36 అడుగులు దాటి ప్రవహిస్తున్న గోదావరి
ఎగువ ప్రాంతం నుండి భారీగా వస్తున్న వరద ప్రవాహానికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతూనే ఉంది. బుధవారం సాయంత్రానికి 29.5 అడుగులు ఉన్న నీటిమట్టం గురువారం సాయంత్రానికి 36 అడుగులకు చేరుకుంది. ఇది క్రమంగా పెరుగుతూ తెల్లవారేసరికి 38 అడుగుల వరకు చేరుకునే అవకాశం ఉన్నట్లు సిడబ్ల్యూసి అధికారులు తెలిపారు. తాలిపేరు ప్రాజెక్టులో కూడ భారీగా వరదనీరు చేరుకుంది. దీనితో 18 గేట్లు ఎత్తి 62,316 క్యూసెక్కుల నీటిని విడుదల చేసారు. ఇంకా 60,267 క్యూసెక్కుల నీరు తాలిపేరు ప్రాజెక్టులో నిల్వ ఉంది. గత వారం రోజులుగా అల్పపీడనంతో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలన్నీ నిండు కుండలా ఉన్నాయి.
ఎగువ ప్రాంతాల్లో కూడ జలశయాలు నిండుగా ఉండటంతో ప్రమాదస్థాయిని మించి ప్రవహించడంతో వరదనీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. దీని కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ యంవి రెడ్డి అధికారులను అప్రమత్తం చేసారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసారు. అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసారు. భద్రాచలం డివిజన్‌లోని మండలాలు , గ్రామాలు నీటితో మునిగిపోయాయి. వాగులు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని గ్రామాలకు ఇప్పటికే రహదారులు బంద్ అయ్యే పరిస్థితి కనపడుతుంది. కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం పట్టణంలోని కొన్ని కాలనీలు వర్షపు నీరు ఇండ్లలోకి చేరుకుంది. వీరిని ఆదుకోవాల్సిందిగా వివిధ రాజకీయ పార్టీలు కోరుతున్నాయి.
Comments are closed.