గ్రేటర్ బరిలో నుంచి జనసేన తప్పుకోవడం బీజేపీకి లాభమా, నష్టమా, ఫలితం శూన్యమా? అనే విషయం పక్కనపెడితే.. పవన్ కల్యాణ్ కి మాత్రం వ్యక్తిగతంగా చాలా ప్రయోజనకరమైన నిర్ణయం అది.
నిన్నమొన్నటి వరకు పవన్ కల్యాణ్ చాతుర్మాస దీక్షలో, రాజకీయాలకు పూర్తి దూరంగా ఇంటికే పరిమితమయ్యారు. పోనీ పార్టీలో ఆయన తరపున గ్రౌండ్ వర్క్ చేసేవారు ఉన్నారా అంటే ఎవరూ లేరు.
ఇప్పటికిప్పుడు గ్రేటర్ లో అభ్యర్థుల్ని ప్రకటించడం, అసంతృప్తుల్ని బుజ్జగించడం, ప్రజలకు హామీలివ్వడం, ప్రచారాన్ని చేపట్టడం.. అన్నీ తలకు మించిన పని. అన్నిటికీ మించి టీఆర్ఎస్ ని టార్గెట్ చేసి తలంటించుకోవడం, భవిష్యత్తులో పవన్ కి మంచిది కాదు కూడా. అందుకే గ్రేటర్ బరిలో నుంచి గ్రేట్ ఎస్కేప్ అయ్యారు పవన్.
అయిష్టంగానే పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించినా.. లోలోపల పవన్ సంతోషం అంతా ఇంతా కాదు. తెలంగాణలో నాయకులు, కార్యకర్తలు అలిగితే అలిగారు, తిడితే తిట్టారు, సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ వస్తే వచ్చాయి.. కానీ పవన్ మాత్రం గ్రేటర్ తలనొప్పులకు దూరంగా ప్రశాంత జీవితం గడిపేందుకు అవకాశం దొరికింది. పైగా త్యాగరాజు అనే పెద్ద పేరు కూడా వచ్చేసింది.
వాస్తవాలు మాట్లాడుకుంటే.. గ్రేటర్ లో జనసేనకు అభిమానులున్నా.. 150 స్థానాల్లో ఒక్క చోట కూడా జనసేన విజయం సాధించే అవకాశాలు లేవని వారికి కూడా తెలుసు. ఏదో తెలంగాణలో కూడా పార్టీ బతికే ఉంది అని చెప్పుకోడానికి, గ్రేటర్ లో జనసేన పార్టీ అభ్యర్థి అని ప్రచారం చేసుకోడానికి మాత్రమే చాలామందికి ఈ ఎన్నికలు అవసరం అయ్యాయి. అలాంటి వారితో పార్టీకి ఎలాంటి ఉపయోగం లేదు.
ఒకవేళ వీరంతా బరిలో దిగి రేపు ఫలితాలు తేడా కొడితే ఒక్కరు కూడా కనిపించరు. మీడియాకి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత మాత్రం పవన్ కల్యాణ్ పై పడుతుంది. ఒక్క సీటు కూడా గెలవలేదు, కనీసం మీ అభ్యర్థికి 10 ఓట్లు కూడా రాలేదు, మీ వల్లే బీజేపీ కూడా నష్టపోయింది..
ఇలాంటి సవా లక్ష ప్రశ్నలు పవన్ కి ఎదురవుతాయి. పరోక్షంగా పవన్ ఏపీలో రెండు చోట్ల ఓడిపోయిన విషయం కూడా ప్రస్తావనకి వస్తుంది.ఈ బాధంతా లేకుండా ఇప్పుడు పవన్ ఫ్రీ-బర్డ్ అయిపోయారు.
గ్రేటర్ తలనొప్పి లేకుండా ప్రశాంతంగా ఉండేందుకే ఆయన కాడె పక్కనపడేశారు. బీజేపీ సాకు చూపించి ఎన్నికల నుంచి తప్పుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పి, ఆ వెంటనే బీజేపీ కోసం త్యాగం చేసినట్టు బిల్డప్ ఇచ్చి భలే తెలివైన డ్రామా నడిపించారు పవన్.
Comments are closed.