ముఖ్యమంత్రిగారి మాటలు” తల్లడిల్లిన మా హృదయాలను స్పృశించాయి, స్థైర్యం నింపాయి : మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి
తేదీ: 08-03-20222,
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా.
ముఖ్యమంత్రిగారి మాటలు” తల్లడిల్లిన మా హృదయాలను స్పృశించాయి, స్థైర్యం నింపాయి : మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి
దివంగత గౌతమ్ ఆశయాలు నెరవేరుస్తామని శాసనసభ వేదికగా ప్రకటించిన ముఖ్యమంత్రిగారికి రుణపడి ఉంటాం
“మృతజీవనుడంటూ” గౌతమ్ కి సంతాపం వ్యక్తం చేసిన అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ గారికి ధన్యవాదాలు
గౌతమ్ మృతి పట్ల భావోద్వేగంతో నివాళి పలికిన ‘శాసనసభకు’ మా కృతజ్ఞతలు
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, మార్చి, 08; శాసనసభ సాక్షిగా దివంగత మంత్రి మేకపాటి గురించి ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేస్తూ మాట్లాడిన మాటలు మేకపాటి కుటుంబ సభ్యుల హృదయాలను స్పృశించాయని, స్థైర్యాన్నీ నింపాయని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వెల్లడించారు. దివంగత గౌతమ్ ఆశలు, ఆశయాలు నెరవేరుస్తామని అసెంబ్లీ వేదికగా ప్రకటించిన సీఎంగారికి తాము ఎంతగానో రుణపడి ఉంటామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం ఇలా ప్రణాళిక, కార్యాచరణతో అభివృద్ధి చేయడానికి దివంగత మంత్రి గౌతమ్ తపనపడిన ప్రతి అంశాన్ని పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించడం పట్ల నెల్లూరు జిల్లా ప్రజల తరపున కృతజ్ఞాభినందనలు తెలియజేశారు. ముఖ్యంగా మెట్ట ప్రాంతమైన ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు సహా ప్రత్యేకించి మేకపాటి కుటుంబం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారికి వినమ్రంగా నమస్సులు తెలుపుతున్నట్లు మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగం బ్యారేజీని 6 వారాల్లో పూర్తి చేసి , ప్రారంభానికి ముఖ్యమంత్రి స్వయంగా ఆత్మకూరుకు వచ్చి, దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ పేరు పెడతామని ప్రకటించడం పట్ల పెద్దాయన ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
ఓ వైపు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ అంత్యక్రియలు జరుగుతుండగా, తండ్రిగా పుట్టెడు దు:ఖంలో ఉన్నప్పటికీ ప్రజల మేలు గురించి ఆలోచించి ముఖ్యమంత్రితో రాజమోహన్ రెడ్డితో చర్చించిన అంశాలను సభలో సీఎం ప్రస్తావించారు. భావోద్వేగం నిండిన స్వరంతో మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డి కోరినవన్నీ నెరవేర్చేందుకు సీఎం సుముఖత వ్యక్తం చేస్తూ ప్రకటించడం ముఖ్యమంత్రికి మేకపాటి కుటుంబం పట్ల గల ప్రేమాదరములకు నిదర్శనమని మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డి ప్రశంసించారు. ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (మెరిట్స్ ఇంజనీరింగ్ కాలేజీ) ని వ్యవసాయ, ఉద్యానవన కళాశాలగా తీర్చిదిద్దాలని తాను కోరినట్లుగానే చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పడం హర్షణీయమన్నారు. సోమశిల నీటి ప్రాజెక్టును రెండు దశల్లో కాకుండా ఒకే దశలో పూర్తి చేస్తామని, ఉదయగిరి పరిధిలో వెలిగొండ ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేయమని తాను అడిగినట్లుగానే వేగంగా చేయిస్తానని సీఎం చెప్పడం ఆయన విశాల హృదయానికి ఉదాహరణగా మాజీ ఎంపీ పేర్కొన్నారు. ఉదయగిరిలోని డిగ్రీ కాలేజీలో వసతులను మెరుగుపరచాలని కోరినట్లుగానే నాడు – నేడు కింద రెండో దశలో యుద్ధప్రాతిపాదికన సదుపాయాలను ఏర్పాటు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రికి మనసారా కృతజ్ఞతలు
తెలిపారు.
ముఖ్యమంత్రి అడుగులో అడుగేసి ఆఖరి శ్వాస వరకూ గీత దాటకుండా వెంట నడిచిన స్నే’హితుడి’కి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసలైన నివాళి పలికారని వైసీపీ సీనియర్ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు.
శాసనసభకు కృతజ్ఞతాభివందనం : మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి
దివంగత మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపట్ల శాసనసభ సంతాపం తెలపడంపై మాజీ ఎంపీ మేకపాటి శాసనసభ సభ్యులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. “మృతజీవనుడంటూ” గౌతమ్ కి ప్రగాఢ సంతాపం పలికిన అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాలలోకి గౌతమ్ వచ్చిన నాటి నుంచి తుది శ్వాస వరకూ ఆయనకు వెన్నుదన్నుగా నిలిచి, కుటుంబ సభ్యుడిలా చూసుకున్న శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కార్యకర్తలు, ప్రభుత్వ యంత్రాంగం సహా అందరికీ ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. దివంగత గౌతమ్ ముఖ్యమంత్రి బాటలో నడుస్తూ ఎంతో చేయాలనుకుని హఠాత్ పరిణామాలతో చేయలేకపోయిన అంశాలైన సోమేశ్వర ఆలయం, సోమశిల ప్రాజెక్టులను గుర్తు చేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లిన నెల్లూరు జిల్లా ఇంచార్జి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. స్వర్గీయ గౌతమ్ తో ఉన్న సాన్నిహిత్యం, స్నేహం జ్ఞాపకాలను తలుచుకుంటూ సభలో సంతాపం వ్యక్తం చేసిన శాసనసభ సభ్యులందరికీ మేకపాటి కుటుంబం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
Comments are closed.