The South9
The news is by your side.
after image

18 ప్రశ్నలతో బండి సంజయ్‌కు హరీశ్ రావు లేఖ!

తెలంగాణలో నైతిక విలువలను మంట కలిపేలా బీజేపీ పనిచేస్తోందని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. సీలేరుని ఏపీకి ఇచ్చింది ఎవరు? అని ఆయన ప్రశ్నించారు. దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కి 18 ప్రశ్నలతో ఆయన బహిరంగ లేఖ రాశారు. తాను ఓ తెలంగాణ పౌరుడిగా ఈ లేఖ రాస్తున్నానని చెప్పుకొచ్చారు.

తన లేఖకు సంజయ్ స్పందిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేసిందని చెప్పారు. తాను పింఛన్లపై సవాలు చేస్తే సంజయ్ ఇప్పటివరకూ స్పందించలేదని తెలిపారు. ఏపీ పునర్విభజన చట్టంలో అప్పటి పది జిల్లాల సరిహద్దులతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అందులో ఏడు మండలాలను వేరే రాష్ట్రంలో కలపడం బీజేపీ చేసిన అన్యాయం కాదా? అని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రంలో అంతర్భాగమైన 460 మెగావాట్ల లోయర్ సీలేరు హైడల్ పవర్ ప్లాంటును బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు అప్పగించిందని అన్నారు. పరిహారం ఇవ్వకపోవడం బీజేపీ చేసిన దారుణమైన అన్యాయం కాదా? అని ఆయన నిలదీశారు. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉందని, విభజన చట్టంలో కూడా బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

అయితే, స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టును కేంద్రం ఎందుకు రద్దు చేసింది? అని ఆయన నిలదీశారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలని ఎప్పటి నుంచో వరంగల్ జిల్లా ప్రజలు ఉద్యమాలు చేశారని, బీజేపీ సర్కారు కాజీపేటకు మంజూరైన వ్యాగన్ ఫ్యాక్టరీని రద్దు చేసిందని ఆయన చెప్పారు.

Post Inner vinod found

నీటి కేటాయింపులు చేయకుండా ప్రాజెక్టుల విషయంలో తలెత్తే అభ్యంతరాలను బీజేపీ నేతలు ప్రోత్సహిస్తున్నారని, ఇది ఆ పార్టీ నేతల కపట నీతి కాదా? అని నిలదీశారు. తెలంగాణలోని నీటి పారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోవడం వివక్ష కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఆరేళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర ఉద్యోగులను భరిస్తోందని, ఏటా వెయ్యి కోట్ల భారం పడుతోందని, ఇది కేంద్ర ప్రభుత్వ నిష్క్రియాపరత్వం కాదా? అని లేఖలో హరీశ్ పేర్కొన్నారు.

ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం 1,855 కిలోమీటర్ల జాతీయ రహదారులకు నిధులు ఇవ్వలేదని ఆయన అన్నారు. తెలంగాణలో అర్హులైన అందరికీ కాకుండా కొంతమందికి మాత్రమే పింఛను ఇవ్వడంలో బీజేపీ ఉద్దేశం ఏమిటి? అని ఆయన లేఖలో ప్రశ్నించారు. వరంగల్ విమానాశ్రయాన్ని ఎందుకు పునరుద్ధరించడం లేదు? అని ఆయన ప్రశ్నించారు. టెక్స్ టైల్స్ అభివృద్ధి నిధులను తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదు? అని ఆయన నిలదీశారు.

ఆదిలాబాద్‌లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు కోరినా ఎందుకు పట్టించుకోవడం లేదు? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో విద్యా వసతుల పట్ల కేంద్ర సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరించట్లేదా? అని నిలదీశారు.

Post midle

హైదరాబాద్ నుంచి ఎంపీలుగా గెలిచి, కేంద్ర మంత్రులైన బీజేపీ నేతలు ఎందుకు మూసీ ప్రక్షాళనకు నిధులు తేవడం లేదు? అని ఆయన నిలదీశారు. ఏపీ విభజన బిల్లు ప్రకారం రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికోసం ఏటా రూ.450 కోట్లు ఇవ్వాలని ఆయన గుర్తు చేశారు. ఇవన్నీ ఎందుకు ఇవ్వట్లేదని హరీశ్ రావు లేఖలో ప్రశ్నించారు.
Tags: Harish Rao, TRS, Bandi Sanjay BJP, 18 questions to sandi sanjay

Post midle

Comments are closed.