The South9
The news is by your side.
after image

శాసనసభలో దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సంతాపతీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం  వైయస్‌.జగన్‌.

శాసనసభలో దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సంతాపతీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం  వైయస్‌.జగన్‌.

ఆంధ్రప్రదేశ్‌ శాససనభ సభ్యులు మేకపాటి గౌతంరెడ్డి  మృతిపట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ… శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుందన్న సీఎం.

ఆ తర్వాత చివరగా సీఎం  మాట్లాడుతూ…..

ఈ రోజు నా సహచరుడు, మిత్రుడు, మేకపాటి గౌతమ్‌ రెడ్డి ఇకలేరు అని చెప్పి ఊహించుకునేదానికి, ఆలోచన చేయడానికి కూడా మేమంతా చాలా కష్టపడాల్సిన పరిస్థితి.
నాకు, పార్టీకి, తాను చేసిన మంచి పనుల దృష్ట్యా రాష్ట్రానికి కూడా తాను లేకపోవడం నష్టమే అని కచ్చితంగా చెప్పగలను.

గౌతమ్‌ నాకు చిన్నతనం నుంచి స్నేహితుడు. స్నేహమే కాకుండా.. నాకంటే వయస్సులో ఒక సంవత్సరం పెద్దవాడు.
పెద్దవాడు అయినప్పటికీ కూడా ఏ రోజూ నన్ను స్వయంగా అన్న అనుకునేవాడు. అంత విశ్వసించేవాడు, అంత నమ్మకముంచేవాడు. నేనేదైనా చెబితే నాకేం కావాలి, నాకేం నచ్చుతుందని తాను తపించి చేసేవాడు. అటువంటి ఒక మంచి స్నేహితుడ్ని, మంచి ఎమ్మెల్యేని పోగొట్టుకున్నాను… గౌతమ్‌ ఇక లేరు అని అంటే నిజంగా జీర్ణించుకోలేని పరిస్థితి.
మంచి చదువులు చదివాడు. యూకేలో మాంఛెస్టర్‌ యూనివర్సిటీలో చదువులు పూర్తి చేసి ఇక్కడకి వచ్చి… రాజకీయాల్లో నేను తొలుత కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటకు అడుగులు వేసినప్పుడు తను రాజకీయాల్లో లేడు. వాళ్ల నాన్న అప్పట్లో కాంగ్రెస్‌ పార్టీలో ఎంపీగా ఉన్నారు. కానీ ఆ రోజుల్లో నేను ఈ స్ధానానికి వస్తానని బహుశా ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. నేను కూడా ఊహించి ఉండకపోవచ్చు. ఆ రోజుల్లో ఒక మేటర్‌ ఆఫ్‌ ప్రిన్సిపల్‌ కింద కాంగ్రెస్‌ పార్టీతో విభేదించడం, కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటకి రావడం, బయటకి వచ్చిన సందర్భంలో అతి తక్కువ మంది నాతోపాటు ఉండటానికి సాహసించారు. అటువంటి కొద్ది వ్యక్తులలో గౌతమ్‌ కూడా ఒకరు. ఆ రోజుల్లో తను ఇంకా పూర్తిగా రాజకీయాల్లో లేకపోయినా కూడా.. వాళ్ల నాన్న (రాజమోహన్‌ గారు) మీద తన ఇన్‌ఫ్లూయన్స్‌ ప్రభావితం చేసింది. రాజమోహన్‌ గారు నాతో నిలబడ్డానికి గౌతమ్‌తో నాకున్న స్నేహం, గౌతమ్‌కు నా పట్ల ఉన్న నమ్మకం, విశ్వాసం, నేను చేయగలుగుతాను అన్న నమ్మకం చాలా ముఖ్యంగా తనను నాతో నడిపించింది. తన కుటుంబాన్ని కూడా నా వెంట నడిపించే ప్రయత్నంలో అడుగులు ముందుకు వేశాడు. అటువంటి స్నేహితుడ్ని కోల్పోవడం నిజంగా బాధాకరమైన విషయం.

Post Inner vinod found

వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. మన కేబినెట్‌లో ఆరుశాఖలకు ప్రాతినిధ్యం వహించారు. ఇండస్ట్రీస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్‌మెంట్, ఐటీ అండ్‌ ఎలక్ట్రానిక్స్, హ్యాండ్ లూమ్‌ అండ్‌ టెక్ట్స్‌టైల్స్, షుగర్‌ ఇండస్ట్రీస్‌.. ఆరు శాఖలలో కూడా తాను సమర్ధవంతంగా పనిచేయడమే కాకుండా ఈ మధ్య కాలంలో దుబాయ్‌ ఎక్స్‌పోకు వెళ్లేముందు నన్ను కూడా కలిశాడు. ఆల్‌ ది బెస్ట్‌ అని నేను కూడా చెప్పాను. అక్కడకు వెళ్లి కూడా పేపర్లలోనూ, టీవీలలోనూ ప్రతిరోజు కనిపించేవాడు. ఫలానా వ్యక్తిని కలిశాను, ఫలానా ఇండస్ట్రీ కోసం తాపత్రయ పడుతున్నాం, కష్టపడుతున్నామని చెప్పి రోజూ సీఎంఓకు నాకు చూపించమని చెప్పి సోషల్‌ మీడియాలో పంపించేవాడు. పేపర్లో కూడా బాగా తన గురించి, తను కష్టపడిన తీరుగురించి బాగా రాయడం, మీడియా చెప్పడం జరిగింది. అలా అన్నిరకాలుగా బాగా చదువుకున్న వ్యక్తి, బాగా ఇంగ్లిషు మాట్లాడగలిగిన వ్యక్తి.
ఇండస్ట్రీస్‌ పరంగా రాష్ట్రంలో ఇంతకముందెప్పుడూ లేని విధంగా ముందుకు తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంకు, మన హయాంకు ఉన్న తేడా.. చిన్న ఉదాహరణ చెప్పాలి. గతంలో ఎప్పుడూ కూడా ఈ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు పేర్లు విని ఉండం. బజాంకాలు అని సెంచురీ ప్లైవుడ్‌ కడప జిల్లా బద్వేలులో రావడం, బంగర్‌లు అని శ్రీ సిమెంట్స్‌ ఫ్యాక్టరీ పెట్టడానికి అడుగులు ముందుకు పడుతున్నాయి. ఈ బజాంకాలు, బంగర్‌లు, సన్‌ఫార్మా దిలీప్‌ సంఘ్వీ, ఆదిత్య బిర్లా ఇంతవరకు ఆంధ్రరాష్ట్రంలో అడుగుపెట్టలేదు, మనతోనే అడుగుపెడుతున్నారు. ఆదానీలు కూడా మన ప్రభుత్వ హయాంలోనే రావడం జరిగింది. ఇటువంటి వాళ్ల పేర్లు అన్నీ గతంలో పేపర్లో చదివేదే తప్ప మన రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి ఏ రోజూ ముందుకు రాలేదు. ఇవన్నీ మన హయాంలో ఇప్పుడు జరుగుతున్నాయి. వీళ్లందరినీ తీసుకొచ్చే కార్యక్రమంలో తాను అవుట్‌ ఆఫ్‌ ది వే మాట్లాడటం, వాళ్లకు నమ్మకం ఇవ్వడం, వాళ్లను నా దగ్గరకు కూడా పిల్చుకురావడం, తద్వారా మరింత నమ్మకం ఇవ్వడం, వాళ్లు వచ్చే దాకా అన్నిరకాలుగా పారిశ్రామిక మంత్రిగా చేసిన కృషి చాలా ఉందని ఈ సందర్భంగా తనను కొనియాడుతూ చెప్తున్నాను.

అటువంటి మంచి వ్యక్తి, మంచి మంత్రి అన్నిరకాలుగా తోడుగా ఉన్న వ్యక్తి ఈ రోజు లేకపోవడం బాధాకరమైన విషయం. తాను లేకపోయినా కూడా తన కల, తన ప్రాంతానికి మంచి జరగాలన్న తన ఆశ కచ్చితంగా నెరవేరుస్తాం.
మొన్న గౌతం చనిపోయినప్పుడు రాజమోహన్‌ గారు అడిగిన కొన్ని విజ్ఞప్తులు… ఉదయగిరిలో ఉన్న మేకపాటి రాజమోహన్‌ రెడ్డి ఇనిస్టిట్యూట్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (మెరిట్స్‌) అని తన కాలేజీకు గౌతమ్‌ పేరు పెట్టి దానిని అగ్రికల్చర్‌ అండ్‌ హార్చికల్చర్‌కు అనువుగా మంచి బోధనా కాలేజీగా మార్చండని తను అడగడం జరిగింది. ఆ కాలేజీని ప్రభుత్వం తీసుకుంటుంది.. దానికి గౌతమ్‌ పేరు పెడుతుంది. ఆ కాలేజీకి తను ఆడిగినట్టుగా, ఆశించినట్టుగా ఒక మంచి అగ్రికల్చర్, హార్టికల్చర్‌ కోర్సులను తీసుకొచ్చి ఒక మంచి కాలేజీగా దాన్ని తయారు చేస్తాం.

Post midle

అదే రకంగా రాజమోహన్‌ గారు ఆ రోజు చాలా ఉద్విగ్నంగా వెలుగొండ పరిధిలో ఉదయగిరి ప్రాంతాన్ని కూడా పేజ్‌ 2లో కాకుండా పేజ్‌ 1లో తీసుకొచ్చి వేగవంతంగా పనులు పూర్తి చేయడానికి ఉదయగిరి ప్రాంతానికి నీళ్లివ్వాలని తను ఎమోషనల్‌గా రిక్వెస్ట్‌ చేసిన మాటలను కూడా కచ్చితంగా నెరవేరుస్తాము. ఉదయగిరి ప్రాంతానికి ఫేజ్‌ 1లో నీళ్లు తీసుకొచ్చి, వెలుగొండ ప్రాజెక్టు పనులను కూడా యుద్ధ ప్రాతిపదికన అడుగులు ముందుకు వేయిస్తాం.

ఉదయగిరి డిగ్రీ కాలేజీలో వసతులు మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు. నాడు–నేడు రెండో దశలో ఆ కాలేజీకి కూడా మెరుగులు దిద్దుతాం. రాజమోహన్‌ గారు అడిగిన మూడు విషయాలను కచ్చితంగా చేస్తామని ఈ సభ ద్వారా భరోసా ఇస్తున్నాం.

అంతే కాకుండా గౌతమ్‌ను చిరస్ధాయిగా గుర్తించుకునేలా.. జిల్లా ప్రజల్లో తన స్ధానం మర్చిపోకుండా ఉండేలా… మరో ఆరు వారాల్లో సంగం బ్యారేజ్‌ ప్రాజెక్టు పనులు పూర్తవుతాయి. యుద్ధ ప్రాతిపదికన పనులన్నీ మంత్రి అనిల్‌ పూర్తి చేయిస్తున్నారు. ఆరు వారాల్లో ప్రాజెక్టు పూర్తి చేసి, దానికి మేకపాటి గౌతమ్‌ సంగం బ్యారేజ్‌ అని పేరు పెట్టి ప్రారంభిస్తాం.

తాను ఎక్కడ ఉన్నా.. మంచివాడు కాబట్టి పైలోకంలో తనకు దేవుడు కూడా చల్లగా చూస్తాడని, తాను లేకపోయినా తన కుటుంబసభ్యులకు దేవుడి చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ.. ఆ కుటుంబానికి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న ప్రతి శాసనసభ్యుడు, ప్రతి మంత్రి కూడా ఎప్పుడూ అండగా, తోడుగా ఉంటారని భరోసా ఇస్తున్నాను.
తన కుటుంబానికి మంచి జరగాలని మరొక్కసారి కోరుకుంటూ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని సీఎం  వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు.

Post midle

Comments are closed.