్నారు. కానీ, ఇప్పుడు మన సినిమా మనం రాసుకోగలిగే రోజులు వచ్చాయి. మన కథ మనం చెప్పే రోజులు వచ్చాయి. 35 ఏళ్ళ క్రితం కొండా మురళి, కొండా సురేఖ ఎలా ఉండేవారు? ఉద్యమ ప్రయాణం ఏంటి? కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకూ ఎదగడానికి కారణం ఏంటి? అంటే అణచివేత. ఆ అణచివేత ఎలా ఉంటుందనేది ఈ సినిమాలో కనిపిస్తుంది. సాయి పల్లవి వస్తే ఎర్రబెల్లి దయాకర్ రావు కార్పెట్లు వేశారట. కుర్చీలు వేశారట. నేను ముఖ్య అతిథిగా పిలిచిన టీపీసీసీ రేవంత్ రెడ్డిని ఆపారు. దయాకర్ రావు బతుకు మారదా? బతుకంతా భయంతో బతుకుతావా? ఎవరు ఏం చేసినా ఈ ఉద్యమం ఆగదు. కొండా అభిమానులు ఆగరు. కొండా మురళి ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంటారు. పైసల కోసమో, పదవుల కోసమో కొండా కుటుంబం పాకులాడదు. వాళ్ళ మైలేజ్ కోసం సినిమా తీయలేదు. సినిమా చూశాక కొండా మురళి వరంగల్‌లో పుట్టినందుకు గర్వంగా ఉందని ప్రజలందరూ ఫీలవుతారు. సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. కొండా దంపతులకు పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వాళ్ళు కలకాలం ప్రజాసేవలో ఉండాలని ఆశిస్తున్నాను” అని అన్నారు.

Post Inner vinod found

రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ ”కొండా మురళి, సురేఖ జీవించిన జీవితాన్ని రెండు గంటల్లో నాకు వీలైనంత బాగా సినిమా తీయడానికి ప్రయత్నించా. ఇవాళ రేవంత్ రెడ్డి అరెస్ట్ తర్వాత పోలీస్ స్టేషన్‌లో వీడియో చూసి ఉంటారు… కాళికాదేవిలా సురేఖ విశ్వరూపం చూపించారు. ఆవిడ మాటల్లో చూపిస్తే… కొండా మురళి చేతల్లో చూపిస్తారు. రెండూ ముఖ్యమే. మురళి చేతలు, సురేఖ మాటలు కలిస్తే దంపతులు అయ్యారు. ఇక, సినిమా బృందానికి వస్తే… నేను ఆశించిన దానికంటే త్రిగుణ్‌ ఎక్కువ చేశాడు. ఇర్రా మోర్ అద్భుతంగా నటించింది. అభిలాష్ మెయిన్ విలన్ రోల్ చేశాడు. భవిష్యత్తులో మరిన్ని సినిమాల్లో అతడిని చూస్తారు. ‘గాయం’లో ‘చెలి మీద చిటికెడు దయ రాదా…’ అని రొమాంటిక్ సాంగ్ తీశా. ఊర్మిళపై తీసిన ఆ పాటకు సుచిత్ర గారు కొరియోగ్రఫీ చేశారు. అప్పట్నుంచి మా ప్రయాణం కొనసాగుతోంది. గొప్ప గేయ రచయితల్లో ఒకరైన చంద్రబోస్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆయన ‘సురేఖమ్మ’ పాట రాశారు. సుచిత్ర ‘తెలంగాణ పోరి’ పాటకు కొరియోగ్రఫీ చేశారు. గద్దర్ పాటలు కొన్ని తీసుకున్నాం. డి.ఎస్.ఆర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు” అని చెప్పారు.

త్రిగుణ్‌ మాట్లాడుతూ ”కొండా అనేది పేరు కాదు, ఒక ఎమోషన్. వరంగల్‌లో కొండా అనేది ఎమోషన్. సినిమాలో ఆ ఎమోషన్ చూపించే అవకాశం నాకు దక్కింది. రా అండ్ రగ్గడ్ రోల్ చేశా. సినిమాలో ఒక సన్నివేశం చూసి సురేఖమ్మ ఫోన్ చేసి గంట సేపు మాట్లాడారు. ఎమోషనల్ అయ్యారు. నాకు అది కాంప్లిమెంట్. రామ్ గోపాల్ వర్మ అంటే ఒక వ్యసనం. నాకు 17 ఏళ్ళు ఉన్నప్పుడు సినిమాల్లోకి వచ్చా. ఆ రోజు నుంచి ఆయనతో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నాను. ఆయన ఫ్యామిలీకి తెలుసు. వాళ్ళింట్లో వాళ్ళందరితో చెప్పించాను. ‘నీ జీవితం నువ్వు బతుకు. ఎవరినీ చూడకు. ఎవరు చెప్పేదీ వినకు’ అని వర్మ చెప్పిన మాట నాకు చాలా చాలా నచ్చింది. అందుకే, ఆయన సినిమా చేశా. ఇన్నేళ్ళూ ఇండస్ట్రీలో నాకు నచ్చిన సినిమాలు నేను చేశా.

Post midle

ఇర్రా మోర్ మాట్లాడుతూ ”సురేఖమ్మ ఫైర్ బ్రాండ్. ఆమె పాత్రలో నటించే అవకాశం నాకు వచ్చిన వర్మకు థాంక్స్” అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో కొరియోగ్రాఫర్ సుచిత్రా చంద్రబోస్, అభిలాష్, పార్వతి, ‘ఆటో’ రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

అదిత్ అరుణ్‌, ఇర్రా మోర్‌, పృథ్వీరాజ్‌, తుల‌సి, ఎల్బీ శ్రీ‌రామ్‌, ‘ఆటో’ రామ్ ప్రసాద్, అభిలాష్ చౌద‌రి, శ్ర‌వ‌ణ్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిట‌ర్‌: మ‌నీష్ ఠాకూర్‌, ఛాయాగ్ర‌హ‌ణం: మ‌ల్హ‌ర్ భ‌ట్ జోషి, సంగీతం: డి.ఎస్‌.ఆర్‌, కో-డైరెక్ట‌ర్: అగ‌స్త్య మంజు, ద‌ర్శ‌క‌త్వం: రామ్ గోపాల్ వ‌ర్మ‌, నిర్మాత: కొండా సుష్మితా పటేల్.

Post midle

Comments are closed.