రాబోయే నెల రోజుల్లో 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ పూర్తి
* రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్
అమరావతి: రాష్ట్రంలో 45 ఏళ్లు పైబడిన వారికి ఇప్పటికే 50 శాతానికి పైగా కనీసం ఒక వ్యాక్సిన్ వేశామని, రాబోయే నెల రోజుల్లో మిగిలిన వారందరికీ పూర్తి స్థాయిలో టీకాలు వేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు పెంచిన స్టయిఫండ్ ను గతేడాది సెప్టెంబర్ నుంచి వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 24 గంటల్లో 88,441 శాంపిళ్లు పరీక్షించగా, 10,373 కరోనా కేసులు నమోదయ్యాయని, 80 మంది మృతి చెందారని తెలిపారు. శుక్రవారం 85,311 శాంపిళ్లు పరీక్షించగా,, 10,413 కరోనా కేసులు నమోదయ్యాయని, 83 మంది మృతి చెందారని వెల్లడించారు. గత రెండ్రోజుల నుంచి రాష్ట్రంలో కరోనా కేసులు 10 వేలకు అటు ఇటుగా నమోదవుతున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం మధ్యాహ్నానికి 1,774 ఐసీయూ బెడ్లు, 8,164 ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. శుక్రవారం చూస్తే 1,664 ఐసీయూ బెడ్లు, 8,186 ఆక్సిజన్ బెడ్లు ఖాళీగా ఉన్నాయన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లలోనూ రోజు రోజుకూ కరోనా బాధితుల సంఖ్య తగ్గుతూ వస్తోందన్నారు. శనివారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొవిడ్ కేర్ సెంటర్లలో 12,247 మంది చికిత్స పొందుతున్నారన్నారు. 3,247 మంది డిశ్ఛార్జి కాగా, 1,248 మంది వివిధ ఆసుపత్రుల్లో అడ్మిషన్ పొందారన్నారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం రోజువారీగా 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయించగా, కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో గడిచిన 24 గంటల్లో 406 మెట్రిక్ టన్నులు ఆక్సిజన్, శుక్రవారం 356 మెట్రిక్ టన్నులను డ్రా చేశామన్నారు. రాష్ట్రంలో 1,460 బ్లాక్ ఫంగస్ కేసులను గుర్తించామన్నారు. 104 కాల్ సెంటర్ కు వస్తున్న ఫోన్ కాల్స్ సంఖ్య కూడా రోజు రోజుకూ తగ్గుతోందన్నారు. గడిచిన 24 గంటల్లో 3,061 ఫోన్ కాల్స్ రాగా, శుక్రవారం 3,351 కాల్స్ వచ్చాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హోం ఐసోలేషన్ లో ఉన్న 24,706 మంది కరోనా బాధితులతో టెలీ కాల్ మెడిసిన్ సెంటర్ ద్వారా వైద్యులు ఫోన్ చేసి మాట్లాడారన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులతో పాటు మరణాల రేటు కూడా తగ్గుముఖం పడుతోందన్నారు.
నెల రోజుల్లో 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ పూర్తి
రాబోయే నెల రోజుల్లో 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 1,06,47,444 డోసులు పంపిణీ చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. వాటిలో 25,65,162 మందికి రెండు డోసులు, 55,13,120 మందికి ఒక డోసు వేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద శుక్రవారం సాయంత్రానికి 3,22,220 డోసుల స్టాక్ ఉందని, వాటిని శనివారం పంపిణీ చేసేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు, 45 ఏళ్లు పైబడిన వారికి 53.08 శాతం మేర కనీసం ఒక డోసు వ్యాక్సిన్ వేశామన్నారు. రాష్ట్రంలో 45 ఏళ్లు పైబడిన వారికి 1,33,07,889 మంది ఉండగా, వారిలో. 18,66,082 మందికి రెండు డోసులు, 47,91,032 మందికి ఒక డోసు వేశామన్నారు. 45 ఏళ్లు పైబడిన జనాభాలో 50 శాతం మందికి కనీసం ఒక టీకా వేసినట్లు ఆయన తెలిపారు.
వైద్య సిబ్బంది కరోనా చికిత్సకయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది…
కరోనాతో కారంచేడు పీహెచ్సీ వైద్యులు డాక్డర్ ఎన్ భాస్కరరరావు తీవ్ర అస్వస్థతకు గురై, సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్నారన్నారు. డాక్టర్ భాస్కరరావుకు మెరుగైన వైద్యమందించడానికి రూ.1.50 కోట్లను సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సాయమందించారన్నారు. ఇటువంటి కేసులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు రూ.45 వేల నుంచి 70 వేల వరకూ పెంచిన స్టయిఫండ్ ను గతేడాది సెప్టెంబర్ నుంచి వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జనవరి నుంచి అమలు చేయాలని తొలుత భావించామని, సెప్టెంబర్ 2020 నుంచి పెంచిన స్టయిఫండ్ అందజేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారన్నారు. కొవిడ్ విధుల్లో పాల్గొంటున్న మూడో సంవత్సరం చదువుతున్న పీజీ విద్యార్థులకు కూడా పెరిగిన స్టయిఫండ్ ను అందించనున్నట్లు ఆయన తెలిపారు. పీజీ విద్యార్థులు ఏప్రిల్ 30 తరవాత విధుల్లోకి చేరారని, ఆనాటి నుంచి పెంచిన స్టయిఫండ్ అందిస్తామని తెలిపారు. వారి వార్షిక పరీక్షలను జులై లో నిర్వహించడానికి హెల్త్ యూనివర్శిటీ నిర్వహించనునందన్నారు. పరీక్షల్లో పాల్గొన్నా జులై 31 వరకూ పెంచిన స్టయిఫండ్ ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారన్నారు. రాష్ట్ర్ర స్థాయి కొవిడ్ కమాండ్ కంట్రోల్ కమిటీ సమావేశం శనివారం జరిగిందన్నారు. ఈ సమావేశంలో థర్డ్ వేవ్ వస్తుందన్న సూచనల మేరకు, ఎంతమంది కరోనా బారిన పడతారో అంచనా వేసి వైద్య పరికరాలు, మందులు కొనుగోలుపైనా, ఐసీయూ బెడ్లు ఏర్పాటుపైనా చర్చించామన్నారు. జిల్లాల వారీగా డేటా సేకరించిన తరవాత ఆ కమిటీ ఇచ్చే రిపోర్టును సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళతామన్నారు..
Comments are closed.