తేదీ: 06-05-2022,
అమరావతి.
*టెక్స్ టైల్ పార్కు ఏర్పాటుకు కొప్పర్తి అనువైన చోటు : ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి*
*వసతుల పరిశీలనకై ఏపీకి విచ్చేసిన కేంద్ర ప్రతినిధుల బృందం*
*రేపు వైఎస్ఆర్ జిల్లాలో ఉన్నతాధికారుల పర్యటన*
*మంగళగిరి కార్యాలయంలో ఏపీఐఐసీ ఛైర్మన్, ఎండీ, పరిశ్రమల శాఖ డైరెక్టర్ తో మర్యాదపూర్వక భేటీ*
అమరావతి, మే, 06 : టెక్స్ టైల్ పార్కు ఏర్పాటుకు వైఎస్ఆర్ జిల్లాలోని కొప్పర్తి అనువైన ప్రాంతమని ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం పారిశ్రామికాభివృద్ధి దిశగా పరుగులు పెడుతుందని ఆయన అన్నారు. ముఖ్యంగా కొప్పర్తి సమీపంలో ఇప్పటికే కడప స్పిన్నింగ్ మిల్స్, రాయలసీమ స్పిన్నర్స్, ఆదిత్య బిర్లా అప్పెరెల్ ఫ్యాక్టరీ, శ్రీరాజ్ టెక్స్టైల్ లిమిటెడ్, ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్ వంటి పరిశ్రమలతో ఆ ప్రాంతం కళకళలాడుతోందన్నారు. విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్, వైఎస్ఆర్ ఈఎంసీ, వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ (వైఎస్సార్ జేఎంఐ హెచ్)లు కొలువుదీరిన చోట కేంద్ర ప్రభుత్వం భారీ టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు చేయడం వల్ల వెనుకబడిన ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక పీఎం ..మిత్ర పార్క్ ద్వారా లక్ష మందికి ప్రత్యక్ష ఉపాధితో పాటు రెండు లక్షల మందికి పరోక్ష ఉపాధి లభిస్తుందని కేంద్రం అంచనా వేస్తున్న నేపథ్యంలో కర్నూలు, నెల్లూరు, కడప, చిత్తూరు, అనంతపురం, ప్రకాశం వంటి ప్రాంతాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. భారీ టెక్స్ టైల్ పార్కు ఏపీకి వస్తే ఎమ్ఎస్ఎమ్ఈ క్లస్టర్ల అభివృద్ధికి మరింత దోహదం చేస్తుందని ఎమ్ఎస్ఎమ్ఈ కార్పొరేషన్ ఛైర్మన్ వంకా రవీంద్రనాథ్ వెల్లడించారు.
మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో ఛైర్మన్ మెట్టుగోవిందరెడ్డి సహా పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన, ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాదితో కేంద్ర ప్రతినిధుల బృందం సమావేశమయ్యారు. అంతకుముందు కార్యాలయానికి వచ్చిన కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులను ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి, ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి అధికారులను శాలువాతో మర్యాదపూర్వకంగా సత్కరించారు.
పీఎం మిత్ర పార్క్స్ పథకానికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ టెక్స్ టైల్ పార్కు ఏర్పాటుకు అన్ని అవకాశాలున్నాయని పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ జియడ్ పెరెల్ (పీఎం మిత్ర) పథకం కింద ఏర్పాటుచేయతలపెట్టిన ఏడు టెక్స్టైల్ పార్కుల్లో ఒకటి రాష్ట్రంలో ఏర్పాటుచేసేలా కేంద్ర బృందం సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇక ప్రత్యేక రాయితీలు, అన్ని మౌలిక వసతులు కలిగిన వైఎస్సార్ జేఎంఐహెచ్.. టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు అనువైన ప్రదేశమని, ఆ ప్రాంతంలో జరుగుతున్న పారిశ్రామికాభివృద్ధి చూడాలని ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది కేంద్ర బృందాన్ని కోరారు. 1.3 లక్షల మంది సెమీ స్కిల్డ్, 21,511 మంది నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉన్నట్లు ఆయన వివరించారు. రాష్ట్రం నుంచి ఏటా రూ.3,615 కోట్ల విలువైన టెక్స్టైల్ ఎగుమతులు జరుగుతున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటికే కొప్పర్తిలో 1,188 ఎకరాల్లో టెక్స్ టైల్ పార్కు ఏర్పాటుచేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన మేరకు ఏపీ పర్యటనకు వచ్చినట్లు కేంద్ర టెక్స్ టైల్ శాఖ డైరెక్టర్ హెచ్.ఎస్ నంద, డిప్యూటీ సెక్రటరీ పూర్ణేందు కాంత్, కేంద్ర టెక్స్ టైల్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ధనశేఖరన్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర టెక్స్ టైల్ శాఖ డైరెక్టర్ హెచ్.ఎస్ నంద, డిప్యూటీ సెక్రటరీ పూర్ణేందు కాంత్, కేంద్ర టెక్స్ టైల్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ధనశేఖరన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన, ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది, ఏపీఐఐసీ ఈడీలు సుదర్శన్ బాబు, రాజేంద్ర ప్రసాద్, పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ వీఆర్వీఆర్ నాయక్, ఏపీఐఐసీ సీజీఎంలు, జీఎంలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
*రేపు వైఎస్ఆర్ జిల్లాలో కేంద్ర బృందం పర్యటన*
ఇటీవల కొప్పర్తి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, మౌలిక వసతుల ఏర్పాటును కేంద్ర బృందానికి ప్రత్యక్ష్యంగా చూపేందుకు ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుదర్శన్ బాబు నేతృత్వంలో అధికారులు వైఎస్ఆర్ జిల్లా వెళ్లాలని ఎండీ సుబ్రమణ్యం జవ్వాది ఆదేశించారు. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర ప్రతినిధుల బృందం సహా ఏపీఐఐసీ అధికారులు వైఎస్ఆర్ జిల్లా చేరుకున్నారు. శుక్రవారం రాత్రికి అక్కడే బస చేసి..శనివారం వారు కొప్పర్తిలో పర్యటించనున్నారు.
Comments are closed.