బాలీవుడ్లో ట్రెండ్ సెట్ చేసిన కొన్ని సినిమాల్లో రంగీలా ఒకటి. ఈ సినిమా విడుదలై 25 ఏళ్లయింది. ఈ సందర్భంగా బాలీవుడ్ మీడియా ఈ సినిమా గురించి మంచి మంచి కథనాలు ఇస్తోంది. టీవీలు, వెబ్ సైట్లు, వీడియో ఫ్లాట్ ఫామ్స్‌లో కూడా ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు.
ఆ సినిమా తాలూకు నోస్టాల్జిక్ మూమెంట్స్‌ను గుర్తు చేస్తున్నారు. లెజెండరీ సినిమాలు ఇలా మైల్ స్టోన్ మార్క్‌ను అందుకున్నపుడు మీడియా దాన్ని సెలబ్రేట్ చేయడం మామూలే. ఐతే రంగీలా సినిమా సంబరాల్లో ఎక్కడా దాని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పేరు కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ చిత్ర ఆర్టిస్టులతో మాట్లాడుతున్నారు, ఇతర టెక్నీషియన్లతో మాట్లాడుతున్నారు. వారి అనుభవాలను ఇస్తున్నారు. కానీ ఎవ్వరూ వర్మను మాత్రం పట్టించుకోవడం లేదు.
ఒక సినిమా క్లాసిక్‌గా నిలిచిందీ అంటే.. అందులో మేజర్ క్రెడిట్ దర్శకుడికే వెళ్తుంది. ఇలాంటి సినిమాలు మైల్ స్టోన్ మార్కును అందుకున్నపుడు కచ్చితంగా దర్శకుడినే ముందు మీడియా సంప్రదిస్తుంది. అతనెలా ఈ సినిమాను తీర్చిదిద్దాడో అనుభవాలు రాబడుతుంది. ఆ దర్శకుడి పనితనాన్ని పొగుడుతారు. కానీ వర్మ విషయంలో అలా జరగట్లేదు. ఇదేమీ తొలిసారి కాదు. ఇంతకుముందు సత్య సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తయినపుడు కూడా ఇలాగే జరిగింది.
ఆ సినిమాకు రచన, దర్శకత్వ విభాగంలో పని చేసిన వాళ్లతో ఇంటర్వ్యూలు చేసింది బాలీవుడ్ మీడియా. వర్మను మాత్రం పట్టించుకోలేదు. అతడు తీసిన సినిమాను పొగుడుతూ.. తనను మాత్రం విస్మరించింది. ఒక దశ దాటాక నాసిరకం సినిమాలు తీయడం, అనవసర వివాదాల్లో తలదూర్చి స్థాయి తగ్గించుకోవడంతో వచ్చిన సమస్య ఇది. ఇప్పటికైనా తాను ఏ స్థితికి పడిపోయానో వర్మకు అర్థమవుతుందా?
Tags: ramgopal varma, rangeela 25 years, bollywood industry
Comments are closed.