దేశంలో తొలి ప్లాస్మా బ్యాంక్ ఢిల్లీలో ఏర్పాటైంది. ఆ బ్యాంకును ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్లాస్మా డొనేట్ చేసేందుకు ముందుకు రావాలని ప్రజలను కోరారు. ‘ఐఎల్‌బీఎస్ ఆసుపత్రిలో ప్లాస్మా బ్యాంక్ ఏర్పాటు చేశాం. ప్లాస్మా ఇవ్వదలచిన వారు నేరుగా వచ్చినట్లయితే ప్రాథమిక పరీక్షలు పూర్తి చేసి ప్లాస్మా తీసుకుంటారు.
కొవిడ్‌కు వ్యాక్సిన్ వచ్చేంత వరకూ ప్లాస్మా థెరపీ ఉపయుక్తమవుతుంది. మరణాల సంఖ్య కూడా తగ్గుతుంది’ అని కేజ్రీవాల్ తెలిపారు. కొవిడ్–19 నుంచి కోలుకొని, 18 నుంచి 60 ఏళ్ల లోపు వయస్సు, 50 కిలోలకు పైగా బరువు ఉన్న వ్యక్తులు కొవిడ్ పేషెంట్ల కోసం ప్లాస్మా డొనేట్ చేయవచ్చన్నారు. మధుమేహం, రక్తపోటు, కేన్సర్స్‌తో బయటపడిన వారు, లివర్, కిడ్నీ, హృద్రోగ సమస్యలు ఉన్న వారు ప్లాస్మా డొనేట్ చేయడానికి అనర్హులని చెప్పారు. అర్హత కలిగి, ప్లాస్మా డొనేట్ చేసేందుకు ముందుకు వచ్చే వారు 1031కు కానీ వాట్సాప్ నెంబర్ 8800007722ను కానీ కాంటాక్ట్ చేయాలని కోరారు. అయితే, ఢిల్లీ ప్రభుత్వం ప్లాస్మా బ్యాంకును ఏర్పాటు చేయడాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు హర్షిస్తున్నారు.
Comments are closed.