హైదరాబాద్: కరోనాపై ఇంతకు ముందు ఇచ్చిన ఆదేశాలు ఎందుకు పట్టించుకోవడం లేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
గతంలో జారీ చేసిన ఆదేశాల అమలు పై ఈ నెల 17వ తేదీలోపు నివేదిక సమర్పించాలని, సంతృప్తి చెందకపోతే 20వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంత కుమారి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ రమేష్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని ధర్మాసనం ఆదేశించింది. నివేదిక సమర్పించకపోతే కోర్టు ధిక్కారణ కింద పరిగణించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
గతంలో ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని, అమలు చేయకపోతే ఎలా అని అడిగింది. రాష్ట్రంలో కంటైన్మెంట్ జోన్లలో విధానం ఏంటో తెలపాలని, ఏ విధంగా అమలు చేస్తున్నారో చెప్పాలన్నారు. ప్రతిరోజు రాత్రి 9 గంటలకు విడుదల చేస్తున్న మీడియ బుల్లెటిన్ లో అరకొర సమాచారం ఇస్తున్నారని, విభాగాల వారీగా ఇవ్వడం లేదని హైకోర్టు నిలదీసింది.
రాష్ట్రంలో ఇప్పటి వరకు రెండుసార్లు కేంద్ర బృందాలు పర్యటించాయిని, వారు ఇచ్చిన నివేదికలను హైకోర్టు ముందుంచాలని ఆదేశించింది. కేంద్ర బృందాలు ఎక్కడెక్కడ పర్యటించాయి, ఏ ఆదేశించాయనేది తెలియచేయాలని కోరింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాలుగు రోజుల పాటు నమూనాల సేకరణ నిలిపివేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మే 23వ తేదీ నుంచి జూన్ 23 వరకు ఎన్ని నమూనాలు సేకరించారు, ఎన్నింటిని పరీక్షించారో చెప్పాలని కోరింది. వైద్యులు, పారా మెడికల్ సిబ్బందికి ఎన్ని పీపీఈ కిట్లు అందచేశారు, ఎన్ని అందుబాటులో ఉన్నాయి, ఏప్రిల్ 21 నుంచి జూన్ 8, జూన్ 18న ఎన్ని కిట్లు అందచేశారో కూడా తెలియచేయాలని సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.
Comments are closed.