ఆనందయ్య మందును
సంప్రదాయ మందుగా పంపిణీ చేసుకొవొచ్చు…
• రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్
• ఆయుర్వేదంగా గుర్తించం…
• కరోనా రెగ్యులర్ చికిత్ప పొందుతూ ఆనందయ్య మందు వినియోగించుకోవొచ్చు…
• మందు పంపిణీ సమయంలో క్యూలో కరోనా పేషెంట్లు నిల్చొవొద్దు…
• సత్ఫలితాలిస్తున్న కర్ఫ్యూ…అందుకే జూన్ 10 వరకూ పెంపు…
• మందు పంపిణీ తేదీ త్వరలో ప్రకటిస్తాం : ఆయూష్ కమిషనర్ రాములు
అమరావతి, మే 31 : మూడు రకాల ఆనందయ్య మందులను రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిందని, ఈ మందులను ఆయుర్వేదంగా గుర్తించడం లేదని, సంప్రదాయ మందుగా పంపిణీ చేసుకోవొచ్చునని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. కరోనా బాధితులు ప్రభుత్వమందిస్తున్న రెగ్యూలర్ ట్రీట్ మెంట్ పొందుతూ సప్లమెంట్ గా ఆనందయ్య మందును వినియోగించుకోచ్చునన్నారు. ఆనందయ్య మందు పంపిణీ సందర్భంగా క్యూలో కరోనా పేషెంట్లు నిల్చోవొద్దని, బంధువుల ద్వారా తెప్పించుకుని వాడుకోవాలని స్పష్టం చేశారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 24 గంటల్లో 83,461 శాంపిళ్ల పరీక్షలు నిర్వహించగా, 7,943 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 98 మృతి చెందారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1461 ఐసీయూ బెడ్లు, 6,323 ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో, బెడ్ల ఖాళీ సంఖ్య రోసజు రోజుకూ పెరుగుతోందన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లలో ప్రస్తుతం 15,106 మంది చికిత్స పొందుతున్నారన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో 1,75,000 రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల నుంచి ఇండెంట్ తక్కువగా వస్తోందన్నారు. రోజువారీగా ఏపీకి కేంద్రం కేటాయించిన 590 టన్నుల ఆక్సిజన్ సోమవారం డ్రా చేశామన్నారు. కొద్ది రోజుల కిందట 800 టన్నుల వరకూ డ్రా చేశామని, కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఏపీకి కేటాయించిన మేరకే ఆక్సిజన్ డ్రా చేసుకుంటున్నామని తెలిపారు. 104 కాల్ సెంటర్ కు గడిచిన 24 గంటల్లో 3,885 ఫోన్ కాల్స్ వచ్చాయని, వాటిలో 599 కాల్స్ ఆసుపత్రుల్లో అడ్మిషన్ల కోసమని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా హోం ఐసోలేషన్లో 24,583 మంది చికిత్స పొందుతున్నారని, వారితో 4,733 మంది వైద్యులు టెలీ మెడిసిన్ కాల్ సెంటర్ ద్వారా ఫోన్లో మాట్లాడుతున్నారన్నారు. కరోనా బాధితుల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకుంటూ సలహాలు సూచనలు అందజేశారన్నారు.
బ్లాక్ ఫంగస్ నివారణ చికిత్సలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ
రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ 1,179 కేసులు నమోదయ్యాయని, ఆ వ్యాధి కారణంగా 14 మంది మృతి చెందారని తెలిపారు. 97 మంది వైద్య సేవలతో కోలుకున్నారని, 1068 మంది ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. 1,179 కేసుల్లో 1,139 మంది కరోనా బారిన పడినవారు ఉండగా, 40 మంది సాధారణ వ్యక్తులని తెలిపారు. 370 మంది ఆక్సిజన్ సపోర్టు తీసుకోగా, 687 మందికి స్టెరాయిడ్లు అందజేశారన్నారు. 743 మంది మధుమేహ బాధితులు బ్లాక్ ఫంగస్ బారినపడ్డారన్నారు. 18 ఏళ్లలోపు ముగ్గురిలో బ్లాక్ ఫంగస్ గుర్తించగా, 18 నుంచి 45 ఏళ్ల లోపు వారు 418 మంది ఉన్నారన్నారు. బ్లాక్ ఫంగస్ నివారణకు వినియోగించే ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్లు, ఇతర మందుల వినియోగంపై ఆయా ఆసుపత్రుల సిబ్బందికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ కూడా ఇస్తున్నామన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆదివారం సాయంత్రం వరకూ 14,924 మంది చికిత్స పొందుతుండగా, వారిలో 8,902 మంది ఆరోగ్య శ్రీ పథకం కింద వైద్య సేవలు పొందుతున్నారన్నారు. అనంతపురం, విజయనగరం జిల్లాలో అత్యధిక మంది ఆరోగ్య శ్రీ కింద వైద్య సేవలు పొందుతున్నారన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో 28,700 మంది చికిత్స పొందుతుండగా, వారిలో 22,413 మంది ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సేవలు పొందుతున్నారన్నారు.
కర్ఫ్యూతో కరోనా కేసుల తగ్గుముఖం…
రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజక వర్గంలోనూ మెడికల్ కాలేజీ ఉండాలనే ఉద్దేశంతో ఏడాదిగా ప్రణాలికలు సిద్ధం చేస్తున్నారన్నారు. దీనిలో భాగంగా 7,880 కోట్లతో 16 కాలేజీలకు గానూ 14 మెడికల్ కాలేజీలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం వర్చువల్ శంకుస్థాపన చేశారన్నారు. ఇంతకుముందే రెండుమెడికల్ కాలేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారన్నారు. ఒక రాష్ట్రంలో ఒకేసారి 14 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేయడం ఇదే మొదటిసారి అని తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపైనా సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్షించారన్నారు. రాష్ట్రంలో విధించిన కర్ఫ్యూను జూన్ 10వ తదీ వరకూ పెంచుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారన్నారు. కర్ఫ్యూ సందర్భంగా ఇప్పటికే అవలంభిస్తున్న నిబంధనలనే అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. గతంలో మాదిరిగానే ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ 144 సెక్షన్, .మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ అమలు చేస్తామన్నారు. తొలుత ఏపీలో 144 సెక్షన్, ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకూ కర్ఫ్యూ విధించడంపై , ఈ విధానం ఫెయిల్ అవుతుందంటూ కొన్ని మీడియాలో విమర్శలు వచ్చాయన్నారు. ఇపుడు కర్ఫ్యూ తో ఫలితాలు వస్తున్నాయన్నారు. పేదల ఆదాయానికి ఇబ్బంది పెట్టకుండా కొవిడ్ ను కంట్రోల్ చేయడానికి ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూ విధించిందన్నారు. మరికొన్ని రోజులు కర్ఫ్యూ విధిస్తే, ఇంకా కేసులు తగ్గొచ్చునని జూన్ 10 వరకూ పెంచామన్నారు.
మందు పంపిణీలో కొవిడ్ పేషెంట్లు క్యూ నిల్చొవొద్దు…
పీ, ఎల్, ఎఫ్ రకాల ఆనందయ్య మందులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిందని, ఈ మందును ఆయుర్వేదంగా గుర్తించడం లేదని, సంప్రదాయ మందుగా పంపిణీ చేసుకొవొచ్చునని ఆయన స్పష్టం చేశారు. ఆనందయ్య మందుతో నష్టం లేదని నిపుణులు తెలిపారన్నారు. ఈ మందు కొవిడ్ నివారణకు పనికొస్తుందని చెప్పడానికి ఆధారాలు లభించలేదన్నారు. కరోనా నివారణకు రెగ్యూలర్ చికిత్ప పొందుతూనే సప్లిమెంట్ గా ఆనందయ్య మందును వినియోగించుకోవొచ్చునన్నారు ఈ మందు పంపిణీ సందర్భంగా కొవిడ్ పాజిటివ్ పేషెంట్లు క్యూలో నిలబడ కూడదని, వారివల్ల అదే క్యూలో ఉండే మిగిలిన వారికి కరోన సోకే ప్రమాదముందని తెలిపారు. కొవిడ్ కేర్ సెంటర్లు, హోం ఐసోలేషన్లలో ఉన్న వారు తమ బంధువులతో తెప్పించుకుని వినియోగించుకోవాలన్నారు. ఆయూష్ తరఫున ఆనందయ్య మందు తయారీ చేయబోమన్నారు. ఈ మందు వినియోగంపై క్లినికల్ ట్రయల్స్ జరగలేదని, అందువల్ల ఆనందయ్య మందుతో ఎంత లాభం ఉంటుందో తెలియదని స్పష్టం చేశారు.
మందు పంపిణీ తేదీపై చర్చించి నిర్ణయం ప్రకటిస్తాం : ఆయూష్ కమిషనర్ రాములు
కృష్ణపట్నం మందు ఈ నెల 21, 22 తేదీల్లో ఆయూష్ టీమ్ నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య మందుల వివరాలను, శాంపిళ్లు సేకరించామని ఆయూష్ కమిషనర్ రాములు తెలిపారు. సేకరించిన శాంపిళ్లను ల్యాబ్ లకు పంపించి వివిధ టెస్టులు నిర్వహించామన్నారు. ఇందుకు కేంద్ర సంస్థ సాయం కూడా తీసుకున్నామన్నారు. ఆనందయ్య మందు తీసుకున్నవారి వివరాలను, వారి అభిప్రాయాలను సేకరణకు కేంద్ర సంస్థ సహాయం తీసుకున్నామన్నారు. ల్యాబ్ రిపోర్టులు, కేంద్ర సంస్థ నివేదికలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమగ్రంగా చర్చించారన్నారు. ఆనందయ్య మందులో పీ,ఎన్.ఎఫ్, కే తో పాటు కంటిలో వేసే మందు.. ఇలా అయిదు రకాలున్నాయన్నారు. కే శాంపిళ్లు ఇవ్వలేదని, కంటి లో వేసే మందు తక్కువ మందికే ఇచ్చామని ఆనందయ్య తెలిపారన్నారు. కే మందు మెటీరియిల్ లేకపోవడంతో తయారీవిధానం చూడలేకపోయామన్నారు. పీ, ఎల్, ఎఫ్ మందులు సంతృప్తికరంగా ఉన్నాయని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయనడానికి ఆధారాలు కనిపించలేదని తెలిపారు. ఈ మూడు రకాలు వినియోగానికి పనికొస్తాయని నిపుణులు తెలిపారన్నారు. ఈ మందులతో కొవిడ్ నయమవుతుందనడానికి ఆధారాలు లభించలేదన్నారు. అదే సమయంలో సైడ్ ఎఫెక్ట్ లు ఉన్నాయనడానికి కూడా ఆధారాల్లేవన్నారు. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకునే పీ.ఎల్.ఎఫ్ మందుల వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. కంటిలో వేసే మందుపై రిపోర్టులు మూడు వారాల్లో రావొచ్చునన్నారు. ఆనందయ్య మందు ఆయుర్వేదం కాదని తెలిపారు. కరోనా చికిత్స పొందే వారు రెగ్యులర్ మందు వాడుతూనే ఆనందయ్య మందును తీసుకోవాలని సూచించారు. ఇదే విషయం హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందన్నారు. పీ, ఎల్, ఎఫ్ మందుల వినియోగానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. కంటిలో వేసే మందు, కే మందుపై వివరాలను త్వరలో కోర్టుకు అందజేస్తామన్నారు. కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామన్నారు. ఆనందయ్య మందును ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందన్నారు. ముందుగా చెప్పిన విధంగానే పది రోజుల్లో నిర్ణయం ప్రకటించామన్నారు. జిల్లా అధికారులు, ఆనందయ్యతో చర్చించిన తరవాత మందు పంపిణీ తేదీని ప్రకటిస్తామన్నారు.
Next Post
Comments are closed.