*విడుదలైన ఏపీ టెన్త్ పరీక్షా ఫలితాలు*
విద్యార్థులు, తల్లిదండ్రుల ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్ పెడుతూ ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. శనివారం అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డ ఫలితాలను సోమవారం విడుదల చేశారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. రెండేళ్ల తర్వాత జరిగిన పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు ఫలితాల కోసం www.results.bse.ap.gov.in వెబ్‌సైట్ లో ఫలితాలు చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ప్రతీసారి విద్యార్థుల ఫలితాలను గ్రేడ్‌ల రూపంలో అందించేవారు. కానీ ఈసారి మాత్రం గ్రేడ్‌లకు బదులు మార్కులను ప్రకటించారు.
పరీక్షలకు మొత్తం 6,21,799 మంది హాజరుకాగా 414281 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈసారి 67.72 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. వీరిలో బాలురు 64.02 శాతం, బాలికలు 70.70 శాతం పాస్ అయ్యారు. రాష్ట్రంలో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 78.30 శాతం మంది, అత్యల్పంగా అనంతపురంలో 49.70 శాతం ఉత్తీర్ణత సాధించారు.
విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు, ర్యాంకుల ప్రకటనలకు అడ్డుకట్ట వేసేందుకు గతంలో గ్రేడ్ల విధానం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దీనికి బదులు మార్కులను ప్రకటించనున్నారు. ఆర్మీ, ఇతరత్రా ఉద్యోగాలు, పై చదువుల ప్రవేశాలకు మార్కులు అవసరమవుతున్నాయని గ్రేడ్ల విధానాన్ని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు మొత్తం 6,21,799 విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,776 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఇక జూలై మొదటి లేదా రెండో వారంలో అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.
Comments are closed.