తేదీ: 15-06-2022,
అమరావతి.
*జూన్ 23న హిల్ టాప్ సెజ్ ఫుట్ వేర్ ఇండియా లిమిటెడ్ (అపాచి) పరిశ్రమకు భూమి పూజ : మంత్రి అమర్ నాథ్*
*ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభం*
*298 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే పరిశ్రమతో రూ.700 కోట్ల పెట్టుబడులు, 10వేల మందికి ఉపాధి అవకాశాలు*
*కోవిడ్-19 అనంతరం పూర్తిగా పారిశ్రామికాభివృద్ధిపై దృష్టి పెట్టిన ప్రభుత్వం*
*ఇకపై వరుస భూమిపూజలు, శంకుస్థాపనలతో రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం*
*ప్రారంభోత్సవ ఏర్పాట్లకు సంబంధించిన సమీక్షలో మంత్రి అమర్ నాథ్*
అమరావతి, జూన్, 15 : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం చుట్టిందని మంత్రి గుడివాడ అమర్ నాథ్ వెల్లడించారు. కోవిడ్-19 అనంతరం పరిశ్రమల ప్రగతిపైనే పూర్తిగా దృష్టి పెట్టినట్లు మంత్రి స్పష్టం చేశారు. మంగళగిరి ఏపీఐఐసీ భవనంలోని పరిశ్రమల మంత్రి కార్యాలయంలో మంత్రి అమర్ నాథ్ హిల్ టాప్ సెజ్ ఫుట్ వేర్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) నేతృత్వంలో రానున్న రోజుల్లో పారిశ్రామికాభివృద్ధికి శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి అమర్ నాథ్ పేర్కొన్నారు.
జూన్ 23న హిల్ టాప్ సెజ్ ఫుట్ వేర్ ఇండియా లిమిటెడ్ (అపాచి) పరిశ్రమకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించనున్నట్లు పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్ నాథ్ వెల్లడించారు. 298 ఎకరాల విస్తీర్ణంలో శ్రీకాళహస్తి మండలంలోని ఇనగలూరులో ఏర్పాటు కానున్న ఈ ఫుట్ వేర్ పరిశ్రమ ద్వారా రాష్ట్రానికి మరో రూ.700 కోట్ల పెట్టుబడులు, స్థానిక యువతకు 10వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని మంత్రి స్పష్టం చేశారు. ఈ పరిశ్రమ భూమిపూజతో మొదలై ఇకపై ఏపీకి పరిశ్రమల ప్రవాహం రాబోతుందని ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి తెలిపారు. గతంలో ఇంటెలిజెంట్ సెజ్ డెవలప్ మెంట్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది పేర్కొన్నారు. అడిడాస్ బ్రాండెడ్ షూస్ తయారీలో అపాచీ కీలకమని.. మనదేశంతో పాటు వియాత్నం, చైనాలోనూ అపాచీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్నారు. 2006లో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్సార్ హయాంలో తడలో తొలుత ఫ్యాక్టరీని ఏర్పాటు చేశామని గ్రూప్ జనరల్ మేనేజర్ సర్ జియోలి గుర్తు చేశారు. తడ ఫ్యాక్టరీ ద్వారా ప్రతి ఏటా కోటి 80 లక్షల ఉత్పత్తి జరగడమే కాకుండా 12 వేల మందికిపైగా ఉపాధి పొందుతున్నారన్నారు. పులివెందుల ఇండస్ట్రియల్ ఏరియాలో ఇటీవల ముఖ్యమంత్రి చేతుల మీదుగా అపాచీ లెదర్ ఇండస్ట్రీకి శంకుస్థాపన జరిగిందని వైస్ జనరల్ మేనేజర్ (బిజినెస్) గోవిందస్వామిముత్తు ప్రస్తావించారు.
ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి, వీసీ&ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది, తిరుపతి జాయింట్ కలెక్టర్ బాలాజీ , ఈడీ సుదర్శన్ బాబు, సీజీఎం(ఎసెట్ మేనేజ్మెంట్) లచ్చి రామ్, ఓఎస్డీ (ల్యాండ్స్) సాధన, జనరల్ మేనేజర్ గెల్లి ప్రసాద్, తిరుపతి జోనల్ మేనేజర్ షువాన సోని, తిరుపతి ఎస్డీసీ ఎల్ఏ యూనిట్ శ్రీనివాస్, పరిశ్రమల శాఖ సలహాదారు లంకా శ్రీధర్ ,హిల్ టాప్ సెజ్ ఫుట్ వేర్ ఇండియా లిమిటెడ్ (అపాచి) గ్రూప్ జనరల్ మేనేజర్ సర్ జియోలి, వైస్ జనరల్ మేనేజర్ (బిజినెస్) గోవిందస్వామిముత్తు, పీఆర్వో మేనేజర్ వి.మోహన్, పీఆర్వో అనిల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
———–
Comments are closed.