The South9
The news is by your side.
after image

అందుకే ఆయన టెక్నీషియన్ విలువ తెల్సిన రామానాయుడు.. కథారచయిత లక్ష్మీ భూపాల

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ది ప్రత్యేకమైన స్థానం. ఈరోజు సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ అధినేత దివంగత ‌ డి. రామానాయుడు జయంతి … చలనచిత్ర పరిశ్రమకి వారు చేసిన సేవలు అజరామరం ఎంతోమంది దర్శకులు ను, రచయితలను పరిశ్రమకు పరిచయం చేసిన మహోన్నతమైన వ్యక్తి డి రామానాయుడు.  కథ రచయితల పట్ల ఆయన ప్రవర్తన గురించి…. ప్రముఖ రచయిత లక్ష్మీ భూపాల్ కి ఎదురైన సంఘటన ని,తన ఫేస్ బుక్ వాల్ ద్వారా అందరితో పంచుకున్నారు… పూర్తి కథాంశం మీకోసం…

రామానాయుడు గారి పుట్టినరోజున విషయం పాతదే.. నేను గీసిన బొమ్మ కొత్తది..

రామానాయుడు స్టూడియోలో ఒక రూంలో సోఫాలో కూర్చుని, కాలుమీద కాలు వేస్కుని, ఆ సపోర్ట్ పైన పాడ్ పెట్టుకుని సీరియస్ గా ఒక కామెడీ సీన్ రాస్తున్నా.. మెల్లగా కిర్రుమని చప్పుడు చేస్తూ తలుపు తెరుచుకుంది.. తల పూర్తిగా ఎత్తకుండా కళ్ళు మాత్రం ఎత్తిచూసా.. ఎదురుగా నిర్మాత రామానాయుడు గారు… చప్పున కళ్ళు దించేసా… ఇప్పుడు ఆయన మీదున్న గౌరవం కొద్దీ కాలుమీద కాలు తియ్యాలా, వద్దా?, అలాచేస్తే ఆ పొజిషన్ లో కూర్చున్నందుకు ఆయన నన్ను ఏమైనా అనుకుంటారా?……… ఇలా ఆలోచించుకుంటూ తల ఎత్తకుండా రాసుకుంటూ ఉండిపోయా.. . ఆయన మాత్రం ఎలా తీసారో అంతే మెల్లగా మళ్ళీ తలుపు మూసేసారు.. కానీ అప్పుడు కూడా కిర్రుమని చప్పుడు వచ్చింది… “పోనీలే ఇబ్బంది పెట్టకుండా వెళ్లిపోయారు హమ్మయ్య” అని ఊపిరి పీల్చుకున్నా…. ఇంతలో తలుపు బయట నాయుడు గారి మాటలు గుసగుసల్లో వినిపించాయి…
“బాబూ ఆ కార్పెంటర్ని రమ్మను… లోపల రైటర్ గారు రాసుకుంటున్నారు… తలుపుకి గ్రీజ్ పెట్టండి.. సౌండ్ వస్తే డిస్టర్బ్ అవుతారు….”
నిజానికి నాకది మొదటి సినిమా.. నేనెవరో, నా పేరేంటో కూడా ఆయనకు తెలుసని నేననుకోను..సీన్స్ రాస్తూ కనిపించాను కాబట్టి రైటర్ అనుకునివుంటారు… అయినా ఆయన నోటినుండి వచ్చిన మాట ‘రైటర్ గారు’..

ఈమధ్య ఒక సినిమా ఆఫీసులో కూర్చుని నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ సీన్స్ చాలా దీక్షగా రాస్తున్నా… అవి చాలా ముఖ్యమైన కీలకమైన సన్నివేశాలు.. నా ఏకాగ్రత మొత్తం కేంద్రీకరించి ఒళ్ళు దగ్గర పెట్టుకుని, మైండ్ ని ఆ సన్నివేశం జరిగే ప్రదేశంలో పాత్రల మధ్య రహస్యంగా పెట్టి ఎమోషన్ అనుభవిస్తూ రాయాలి…. నేను రాస్తున్నా… అయితే అదే గదిలో ఒక పక్క డైరెక్టర్ ఫోన్లో ఆరోజు రిలీజ్ అయిన సినిమా గురించి ఫైనాన్షియర్ తో జోకులేస్తున్నాడు.. అదే గదిలో కో డైరెక్టర్ ఆర్టిస్టులతో డేట్స్ మాట్లాడుతున్నాడు… అసిస్టెంట్ డైరెక్టర్స్ చాలా హడావుడి గా డైరెక్టర్ దగ్గర మార్కులు కొట్టేయడానికి పెద్దపెద్దగా పనుల గురించి డిస్కషన్ పెట్టారు… నేను లేచి బయట బాల్కనీలోకెళ్లి రోడ్డు మీద ట్రాఫిక్ సౌండ్స్ వినిపించే చోట, అవకాశాల కోసం వచ్చి కూర్చుని మాట్లాడుకునే జనాల మధ్య కూర్చుని రాయాల్సివచ్చింది..

ఈ రెండు సంఘటనల్లో ఒక రచయితకు గౌరవం ఇచ్చారా, లేదా అన్నది కాదు ప్రశ్న… రచనకు, మాటకు, ఆ మాటలు రాయడానికి రచయిత పడుతున్న శ్రమకు, ప్రేక్షకుల చేత అన్నిరకాల ఎమోషన్స్ బయటకు రప్పించి సినిమా విజయంలో కీలకపాత్ర వహించే అక్షరాలకు ఎవరు ఎలాంటి ప్రాముఖ్యత ఇచ్చారు అన్నది పాయింట్…

అందుకే ఆయన టెక్నీషియన్ విలువ తెల్సిన రామానాయుడు..

Post Inner vinod found

ఇంకోసారి… అర్ధరాత్రి వరకు రామానాయుడు స్టూడియోలో షూటింగ్ అయ్యాక నేను నెక్స్ట్ డే షూటింగ్ సీన్స్ రాస్తూ రూంలో ఉండిపోయాను.. ఆల్రెడీ షూటింగ్ అలసట వల్ల అందరూ నన్ను మర్చిపోయి వెళ్లిపోయారు… నేను బయటకొచ్చి చూస్తే టైమ్ రాత్రి 12.30.. నా దగ్గర ఏ వాహనం లేదు.. అప్పుడే ఒక కార్ నా పక్కనుండి వెళ్తూ ఆగింది.. మళ్ళీ నాయుడు గారే.. విషయం తెల్సుకుని నన్ను మా ఇంటివరకు ఆయన కార్లో డ్రాప్ చేశారు….

Post midle

అందుకే ఆయన సాటిమనిషి కష్టం తెల్సిన రామానాయుడు..

ఇలా ఆయనతో నాకు చాలా అనుభవాలున్నాయి..నాలాగే ఎంతోమందికి ఎన్నెన్నో అనుభవాలున్నాయి..
‘బలాదూర్’ అనే సినిమా సెట్లో… ఒక ట్రాలీ అసిస్టెంట్ వల్ల షాట్ 3,4 టేకులు పడుతుంటే, అతన్ని తప్పుకోమని,కరెక్ట్ టైమింగ్ లో ఆయన కెమేరా ఉన్న ట్రాలీ తొయ్యడం చూసాను…
స్క్రిప్ట్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో చూసాను.. ఒక అరిస్టు సీన్లో డైలాగ్స్ చెప్తుంటే, ఎవర్నీ ఇబ్బంది పెట్టకుండా, ఒక మూలగా నిలబడి, ఆ డైలాగ్స్ ని ఆర్టిస్ట్ కంటే ముందే నాయుడు గారు నోట్లో గొణుక్కుంటూ నిశితంగా ఫాలో అవ్వడం చూసాను..
ఏరోజూ సెట్లో డైరెక్ట్ గా ఆర్టిస్ట్ కి నటన గురించి కానీ, డైరెక్టర్ కి షాట్ గురించి కానీ చెప్పడం నేనెప్పుడూ చూడలేదు… నేను చూసినంతవరకు కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ అణా పైసలతో సహా మాట్లాడిన రెమ్యునరేషన్ ఇచ్చారు…

ఎవరి స్వేచ్ఛ వాళ్ళకిచ్చారు..
ఎవరి విలువ వాళ్ళకిచ్చారు..
ఎవరూ చెయ్యలేని విధంగా నూటికి పైగా సినిమాలు తీసి, గిన్నిస్ బుక్ రికార్డ్స్ కెక్కి మూవీ మొఘల్ అనిపించుకున్నారు..

నిర్మాత ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉండాలో, ఎక్కడ ఉండకూడదో తేడాలు స్పష్టంగా తెల్సిన నిజమైన నిర్మాత రామానాయుడు గారు.. ఎందుకో ఈమధ్య చాలామంది నిర్మాతల్ని చూస్తుంటే ఆయన లేనిలోటు బాగా తెలుస్తోంది…

మిస్ యూ సర్ ?
జన్మదిన శుభాకాంక్షలు ?

…. లక్ష్మీ భూపాల ✍️

Post midle

Comments are closed.