ఎపిఎస్‌ఎస్‌డిసి- అపిటాలతో ఐఎస్ బి హైదరాబాద్ ఒప్పందం
* యువత ఉపాధి పొందేలా నైపుణ్యాలు అందించడమే లక్ష్యం
* బిహేవియరల్ స్కిల్స్, బిజినెస్ లిటరసీ తదితర కోర్సుల్లో శిక్షణ
* ఒక్కో కోర్సులో 40 గంటల పాటు శిక్షణ
* శిక్షణ పూర్తి చేసిన వారికి జాయింట్ సర్టిఫికేషన్
రాష్ట్రంలోని ఔత్సాహిక యువత, విద్యార్థులు ఉద్యోగాలు పొందేలా నైపుణ్య శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐ.ఎస్.బి)తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఎస్ బి కార్యాలయంలో ఎపిఎస్‌ఎస్‌డిసి చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి సమక్షంలో ఎపిఎస్‌ఎస్‌డిసి ఎండి ఎన్. బంగారరాజు, ఐఎస్ బి ప్రొఫెసెర్ దీపమణిలు బిహేవియరల్ స్కిల్స్, (ప్రవర్తనా నైపుణ్యాలు), బిజినెస్ లిటరసీ స్కిల్స్ (వ్యాపార అక్షరాస్యత నైపుణ్యాలు)పై శిక్షణ ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు.
అనంతరం ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ సీఈవో అనిల్ కుమార్ టెంటు, ఐఎస్బి ప్రొఫెసర్ దీపమణిలు డిజిటల్ లిటరసీ(డిజిటల్ అక్షరాస్యత), ఎంటర్ ప్రినియల్ లిటరసీ స్కిల్స్ పై ఒప్పందం చేసుకున్నారు. నూతన జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ)లో వస్తున్నమార్పులకు తగ్గట్టుగా ఎంపిక చేసిన కోర్సులలో శిక్షణను ఇవ్వడం కోసం ఐఎస్ బితో ఈ ఒప్పందం చేసుకున్నారు. ఔత్సాహికవేత్తలు, నిరుద్యోగ యువతకు మార్కెట్ లో ఉన్న ధరకంటే చాలా తక్కువ ఫీజుతో నైపుణ్య శిక్షణ ఇవ్వడంతోపాటు పరిశ్రమలలో ఉద్యోగాలు పొందడానికి అనుగుణంగా యువతను తీర్చిదిద్దాలన్నదే ఈ ఒప్పందం యొక్క ముఖ్య లక్ష్యం.
ఎపిఎస్‌ఎస్‌డిసితో ఐఎస్బి చేసుకున్న ఒప్పందంలో బిజినెస్ లిటరసీ ప్రోగ్రామ్ కింద ఫౌండేషనల్ లెర్నింగ్, ఫంక్షనల్ లెర్నింగ్, మేనేజ్మెంట్ లెర్నింగ్ అంశాలపై 40 పాటు శిక్షణ ఇస్తారు. అలాగే బిహేవియరల్ స్కిల్స్ ప్రోగ్రామ్ కింద మేనేజింగ్ సెల్ఫ్, మేనేజింగ్ ఇంటర్ పర్సనల్ ఇంటరాక్షన్స్, వర్కింగ్ ఎఫెక్టివ్ లి ఇన్ ఆర్గనైజేషన్స్ అంశాలపై 40 గంటల పాటు శిక్షణ ఇస్తారు. ఈ కోర్సులను ఐఎస్బి మార్కెట్ లో ఉన్న రేట్ల కంటే తక్కువ ఫీజుకు అందించనుంది. కోర్సులు విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఏపీఎస్‌ఎస్‌డీసీ, ఐ.ఎస్.బి సంయుక్తంగా సర్టిఫికేట్ ప్రదానం చేస్తుంది.
ఈ సందర్భంగా ఎపిఎస్‌ఎస్‌డిసి ఎండి ఎన్. బంగారరాజు మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో బిహేవియరల్ స్కిల్స్, బిజినెస్ లిటరసీ ప్రోగ్రామ్ స్కిల్స్ ప్రతి విద్యార్థికి అవసరమని అందువల్లే ఐఎస్ బి లాంటి సంస్థలతో కలిసి శిక్షణ ఇవ్వనున్నామన్నారు. ఈ శిక్షణ ద్వారా యువత ఉద్యోగాలు చేసేందుకు అవసరమైన నైపుణ్యాలు పొందుతారని చెప్పారు. యువతకు విద్యతోపాటు సాఫ్ట్ స్కిల్స్ లాంటి ఇతర నైపుణ్యాలు కల్పించాలన్న కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని ఆయన చెప్పారు.
అంతకుముందు ఈ ఎంవోయూ కార్యక్రమానికి ఆన్ లైన్ ద్వారా హాజరైన ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఐఎస్ బి లాంటి సంస్థలు ఇచ్చే కోర్సుల్లో శిక్షణ పొందడం ద్వారా విద్యార్థులు, యువతలో విశ్వాసం పెరుగుతుందని..ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అనంతరం ఐఎస్బి ప్రొఫెసర్, డిప్యూటీ డీన్ దీపమణి, ప్రొఫెసర్ డిప్యూటీ డీన్ మదన్ పిల్లుట్ల మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నైపుణ్య శిక్షణా కార్యక్రమాల్లో తాము కూడా భాగస్వాములు కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులను అంచనా వేసి.. వాటిని అందిపుచ్చుకునేలా ఈ కోర్సులను ప్రత్యేకంగా రూపొందించామని.. ఇవి విద్యార్థులు, ఔత్సాహికవేత్తలకు ఎంతో ఉపయోగతాయన్నారు.
ఈ కార్యక్రమంలో ఎపిఎస్‌ఎస్‌డిసి చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డితోపాటు ఎపిఎస్‌ఎస్‌డిసి ఎండి ఎన్. బంగారరాజు, అపిటా సీఈవో అనిల్ కుమార్, ఎపిఎస్‌ఎస్‌డిసి సీజీఎం సత్యప్రభ, ఐఎస్బి ప్రొఫెసర్, డిప్యూటీ డీన్ దీపమణి, ప్రొఫెసర్ డిప్యూటీ డీన్ మదన్ పిల్లుట్ల, ఐఎస్బి ఎక్స్ట్రనల్ రిలేషన్స్ డైరెక్టర్ అండ్ హెడ్ డీఎన్వీ కుమారగురుతోపాటు అపిటా అధికారులు పాల్గొన్నారు.
Comments are closed.